Note For Vote Case : రేపు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసుపై విచారణ, చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని ఆర్కే పిటిషన్
Note For Vote Case : ఓటుకు నోటు కేసుపై రేపు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని, చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి 2017 పిటిషన్ దాఖలు చేశారు.
Note For Vote Case : రేపు(ఏప్రిల్ 18) సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు (Note For Vote Case)విచారణ జరుగనుందని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఈ కేసును జస్టిస్ సుందరేష్, జస్టిస్ SVN భట్టి బెంచ్ విచారించనుందన్నారు. ఈ కేసులో చంద్రబాబును(Chandrababu) ముద్దాయిగా చేర్చాలని తాను పిటిషన్ వేశానని ఆళ్ల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఈ కేసు దర్యాప్తును సైతం సీబీఐకి అపగించాలని పిటిషన్ లో కోరానన్నారు. గత విచారణలో చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ లుథ్రా వాయిదా కోరారు. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రలోభపెట్టారని ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకు స్టీఫెన్‌సన్‌ను డబ్బు ఇస్తుండగా... ఏసీబీ రెడ్ హ్యాండెడ్ పట్టుకుంది. టీడీపీ నేతలతో ఫోన్‌లో మాట్లాడింది చంద్రబాబేనని ఫోరెన్సిక్ నిర్థారించింది.
2017లోనే పిటిషన్ వేశా- ఆళ్ల రామకృష్ణా రెడ్డి
2015 ఓటుకు నోటు కేసు(Note For Vote)లో టీడీపీ అధినేత చంద్రబాబును(Chandrababu) ముద్దాయిగా చేర్చాలని తాను 2017 సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని ఆళ్ల రామకృష్ణా రెడ్డి (Alla Ramakrishna Reddy)తెలిపారు. అలాగే ఈ కేసు దర్యాప్తును సీబీఐ(CBI)కి అప్పగించాలని పిటిషన్‌లో కోరానని తెలిపారు. ఈ కేసు గత విచారణలో వివిధ కారణాలతో చంద్రబాబు తరఫు న్యాయవాది వాయిదా కోరారన్నారు. రేపు సుప్రీంకోర్టు(Supreme Court) ఈ కేసు విచారణ జరగబోతుందని తెలిపారు. ఈ కేసులో అన్ని సాక్ష్యాలు ఉన్నా ఏడేళ్లుగా విచారణ జరగలేదన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని ఆరోపించారు. తెలంగాణ ఏసీబీ ఈ కేసును సరిగా విచారణ చేయడంలేదని, అందుకే సీబీఐ ఈ కేసు దర్యాప్తును అప్పగించాలని కోర్టును కోరానన్నారు. దీంతో ఈ ఘటనకు సంబంధించి మరో మూడు కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మత్తయ్య, సెబాస్టియన్ కూడా ఓటుకు నోటు కేసుపై సుప్రీంను ఆశ్రయించారన్నారు. మాజీ మంత్రులు జగదీష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ ఈ కేసును మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారన్నారు. ఈ కేసులో ఇప్పటికే ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు.
ఓటుకు నోటు కేసులపై సుప్రీం సంచలన తీర్పు
అసెంబ్లీల్లోని ఎమ్మెల్యేలు, పార్లమెంట్(Parliament)లోని ఎంపీలకు.. అవినీతి, లంచం కేసుల్లో విచారణ నుంచి మినహాయింపు ఉండదని సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పును వెలువరించింది. 1998లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court) కొట్టివేసింది. ప్రసంగాలు, అసెంబ్లీ, పార్లమెంట్లో ఓటు వేసేందుకు లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చట్టసభ్యులకు విచారణ నుంచి మినహాయింపును ఇస్తూ 1998లో సుప్రీం ధర్మాసనం తీర్పును ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 105(2), 194(2 ) పార్లమెంటరీ ప్రివిలేజ్ని పరిగణలోకి తీసుకుని ఈ తీర్పును ఇస్తున్నట్టు అప్పట్లో ధర్మాసనం పేర్కొంది. అయితే..ఈ తీర్పు అర్థం, లంచం తీసుకోవడం అనేది ఆర్టికల్ 105, 194 లకు విరుద్ధంగా ఉన్నాయని ఇటీవల సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 1998 తీర్పును తాజాగా కొట్టివేసింది. సీజీఐ జస్టిస్ చంద్రచూడ్(CJI Chandrachud) నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ కీలక తీర్పు ఇచ్చింది.
"శాసన సభలు, పార్లమెంట్లో ప్రసంగాలు, ఓటు కోసం అవితీనికి పాల్పడ్డారని, లంచం తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు విచారణ నుంచి మినహాయింపు ఉండదు. ప్రివిలేజ్ (అధికారాలు)ని తీసుకురావడానికి వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. హౌజ్ మొత్తానికి సంబంధించిన అధికారాలు అవి. ప్రివిలేజ్ పేరుతో చట్టసభ్యులు అవినీతికి పాల్పడి లంచాలు తీసుకుంటే.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపైనే మచ్చపడుతుంది. ఈ విషయాన్ని ఎంపీలు, ఎమ్మెల్యేలు కచ్చితంగా అర్థం చేసుకోవాలి," అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
సంబంధిత కథనం