Viveka Daughter Sunitha: “మా అన్న పార్టీకి ఓటేయకండి..” వైఎస్ వివేకా కుమార్తె సునీత విజ్ఞప్తి…
Viveka Daughter Sunitha: వచ్చే ఎన్నికల్లో తన అన్న పార్టీకి ఓటేయకుండా ప్రజలు తీర్పునివ్వాలని వైఎస్.వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఢిల్లీలో విజ్ఞప్తి చేశారు. వివేకా హంతకుల్ని ఎందుకు కాపాడుతున్నారని సునీత ప్రశ్నించారు.
Viveka Daughter Sunitha: రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి YS Jagan పార్టీకి ప్రజలు ఓటేయ వద్దని వివేకానంద రెడ్డి కుమార్తె సునీత విజ్ఞప్తి చేశారు. తాను వ్యవస్థను నమ్ముతున్నానని, తాను చేస్తున్న న్యాయ పోరాటంలో ప్రజల సహకారం నాకు కావాలన్నారు. ఐదేళ్ల క్రితం హత్యకు గురైన తన తండ్రి వైఎస్.వివేకానంద రెడ్డి హత్య చేసిన నిందితుల్ని సిఎం జగన్ కాపాడుతున్నారని సునీత ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజలు తనకు అండగా నిలవాలన్నారు, జగన్ పార్టీకి ఓటు వేయోద్దన్నారు. జగన్ విలువలు విశ్వసనీయత అనే మాటలు పదేపదే చెబుతుంటారని, అవన్నీ వివేకానందరెడ్డి విషయంలో ఎందుకు జగన్‌కు గుర్తు రావడం లేదని నర్రెడ్డి సునీత ప్రశ్నించారు. తండ్రి హత్య కేసు దర్యాప్తుపై జగన్ తనకు ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు. ఎంపీ అవినాష్ రెడ్డిని Avinash Reddy ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు.
వివేకాను చంపిన దుష్ట చతుష్టయం ఎవరని, ముఖ్యమంత్రి వారికి సాయం చేయడం తప్పు కాదా అన్నారు. సిఎం పదేపదే మంచికి చెడుకు యుద్ధం అంటున్నారని, చంపిన వారిని రక్షించడం మంచిదా అని ప్రశ్నించారు.
తన తండ్రి హత్య విషయంలో న్యాయం కోసం తాను పోరాడుతున్నానని చెప్పారు. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటున్నారని, పెత్తందారులంతా కలిసి వివేకా హత్య కేసులో సాక్ష్యుల్ని ప్రభావితం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
వివేకా హత్య కేసులో తనకు న్యాయం జరిగితే, ఇంకా చాలామందికి ప్రేరణ లభిస్తుందని చెప్పారు. విశాఖలో కోవిడ్ సమయంలో ప్రశ్నించిన డాక్టర్‌కు ఏమైందని, ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య కేసులో ఎవరు ఎందుకు పోరాడటం లేదని, ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం లేదని, ఆ నమ్మకాన్ని కలిగించడానికి తాను పోరాడుతున్నానని సునీత చెప్పారు. ఈ పోరాటంలో ప్రజల సహకారం కావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు ద్వారా తీర్పునివ్వాలన్నారు.
రాజకీయాలు కాదని న్యాయం కోసం తనకు అండగా నిలవాలని, సమాజంలో మార్పు కోసం ప్రజలు ఓటు ద్వారా తీర్పునివ్వాలన్నారు. ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు ఉండకూడదని, హంతకులు పాలకులుగా ఉండకూడదని, ప్రజా స్వామ్యం ద్వారా ప్రజల జీవితాలు మారడానికి, బాగుపడటానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు.
వచ్చే ఎన్నికల్లో తన అన్న పార్టీకి ఎవరు ఓటేయ వద్దని సునీత విజ్ఞప్తి చేశారు. ఇంత వంచించి మోసం చేసిన పార్టీకి, తన అనుకునే వారికి మాత్రమే సాయం చేసే పార్టీకి ప్రజలు ఓటు వేయొద్దన్నారు.
సిబిఐ నిందితుల్లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారని వారిని జగన్ రక్షిస్తున్నారని, వారి పాత్ర ఉందో లేదో సిబిఐ విచారించాలని వారి పాత్ర ఉంటే బయటపెట్టాలన్నారు. విచారణ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఎవరికైనా ఉంటాయని, తాను పోటీ చేసే విషయంలో ఇప్పుడే ఏమి చెప్పలేనని వివేకా కుమార్తె సునీత చెప్పారు.
వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పిన విజయసాయిరెడ్డిని ఇప్పటి వరకు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. వివేకా హత్య జరిగిన తర్వాత గుండెపోటుగా కావాలని ప్రచారం చేశారని ఆరోపించారు. కర్నూలులో అవినాష్‌ను ప్రశ్నించడానికి వెళితే కనీసం కలవనివ్వకుండా సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ వచ్చే వరకు ఆపారని సునీత ఆరోపించారు. హంతకులు మన మధ్యే ఉంటారని.. కానీ గుర్తించలేమని ఆరోపించారు.
అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు కోసం సిబిఐ ఎందుకు ఛాలెంజ్ చేయడం లేదని ప్రశ్నించారు. కేసు విచారణ వెంటనే ప్రారంభించాలని ఆమె డిమాండ్ చేశారు. తనకు వ్యక్తిగతంగా చాలా మంది మద్దతునిస్తున్నా బయటకు వచ్చి మాట్లాడలేక పోతున్నారని చెప్పారు.