YS Sharmila : జగన్ నాకు అప్పు ఇచ్చారు... అదే అఫిడవిట్ లో చేర్చాను..! ఆస్తి వాటాపై షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు
21 April 2024, 19:37 IST
- YS Sharmila Affidavit : వైఎస్ షర్మిల(YS Sharmila) మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో చెల్లెలికి ఏ అన్న అయినా ఆస్తిలో వాటా ఇవ్వాలంటూ మాట్లాడారు. ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న అప్పులపై వివరణ ఇచ్చారు షర్మిల.
వైఎస్ షర్మిల
YS Sharmila : ఎన్నికల అఫిడవిట్(YS Sharmila Affidavit) లో సమర్పించన అప్పులపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆదివారం కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆమె…. సోదరుడు జగన్ తనకు అప్పు ఇచ్చారని..అదే విషయాన్ని అఫిడవిట్ లో చేర్చాను అని చెప్పారు షర్మిల. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “సమాజంలో నిజానికి చెల్లెలికి ఏ అన్న అయినా వాట ఇవ్వాలి. అది ఆడబిడ్డ హక్కు. ఆడబిడ్డ కు ఇవ్వాల్సిన హక్కు అన్నకు ఉంది. మేనమామగా కూడా భాధ్యత ఉంది. తల్లి తర్వాత తల్లి స్థానంలో నిలబడేది మేనమామ కాబట్టి. ఇది సహజంగా అందరు పాటించే నియమం. కొందరు చెల్లెళ్ళకు ఇవ్వాల్సిన అస్తి వాటాను తమ వాటాగా భావిస్తారు. తామేదో చెల్లెళ్ళకు గిఫ్ట్ గా ఇస్తున్నామని బిల్డప్ ఇస్తారు. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. ఒక్క కొసరు చెల్లెళ్ళకు ఇచ్చి అదికూడా అప్పు ఇచ్చినట్లు చూపిస్తారు. ఇది వాస్తవం...ఇది కుటుంబానికి మొత్తం తెలుసు...దేవుడికి తెలుసు” అంటూ కామెంట్స్ చేశారు వైఎస్ షర్మిల.
వైసీపీ నేతలకు ఇది సరికాదు….
వివేకా పర్సనల్ లైఫ్ ను తప్పుగా చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. ఇవి వికృత చర్యలు..దారుణమన్నారు. “ఆయన సుదీర్ఘ రాజకీయ నాయకుడు. ఆయన సేవలు మీరు వాడుకున్నారు. అప్పుడు లేని పర్శనల్ లైఫ్ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా..? తప్పుగా చేసి చూపించడం సరి కాదు. YCP నేతలకు చెప్తున్నాం ఇది కరెక్ట్ కాదు.మీకు ఇది తగదు. ప్రజా తీర్పులో అవకాశం ఉంది కాబట్టి అడుగుతున్నాం. ఎన్నికల్లో ప్రచారం కోసం వివేకా హత్య(Viveka Murder Case) ను వాడుతున్నాం అనేది కరెక్ట్ కాదు. నిందితులకు శిక్ష పడి అంటే మేము రోడ్ల మీదకు వచ్చే వాళ్ళం కాదు. సునీత రోడ్ల మీదకు వచ్చి న్యాయం కోసం కొంగుచాపేది కాదు. సీబీఐ స్పష్టంగా చెప్పింది. నిందితులు,హత్య చేయించిన వాళ్ళు ఒకే దగ్గర ఉన్నారు అని. గూగుల్ మ్యాప్స్ అన్ని అవినాష్ రెడ్డి ఇంట్లోనే చూపుతున్నాయి. ఫోన్ కాల్స్ రికార్డ్స్ ఉన్నాయి. హత్యకు సంబంధించి డబ్బు లావాదేవీలు జరిగాయి. అన్ని ఆధారాలు CBI దగ్గర ఉన్నాయి” అని షర్మిల అన్నారు.
సీబీఐ చెప్తేనే తనకు హత్య ఎవరు చేశారు అనేది తెలిసిందన్నారు వైఎస్ షర్మిల. “CBI హత్య అవినాష్ రెడ్డి కాకుండా వేరే వాళ్ళు చేశారు అని చెప్పలేదు కదా ? హత్య చేయించింది వాళ్ళే కాబట్టి అన్ని ఆధారాలు వాళ్ళే అని చెప్తున్నాయి. ఎవరు ఏమన్నా...మేము నిలబడ్డది న్యాయం కోసమే. ఇది ఆస్తుల కోసం కాదు..పదవుల కోసం కాదు. సునీత కుమిలి పోతుంది. వివేకాను గొడ్డలితో దారుణంగా నరికి చంపారు. హత్యను మభ్య పెట్టాలి అని చూస్తున్నారు. తెగించి న్యాయం కోసం నిలబడ్డాం. రేపు మాకైనా, మా పిల్లలకు అయినా ఏమవుతుందో తెలియదు. మొండిగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం. చంద్రబాబుతో నాకు అవసరం లేదు. నాకు చంద్రబాబు స్పీచ్ లు అవసరం లేదు. నేను వైఎస్ఆర్ బిడ్డను. వేరే ఒకరి స్పీచ్ పట్టుకొని చదవాల్సిన అవసరం లేదు” అని మరో ప్రశ్నకు బదులిచ్చారు వైఎస్ షర్మిల.
షర్మిల అఫిడవిట్ లో ఆసక్తికర విషయాలు
YS Sharmila Affidavit : కడప లోక్ సభ స్థానం నుంచి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) పోటీ చేస్తున్నారు. శనివారం ఆమె నామినేషన్(Nomination) దాఖలు చేశారు. అయితే షర్మిల ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ లో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. తన అన్న, సీఎం జగన్‌కు షర్మిల రూ. 82 కోట్ల బాకీ(Sharmila Debt) ఉన్నట్లు పేర్కొన్నారు. తనపై 8 కేసులున్నట్లు, వాటిల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు ఉన్నట్టు షర్మిల అఫిడవిట్(YS Sharmila Affidavit) లో పేర్కొన్నారు. తన మొత్తం ఆస్తులు రూ. 182.82 కోట్లు ఉన్నాయని తెలిపారు. వీటిలో రూ. 82,58,15,000 తన సోదరుడు సీఎం జగన్ కు వద్ద అప్పు తీసుకున్నట్లు తెలిపారు. తన వదిన వైఎస్ భారతీరెడ్డి వద్ద రూ.19,56,682 అప్పు తీసుకున్నట్లు షర్మిల పేర్కొన్నారు. వీటిని తిరిగి చెల్లించాల్సి ఉందన్నారు. ఏడాదికి తన ఆదాయం రూ. 97,14,213 వస్తుందని షర్మిల అఫిడవిట్‌లో తెలిపారు. షర్మిల భర్త అనిల్ కుమార్ ఆదాయం రూ. 3,00,261 మాత్రమేనని తెలియజేశారు.