AP Congress Tickets: ఏపీ కాంగ్రెస్‌లో టిక్కెట్ల కోసం హడావుడి… కారణం ఏంటో తెలిస్తే అవాక్కవ్సాల్సిందే…!
AP Congress Tickets: సార్వత్రిక ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేటలో తలమునకలయ్యాయి. అనూహ్యంగా ఏపీ కాంగ్రెస్‌లో కూడా టిక్కెట్ల కోసం పోటీ నెలకొనడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
AP Congress Tickets: ఎన్నికల వేళ ఏపీ కాంగ్రెస్‌లో కూడా కోలాహలం నెలకొంది. పదేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఏపీ కాంగ్రెస్ పార్టీలో షర్మిల రాకతో కొత్త ఉత్సాహం వచ్చిందని ఆ పార్టీ నేతలు ఆశించారు. షర్మిలకు YS Sharmila పిసిసి పగ్గాలు అప్పగించిన తర్వాత మునుపటితో పోలిస్తే ఆ పార్టీలో కాస్త ఉత్సాహం వచ్చింది. బహిరంగ సభలు, సమావేశాలతో కాంగ్రెస్ Congress పార్టీ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బహిరంగ సభల్ని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాల నేపథ్యంలో ఏపీలో కూడా మునుపటి కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది.
రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఏపీ కాంగ్రెస్ పార్టీ కూడా కీలక పాత్ర పోషించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశించే వారి సంఖ్య కూడా అనుహ్యంగా పెరుగుతోంది. గత పదేళ్లలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈసారి టిక్కెట్లు ఆశించే వారు రెట్టింపు అయ్యారు.
ఎన్నికలంటే బోలెడు ఖర్చుతో Election Expenditure కూడుకున్న వ్యవహారం కావడంతో సామాన్యులు వాటి జోలికి వెళ్లే పరిస్థితులు లేవు. దేశంలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎన్నికల వ్యయం అత్యధికంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది.
అంతకు ముందు ఆ పార్టీలో పదవుల్ని అనుభవించిన నాయకత్వం మొత్తం ఇతర పార్టీల్లో చేరిపోయింది. క్యాడర్ కూడా ఇతర పార్టీలకు మరలిపోయింది. వైసీపీకి ఉన్న ప్రధాన ఓటు బ్యాంకులో ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉన్నారని అంచనా.
ఎన్నికల నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఆసక్తి చూపించడానికి కారణం ఏమిటని ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన పార్టీలతో పోటీ పడే పరిస్థితులు లేకపోయినా ఎన్నికల్లో ఓ ప్రయత్నం చేసి చూద్దామనుకునే వారు ఎక్కువగా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ తరపున వచ్చే ఆర్ధిక Party Fund సాయంపై ఆసక్తితోనే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపే వారి సంఖ్య ఎక్కువైందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో గెలుపు సంగతి పక్కన పెడితే పార్టీ ఫండ్ ద్వారా నిధులు దక్కుతాయనే ఆశతోనే చాలామంది దరఖాస్తులు ఇచ్చారని కాంగ్రెస్ సీనియర్లు చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి, కాంగ్రెస్ పార్టీ తక్కువలో తక్కువగా కనీసం రూ.20లక్షల వరకు ఎన్నికల ఖర్చుల కోసం చెల్లిస్తుందనే అంచనాతోనే ఎక్కువ మంది పోటీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ నేతల తలోదారి….
పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో సీనియర్లతో కలిసి ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు. కేవీపీ వంటి సీనియర్లు షర్మిలకు అండగా ఉన్నారు. ఇతర ముఖ్య నేతలు మాత్రం షర్మిల పోకడకు అలవాటు పడలేక, బయటపడ లేని పరిస్థితి ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. షర్మిలతో నేరుగా మాట్లాడే అవకాశం సీనియర్లకు సైతం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీని నడిపించే బాధ్యత షర్మిలకు అప్పగించిన నేపథ్యంలో ఆమె వెంట నడవడం తప్ప మరో దారి లేదని చెబుతున్నారు.
అభ్యర్థుల ఖరారు…
గత వారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై చేసిన కసరత్తు దాదాపుగా కొలిక్కి వచ్చినట్టేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంలో కూడా స్పష్టత రావాల్సి ఉంది.
175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులతో గురువారం మంగళగిరిలో షర్మిల ప్రతిజ్ఞ చేయిస్తారని పీసీసీ వర్గాలు తెలిపాయి. 2014, 19 ఎన్నికలతో పోల్చితే.. 2024 ఎన్నిక ల్లో పోటీకి ఎక్కువ మంది ఉత్సాహం చూపుతున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.