Mylavaram MLA : ఊపిరి ఉన్నంత వరకు వైసీపీలోనే కొనసాగుతా.... మైలవరం ఎమ్మెల్యే...
Mylavaram MLA : తాను పార్టీ మారబోనని... ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్సీపీలోనే ఉంటానని... మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. మంత్రి జోగి రమేశ్ తో విభేదాల నేపథ్యంలో... పార్టీ మారతారని జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.
Mylavaram MLA : పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలని మైలవరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఖండించారు. జీవితాంతం వైసీపీలోనే కొనసాగుతానని వెల్లడించారు. చంద్రబాబు, ఆయన అనుచరుల్లా తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం తాను కాదన్నారు. ఊపిరి ఉన్నంత వరకు జగనన్న బాటలోనే నడుస్తానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ మెజారిటీతో మైలవరంలో గెలుస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.
పార్టీలో సమస్యలు సర్వసాధారణమని, ఇది అన్ని పార్టీలలో ఉంటుందని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అన్నారు. మంత్రి జోగి రమేష్‌తో తనకున్న విభేదాల విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లానని, అన్ని విషయాలు తాను చూసుకుంటానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారని వివరించారు. నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, మిగిలిన వాటిని పట్టించుకోవద్దని సీఎం సూచించారన్నారు. 25 ఏళ్ల పాటు ఆయనతో కలిసి ఉంటానని సీఎం జగన్ కి హామీ ఇచ్చానని చెప్పారు. వైఎస్సార్‌సీపీ గెలుపునకు జోగి రమేష్‌తో కలిసి పనిచేస్తానని వసంత స్పష్టం చేశారు.
మైలవరంలో తనను ఓడిస్తానని 2019లో దేవినేని ఉమా సవాల్ విసిరారని... చివరకు 12 వేల ఓట్లతో ఓడిపోయారని వసంత గుర్తు చేశారు. దేవినేని ఉమా అసాంఘిక శక్తి లాంటోడని.. ఏం చేసి కోటీశ్వరుడయ్యాడని ప్రశ్నించారు. ఎన్నికల ముందు చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడని, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఎమ్మెల్యే వివరించారు. దేవినేని ఉమా లాంటి వాళ్లు తనపై సోషల్ మీడియాలో నెగిటివ్ వార్తలు, విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రిగా ఉండి సామాన్యుడి భూమిని పార్టీ ఆఫీసు కోసం సిగ్గులేకుండా లాక్కున్నారని, ఇలాంటి వాటి కోసమే ఉమా పదవుల కోసం ప్రయత్నాలు చేస్తుంటారని విమర్శలు గుప్పించారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో, ఆయన సహాయ సహకారాలతో మైలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నానని వసంత తెలిపారు. తనతోపాటు, నియోజకవర్గంలోని అనుచరులు జగన్ కోసం, వైఎస్ఆర్సీపీ కోసమే పని చేస్తామని స్పష్టం చేశారు. పేదలకి, బడుగు బలహీన వర్గాలకి జగన్ ప్రభుత్వం చేస్తున్న దానిలో పావు వంతైనా టీడీపీ ప్రభుత్వంలో చేసిందా అని ప్రశ్నించారు. నేడు జగన్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను అమలు చేయడంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్నే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్లీ ఎన్నుకుంటారని, అందులో తన భాగస్వామ్యం నూటికి నూరు శాతం ఉంటుందన్నారు.
ఇప్పటి వరకు మైలవరం నియోజకవర్గానికి రూ. 900 కోట్లతో అభివృద్ధి, సంక్షేమం అందించామని, రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇంకా కృషి చేసి రాష్ట్రంలోనే టాప్‌గా మైలవరం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ హామీ ఇచ్చారు. సీఎం సూచన మేరకు రానున్న రోజుల్లో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొంటానని తెలిపారు.