YS Sharmila Kadapa: అన్న మీద పంతంతో తమ్ముడి మీద పోటీ.. కడప గడపలో షర్మిల సవాల్.. దాయాదుల పోరుపై సర్వత్రా ఆసక్తి
YS Sharmila Kadapa: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత ఆసక్తికరమైన పోటీ కడపలో జరుగుతోంది. దాదాపు పదిహేనేళ్ల తర్వాత కడప జిల్లాలో ఒకే కుటుంబంలోని వారు ఎన్నికల్లో తలపడటం అందరిని ఆకర్షిస్తోంది.
YS Sharmila Kadapa: కడప పార్లమెంటు ఎన్నికల kadapa loksabha బరిలో కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్ షర్మిల అభ్యర్థిత్వం ఖరారైంది. ఏఐసిసి అభ్యర్థుల జాబితాలో కడప అభ్యర్థిగా షర్మిల పేరును ప్రకటించారు. రెండున్నరేళ్ల క్రితం తెలంగాణలో రాజకీయ భవిష్యత్తును వెదుక్కుంటూ వైఎస్సార్ తెలంగాణ YSRTPపార్టీతో షర్మిల వేసిన అడుగుల వెనుక అసలు లక్ష్యం నేటికి నెరవేరింది.
షర్మిల లక్ష్యం, రాజకీయ భవిష్యత్తు మొత్తం ఏపీలోనే ఉంటాయని తెలిసినా ఆమె తెలంగాణలో అడుగులు వేశారు. అన్నకు అడ్డు రాకూడదని భావించారో, ఎన్నికలు నాటికి ఏపీలో అడుగు పెట్టొచ్చని భావించారో కానీ సరిగ్గా సార్వత్రిక ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా PCC President బాధ్యతలు చేపట్టారు. కడప ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు.
2004, 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ 2014లో రాష్ట్ర విభజన తర్వాత కనుమరుగైపోయింది. దాదాపు పదేళ్లుగా మిణుకుమంటోన్న ఆ పార్టీకి పదేళ్లలో ముగ్గురు అధ్యక్షులు మారారు. కనుచూపు మేరలో ఏపీలో కాంగ్రెస్‌కు ఆశాజనకమైన పరిస్థితులు లేని దశలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు షర్మిలకు దక్కాయి.
త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కడప పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ తరపున అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. టీడీపీ తరపున మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సమీప బంధువు భూపేష్ రెడ్డి బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ తరపున షర్మిల పోటీ చేస్తున్నారు.
1989 నుంచి వైఎస్ కుటుంబానిదే….
కడప పార్లమెంటు స్థానంలో 1989నుంచి వైఎస్ కుటుంబమే గెలుస్తోంది. వైఎస్.రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి సుదీర్ఘ కాలం పాటు కడప ఎంపీలుగా కొనసాగారు. రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో ఉంటే ఆయన తమ్ముడు వివేకా పార్లమెంటుకు ఎన్నికవుతూ వచ్చారు. 1989లో టీడీనీ అభ్యర్థి ఎం.విరమణారెడ్డిపై వైఎస్సార్ విజయం సాధించారు. 1991లో మాజీ మంత్రి సి.రామచంద్రయ్యను వైఎస్సార్ ఓడించారు. 1996,1998లో కందుల రాజమోహన్ రెడ్డిపై విజయం సాధించారు.
1999లో కందుల రాజమోహన్ రెడ్డిపై వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. 2004లో మైసురా రెడ్డిని ఓడించి వివేకా పార్లమెంటులో అడుగు పెట్టారు. 2009లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేయడంతో వివేకా ఎన్నికల బరి నుంచి తప్పుకుని ఆ స్థానాన్ని జగన్‌కు కేటాయించారు.
2009లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన కొద్ది రోజులకే వైఎస్సార్ మరణించడం తదనంతరం జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీకి జగన్ రాజీనామా చేయడంతో 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్, విజయమ్మలు వైఎస్సార్సీపీ తరపున గెలుపొందారు. నాటి ఉప ఎన్నికల్లో పులివెందులలో విజయమ్మపై వివేకా పోటీ చేశారు. ఆ తర్వాత కాలంలో ఎమ్మెల్సీగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవిని పొందారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో 2014, 2019లో వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ తరపున గెలిచారు.
కడప సీటు కోసమే కుటుంబంలో చిచ్చు…
కడప పార్లమెంటు స్థానం కోసమే వైఎస్ కుటుంబంలో రేగిన చిచ్చు నేటికి చల్లారలేదు. 2019 ఎన్నికలకు సమయంలో కడప పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా జగన్ సోదరి షర్మిలను పోటీ చేయించాలని వివేకానంద రెడ్డి భావించారు.
సమీప బంధువులే అయినా వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబంతో ఉన్న వివాదాల నేపథ్యంలో రాజకీయంగా షర్మిలను ఎన్నికల్లో పోటీ చేయించాలన్నది వివేకా అభిమతమని కొద్ది రోజుల క్రితం షర్మిల స్వయంగా వెల్లడించారు. దాదాపు మూడు గంటలు తనను ఎన్నికల్లో పోటీకి ఒప్పించడానికి వివేకా ప్రయత్నించారని, తాను దానికి నిరాకరించినట్టు వివేకా వర్ధంతి కార్యక్రమంలో వెల్లడించారు.
ఎన్నికల ప్రచారంలో ఉండగానే 2019 మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. వివేకా హత్య కేసులో దోషులు ఎవరన్నది నేటికి తేలలేదు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు రకరకాల మలుపులు తిరుగుతోంది.
మరోవైపు 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిల రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి భరోసా లభించక పోవడం కూడా ఆమెను అసంతృప్తికి గురి చేసింది. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో ఓదార్పు యాత్రను నిర్వహించడం ద్వారా, ఆ తర్వాత ఎన్నికల సమయంలో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించిన షర్మిలకు 2019 తర్వాత ఏపీలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. ఆస్తుల పంపకం విషయంలో తలెత్తిన వివాదాలు కూడా అన్నా చెల్లెళ్ల మధ్య దూరం పెంచాయని సన్నిహితులు చెబుతారు.
ఏపీలో ఎంట్రీ కోసమే…
తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి, వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా షర్మిల రాజకీయ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటుందనే స్పష్టత ఆమెకు ఉందని వైసీపీ, కాంగ్రెస్ వర్గాలు చెబుతాయి. సరైన సమయంలో ఏపీ పాలిటిక్స్‌లో ఎంట్రీ కోసమే తెలంగాణ నుంచి ఏపీ వైపుకు అడుగులు వేసినట్టు చెబుతారు. రాజకీయంగా పదవులు దక్కకపోవడానికి కుటుంబంలో జరిగిన అవమానాలకు బదులు తీర్చుకునే క్రమంలోనే వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్టు తెలుస్తోంది.
కడప పార్లమెంటు స్థానానికి పోటీ చేయడం ద్వారా వైఎస్ కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా దాయాదుల మధ్య నెలకొన్న అస్తిత్వ పోరాటాల్లో పైచేయి సాధించేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు. కడపలో టీడీపీ తరపున పోటీ చేస్తున్న భూపేష్ రెడ్డి కూడా గణనీయంగా ఓట్లను చీల్చే అవకాశం లేకపోలేదు. టీడీపీ చీల్చే ఓట్లు ఎవరికి లబ్ది చేకూరుస్తాయనేది కూడా కీలకం కానుంది.
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రమేయంపై వివేకా కుమార్తె సునీత, షర్మిల ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో కడప ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.
సంబంధిత కథనం