YS Sharmila : నా కుటుంబాన్ని చీలుస్తుందని తెలుసు, కడప నుంచి పోటీపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
YS Sharmila : సీఎం...జగన్ తో తనకు పరిచయంలేదని వైఎస్ షర్మిల అన్నారు. సీఎం అయ్యాక నా అనుకున్న వాళ్లను జగన్ నాశనం చేశారని ఆరోపించారు. వివేకాను హత్య చేసిన వాళ్లకే కడప ఎంపీ సీటు ఇచ్చారన్నారు.
YS Sharmila : కడప లోక్ సభ స్థానంలో వైఎస్ఆర్ బిడ్డ పోటీ చేస్తుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) తెలిపారు. ఈ నిర్ణయం అంత సులువైంది కాదని, తన కుటుంబాన్ని చీలుస్తుంది అని తెలుసు అన్నారు. వైఎస్సార్ అభిమానులను గందరగోళంలో పడేలా చేస్తుందని తెలుసు అన్నారు. అయినా తప్పనిసరి పరిస్థితిలో కడప నుంచి పోటీచేయాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. జగన్ మోహన్ రెడ్డి నా అన్న, ఆయనపై నాకు ద్వేషం లేదన్నారు. జగన్ నా రక్తం, ఎన్నికల్లో నన్ను చెల్లే కాదు బిడ్డ అన్నారని గుర్తుచేశారు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక జగన్(Jagan) మారిపోయారన్నారు. ఈ జగన్ మోహన్ రెడ్డితో తనకు పరిచయం లేదన్నారు. సీఎం జగన్ నా అనుకున్న వాళ్లను అందరినీ నాశనం చేశారని ఆరోపించారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించారని విమర్శించారు.
వివేకాను హత్య చేసిన వాళ్లకే సీటు
"కడపలో ఎంపీ అభ్యర్థిగా(Kadapa MP Candidate) వివేకాను హత్య చేసిన వాళ్లకే సీటు ఇచ్చారు. ఇదే తట్టుకోలేకపోయా. హత్య చేసిన వాళ్లకు శిక్ష లేదు. హత్య చేసిన వాళ్లు, చేయించిన వాళ్లు తప్పించుకుని తిరుగుతున్నారు. అన్ని సాక్ష్యాలు ఉన్నా చర్యలు లేవు. అధికారం వాడుకుని హత్య చేసిన వాళ్లను జగన్ (Jagan)రక్షిస్తున్నారు. అవినాష్ రెడ్డిని వెనకేసుకువస్తున్నారు. మళ్లీ అవినాష్ రెడ్డికి(Avinash Reddy) సీటు ఇవ్వడం తట్టుకోలేకపోయాను. వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది. వివేకా హత్యను రాజకీయం కోసం వాడుకున్నారు. మాకు చాలా ఆలస్యంగా అర్థం అయింది. తన ఛానెల్ లో తప్పుడు కథనాలు ప్రసారం చేయించారు. హత్య చేసిన వాళ్లకే సీట్ ఇస్తే ప్రజలు హర్షించరు అని తెలిసి మళ్లీ టిక్కెట్ ఇచ్చారు. వైఎస్సార్, వివేకా (Vivekanada Reddy)రామలక్ష్మణుడిలా ఉండేవాళ్లు. వివేకా ఆకరి కోరిక నన్ను ఎంపీగా చూడాలని.. ఎప్పుడూ నాకు అర్థం కాలేదు. నన్ను ఎందుకు ఎంపీగా ఉండమని అడిగారో...ఇవాళ అర్థం అయ్యింది. సునీత న్యాయం కోసం గడప గడపకి తిరుగుతుంది. న్యాయం కోసం ఆమె ఎక్కని మెట్టు లేదు"- వైఎస్ షర్మిల
మరో రెండు రోజుల్లో తుది జాబితా
నేను హత్యా రాజకీయాలకు విరుద్ధమని వైఎస్ షర్మిల (YS Sharmila)అన్నారు. ఒక హంతకుడు పార్లమెంట్ మెట్టు ఎక్కకూడదని ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఒక్క అవకాశం అని చెప్పి రాష్ట్రాన్ని ముంచారని ఆరోపించారు. రాజన్న రాజ్యం అని చెప్పి రాక్షస రాజ్యం తెచ్చారని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని విమర్శించారు. మద్యం ఏరులై పాలించారన్నారు. ఈ నెల 5 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని షర్మిల తెలిపారు. వైఎస్ఆర్ ఘాట్(YSR Ghat) వద్ద నివాళులు అర్పించి వారి ఆశీస్సులు తీసుకున్నామన్నారు. వైఎస్ఆర్(YSR) కాంగ్రెస్ పార్టీ నాయకుడని, కాంగ్రెస్ తరుపున 10 ఎన్నికల్లో గెలిచారన్నారు. పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కోసం నిలబడ్డారన్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చి ముఖ్యమంత్రిగా ఎదిగారన్నారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ఏర్పాటుకు తనవంతు సహకారం అందించారన్నారు. వైఎస్సార్ బతికి ఉంటే రాహుల్ గాంధీ (Rahul Gandhi)ప్రధాని అయ్యే వారన్నారు. వైఎస్సార్ కల నెరవేరేదన్నారు. వైఎస్ఆర్ ఆశయం కోసం ఇవాళ తాను కాంగ్రెస్ లో చేరానన్నారు. నేడు 5 మంది ఎంపీలు, 114 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేశామని, మరో రెండు, మూడు రోజుల్లో తుది జాబితా విడుదల చేస్తామన్నారు.
సంబంధిత కథనం