TDP MLA Tickets 2024 : టికెట్ చేజారిపోయింది..! ఈసారి 'దేవినేని' పోటీ లేనట్టేనా..?
23 March 2024, 12:14 IST
- AP Assembly Elections 2024: తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితా కూడా విడుదలైంది. కానీ పలువురి సీనియర్ నేతలకు మాత్రం చోటు దక్కలేదు. ఇక కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి దేవినేనికి(Devineni Uma) కూడా చోటు లభించలేదు.
దేవినేని ఉమా
AP Assembly Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల(AP Assembly Elections) వేళ రాజకీయాలు అత్యంత హాట్ హాట్ గా సాగుతున్నాయి. ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల విషయంలో కసరత్తును పూర్తి చేశాయి. అధికారు వైసీపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక తెలుగుదేశం పార్టీ(TDP) ఇప్పటివరకు మూడు జాబితాలను విడుదల చేసింది. పొత్తులో భాగంగా… ఈ ఎన్నికల్లో 144 స్థానాల్లో పోటీ చేయనుండగా….దాదాపు అన్ని స్థానాలకు క్యాండెంట్లను ఖరారు చేసింది. అయితే ఎచ్చెర్ల, భీమిలీ, చీపురుపల్లి, అనంతపురం స్థానాలకు అభ్యర్థుల్ని ఫైనల్ చేయాల్సి ఉంది. అయితే టీడీపీ ఇప్పటివరకు ప్రకటించిన జాబితాల్లో పలువురు సీనియర్లకు హ్యాండ్ ఇచ్చింది. పార్టీలో సీనియర్లుగా ఉన్న దేవినేని ఉమా, కళా వెంకట్రావుతో పాటు మరికొందరు పేర్లు గల్లంతయ్యాయి. దీంతో సదరు సీనియర్లు పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
దేవినేని ప్లేస్ లో వసంత…
దేవినేని ఉమా(Devineni Uma Maheswara Rao)….. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. మైలవరం నుంచి గతంలో గెలిచిన ఆయన… టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపించే నేతగా పేరొందారు. ఈసారి కూడా మైలవరం(Mylavaram Assembly constituency) నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో పార్టీ అధినాయకత్వం ఆయనకు మొండిచేయ్యి చూపింది. 2019లో వైసీపీ తరపున గెలిచిన వసంతకృష్ణప్రసాద్ ఇటీవలే పార్టీలో చేరటంతో ఆయనకే టికెట్ ను ఖరారు చేసింది. దీంతో దేవినేని ఉమా పరిస్థితి డైలామాలో పడిపోయింది. మైలవరం కూడా పెనమలూరు టికెట్ అయినా దక్కుతుందని దేవినేనితో పాటు ఆయన వర్గీయులు భావించారు. కానీ ఈసారి స్థానిక నేత బోడె ప్రసాద్ కు దక్కింది. దీంతో దేవినేని ఈ ఎన్నికల్లో పోటీ చేయటం కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది. తను ఆశించిన మైలవరం సీటును వసంత దక్కించుకోవటంతో…. దేవినేని పరిస్థితేంటన్న చర్చ జోరుగా జరుగుతుంది.
తొలిరోజుల నాటి నుంచి దేవినేని ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఈ ఫ్యామిలీనే చక్రం తిప్పుతూ వచ్చింది. గతంలో కంకిపాడు నియోజకవర్గం నుంచి దేవినేని నెహ్రూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఉమా.... 2004లో నందిగామ నుంచి పోటీ చేసి విక్టరీ కొట్టారు. ఆ తర్వాత మైలవరం షిఫ్ట్ అయ్యారు. 2009, 2014లో ఈ సీటు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు కేబినెట్ జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి మైలవరం(Mylavaram Assembly constituency) టికెట్ దక్కించుకుని గెలవాలని చూశారు దేవినేని. ఇందుకోసం గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో గట్టిగా పని చేస్తూ వచ్చారు. కానీ చివరి నిమిషంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత రాకతో.... దేవినేనికి గట్టి షాక్ తగిలినట్లు అయింది. మరోవైపు దేవినేనికే టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. వసంతను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.