Y S Vivekananda Reddy Murder Case : వైఎస్ వివేకా హత్య(YS Viveka Murder Case)పై కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్ వివేకా(YS Viveka Murder ) హత్యపై మాట్లాడొద్దని కడప కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు వైఎస్ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ లకు ఆదేశాలను జారీ చేసింది. లోకేష్, పురందేశ్వరి కూడా వివేకా హత్యపై ప్రస్తావించొద్దని ఆదేశించింది.
ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు(YS Viveka Murder Case)ను ప్రస్తావిస్తూ కడప ఎంపీ అభ్యర్థిగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డిపై పలువురు నేతలు ఆరోపణలు చేస్తున్నారంటూ కడపకు చెందిన వైసీపీ నేత సురేష్ బాబు కోర్టులో పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా షర్మిల, సునీత,చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్ తో పాటు రవీంద్ర నాథ్ రెడ్డి పేరును చేర్చారు. వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇందులో ప్రస్తావించారు. దీనిపై విచారించిన కడప కోర్టు…..వైఎస్ వివేకా హత్యపై మాట్లాడొద్దని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా ఈ కేసు వ్యవహారంపై చర్చ జరుగుతున్నప్పటికీ ఎన్నికల వేళ పలు పార్టీల అధినేతలు ప్రధానంగా ఈకేసును ప్రస్తావిస్తున్నారు. ఓవైపు వివేకా కుమార్తె సునీతారెడ్డితో పాటు వైఎస్ షర్మిల కూడా జగన్ తో పాటు అవినాశ్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఇక పవన్, చంద్రబాబు పాల్గొంటున్న సభలోనూ ఈ కేసును ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇటీవలే వివేకానందరెడ్డి హత్య కేసులో తనకు న్యాయం చేయాలని 'జస్టిస్ ఫర్ వివేకా' పేరుతో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రజంటేషన్ ఇచ్చారు ఆయన కుమార్తె సునీతారెడ్డి. వివేకా హత్య రాజకీయ కుట్రలో భాగంగా జరిగిందన్నారు. తాను ఏ రాజకీయ పార్టీలో లేనని, తనకు కావాల్సిన న్యాయం కోసం పోరాటం చేస్తున్నానన్నారు. అందులో భాగంగానే రాజకీయ నేతలు, బ్యూరో క్రాట్స్ కలుస్తున్నానన్నారు. తనకు ఫేవర్ చేయాలని ఎవరిని కోరడంలేదని, తన తండ్రి హత్య కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. సీబీఐ(CBI), కోర్టులలో న్యాయం ఆలస్యం అవుతుందన్నారు. అందుకే ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్నానని సునీత చెప్పారు. అవినాష్ రెడ్డి(Avinash Reddy) లాంటి హంతకులు చట్టసభలకు వెళ్లకూడదని ఆమె అన్నారు.
2019 ఎంపీ ఎన్నికల్లో సానుభూతి కోసం తన తండ్రి వివేకాను అతి దారుణంగా హత్య చేశారని సునీతా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో అవినాష్ రెడ్డి గెలుపు కోసం వివేకా(Viveka) ప్రచారం చేశారని గుర్తుచేశారు. ప్రతికారం తీర్చుకోవడం తన ధ్యేయం కాదన్న సునీతా రెడ్డి...అప్పుడే కడప(Kadapa)కు వెళ్లి తానే నరికేసే దానిని అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక షర్మిల కూడా వైఎస్ అవినాశ్ రెడ్డి హంతకులు చట్టసభలకు వెళ్లొద్దని కోరుతున్నారు. ప్రస్తుతం షర్మిల.. అవినాశ్ రెడ్డి పోటీ చేస్తున్న స్థానం నుంచే కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. తనకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. షర్మిల ప్రచారంలో సునీతా రెడ్డి కూడా పాల్గొంటున్నారు.