TDP Penamaluru Ticket : మారుతున్న 'పెనమలూరు' రాజకీయం - టీడీపీ టికెట్ ఎవరికి..?
AP Assembly Elections 2024: టీడీపీ పెనమలూరు టికెట్ పై హైడ్రామా కొనసాగుతూనే ఉంది. ఇంఛార్జ్ గా ఉన్న బోడె ప్రసాద్… టికెట్ విషయంలో గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ అధినాయకత్వం…. ఇతర నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
TDP Penamaluru Assembly Ticket 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల(AP Assembly Elections 2024) వేళ… రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. టికెట్ ఖరారు అనుకున్న పలువురు నేతల పరిస్థితి తారుమారు అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల (TDP Janasena BJP Alliance)మధ్య పొత్తు ఖరారు కావటంతో….. పలు స్థానాల్లో తర్జన భర్జన కొనసాగుతూనే ఉంది. ఇదే పరిస్థితి కృష్ణా జిల్లాలోని పెనమలూరులోనూ నెలకొంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి… ఇటీవలే పార్టీలోకి రావటంతో ఈసారి టికెట్ ఎవరికి దక్కబోతుందనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది. కానీ ఆయనకు నూజివీడు సీటును ఖరారు చేయగా…. పెనమలూరు సీటు విషయంలో మాత్రం హైడ్రామా కొనసాగుతూనే ఉంది.
టికెట్ ఎవరికి….?
కొద్దిరోజులుగా పెనమలూరు(Penamaluru Assembly Ticket 2) రాజకీయం అత్యంత హాట్ హాట్ గా సాగుతోంది. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు పార్థసారథి. ఐదేళ్ల పాటు ఆ పార్టీలోనే ఉన్న ఆయనకు ఈసారి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది వైసీపీ. దీంతో... పార్థసారథి పార్టీని వీడటంతో పాటు సైకిల్ ఎక్కేశారు. చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. అయితే ఆయన్ను నూజివీడుకు షిఫ్ట్ చేసింది టీడీపీ అధినాయకత్వం. దీంతో దీంతో అప్పటి వరకు ఇక్కడి బాధ్యతలు చూస్తున్న బోడే ప్రసాద్ కు లైన్ క్లియర్ అయిందని అంతా భావించారు. కానీ పరిస్థితి మాత్రం అలా కనిపించటం లేదు. ప్రసాద్ కు టికెట్ ఇచ్చేందుకు అధినాయకత్వం సుముఖంగా లేదన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. అయితే ఇన్నాళ్లు పార్టీ బాధ్యతలు చూసిన తనకే టికెట్ ఇవ్వాలని ప్రసాద్ కోరుతున్నారు.
ఇక ఈ స్థానం నుంచి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా పేరును కూడా టీడీపీ అధినాయకత్వం పరిశీలిస్తోందన్న చర్చ వినిపిస్తోంది. ఇయనే కాకుండా మరో ఇద్దరి ముగ్గురి నేతల పేర్లను పరిశీలిస్తోందని సమాచారం. అవే పేర్లతో ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే బోడే ప్రసాద్ మాత్రం… వెనక్కి తగ్గే ప్రసక్తే కనిపించటం లేదు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన… కొడాలి నాని, వంశీతో తనకు సంబంధాలు ఉన్నట్లు చెప్పి కొందరు నేతలు అధినాయకత్వానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వారితో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తనకే టికెట్ ఇవ్వాలని కోరారు.
ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు… టికెట్ ఖరారును ప్రకటించకుండా వేచి చూస్తున్నారు. సరైన సమయంలో అభ్యర్థిని ఖరారు చేసి ప్రకటించాలని భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతానికి పెనమలూరు సీటుపై క్లారిటీ రావటానికి మరికొంత సమయం పటే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల మేరకు తెలుస్తోంది. ఒక వేళ టికెట్ రాకపోతే… బోడే ప్రసాద్ అభ్యర్థి విజయం కోసం పని చేస్తారా…? లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా కీలకంగా మారింది.