Opinion: దిశా.. దశా లేని తెలుగుదేశం!-lokesh leadership potential after chandrababu arrest political analysis by peoples research ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Lokesh Leadership Potential After Chandrababu Arrest Political Analysis By Peoples Research

Opinion: దిశా.. దశా లేని తెలుగుదేశం!

HT Telugu Desk HT Telugu
Oct 09, 2023 05:35 PM IST

‘చంద్రబాబు అరెస్టుతో నాయకుడుగా తనను తాను నిరూపించుకునేందుకు వచ్చిన అవకాశాన్ని లోకేశ్‌ చేజేతులా వదులుకున్నారు..’ - పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ రీసెర్చర్ జి.మురళీకృష్ణ విశ్లేషణ.

లోకేశ్ టీడీపీకి దిశా దశా చూపించగలరా?
లోకేశ్ టీడీపీకి దిశా దశా చూపించగలరా? (nara lokesh)

కురుక్షేత్ర యుద్ధానికి అంతా సిద్ధమైంది. తీరా సమరం సమయానికి యుద్ధం చేయనని అర్జునుడు ఏవేవో కారణాలు చెబుతుంటాడు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు ... అర్జునుడితో ‘‘నీవు యుద్ధం నుండి పారిపోయావంటూ ప్రత్యర్థులు ప్రచారం చేస్తారు. బంధుమిత్రులు, నీ మీద అత్యంత గౌరవం ఉన్న వాళ్లు, నీ పేరు ప్రఖ్యాతుల మీద నమ్మకం ఉన్నవారు కూడా నీవు యుద్ధం చేయకపోవడం చూసి.. చులకన చేస్తారు. కాబట్టి యుద్ధం చేస్తావో లేక రణరంగం నుండి పారిపోయి లోకుల దృష్టిలో అప్రదిష్టపాలవుతావో నీ ఇష్టం.. ఆలోచించుకో’’ అని హితబోధ చేస్తాడు. ఇది ప్రస్తుతం టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ సహా టీడీపీ నాయకులకూ నూటికి నూరుపాళ్లు వర్తిస్తుంది!

ట్రెండింగ్ వార్తలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు తర్వాత రాష్ట్రంలో పోరాటం చేయకుండా, గల్లీ వదిలి ఢిల్లీ లో నారా లోకేశ్‌ హడావుడి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆమోదించలేకపోతున్నారు. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ, అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న పార్టీ అని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికే టీడీపీ నాయకులు చంద్రబాబు అరెస్టు తర్వాత దిశా -దశా లేకుండా అనాలోచితంగా వ్యవహరిస్తూ ప్రజల్లో చులకనై పోతున్నారు.

చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారన్న వాదన ప్రజల్లోకి వెళ్లడంతో ఆయనకు సానుభూతి కూడా వచ్చింది. కానీ, ఈ సానుభూతిని తమకు అనుకూలంగా మల్చుకోవడంలో టీడీపీ విఫలమైంది. ఎప్పుడయినా ఒక రాజకీయ పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడే నాయకుడికి తనను తాను నిరూపించుకునే అవకాశం కలుగుతుంది. 1984లో నాదేండ్ల భాస్కర్‌ రావు ఎపిసోడ్‌ సమయంలో, తన వ్యూహ రచనలతో టీడీపీని సంక్షోభం నుంచి బయటపడేసిన చంద్రబాబు ఎన్టీఆర్‌కి దగ్గరయ్యారు. ప్రతి విషయానికి తన మీదే ఆధారపడే పరిస్థితి తీసుకొచ్చారు. అక్కడి నుంచి చంద్రబాబు ఒక కొత్త శక్తిగా, తిరుగులేని నాయకుడిగా అవతరించారు. చంద్రబాబు అరెస్టుతో నాయకుడుగా తనను తాను నిరూపించుకునేందుకు వచ్చిన అవకాశాన్ని లోకేశ్‌ చేజేతులా వదులుకున్నారు.

మే 27, 2012 న వైఎస్‌ జగన్‌ జైలుకు వెళ్లినప్పుడు కొత్తగా ఏర్పడిన వైఎస్సార్సీపీలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడకుండా, వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ షర్మిల పార్టీ బాధ్యతల్ని తమ భుజాలపైకి ఎత్తుకుని పార్టీకి కొత్తశక్తిని ఇవ్వడంతోపాటు దానికి దిశా దశా నిర్దేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 రోజుల పాటు విస్తృతంగా ఊరూ-వాడా తిరిగి ఉపఎన్నికల్లో 18 నియోజకవర్గాలకు 15 స్థానాలను ఒంటిచేత్తో గెలిపించారు. దాంతో పార్టీ నిలబడిరది. ఆ తర్వాత కూడా దాదాపు 15 నెలల పాటు జగన్‌ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. అయినా మొక్కవోని ధైర్యంతో పోరాడుతూ వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ షర్మిలా ఢిల్లీ కి వెళ్లి లాయర్ల చుట్టూ తిరగకుండా ధైర్యంగా గల్లీలో పోరాటం చేశారు.

వైఎస్‌ షర్మిలా ఏ మహిళా చేయనంతగా, సాహసంతో రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలుగా వైఎస్‌ విజయమ్మ దీక్షలు, రాస్తారోకోలు చేస్తూనే, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపించడంతోపాటు, సమైక్య రాష్ట్రం కోసం కూడా ఆమరణ నిరాహారదీక్ష వంటి కార్యక్రమాలను చేపట్టి వైఎస్‌ఆర్‌సీపీని బ్రతికించారు.

ప్రస్తుతం ఇప్పుడు అచ్చం ఇలాంటి సంక్షోభ పరిస్థితినే ఎదుర్కొంటున్న టీడీపీలో మాత్రం ఆ పోరాట పటిమ, సమయస్ఫూర్తి కానరావడం లేదు. దీనికి తోడు దిశా-దశా లేకుండా పార్టీ వ్యవహరిస్తోంది.

చంద్రబాబు అరెస్టు తర్వాత లోకేశ్‌ ఢిల్లీ కి వెళ్లారు. ఒక రోజు, రెండు రోజులనుకుంటే సరే, రోజుల తరబడి ఆయన ఢిల్లీ చుట్టూ తిరగడం సమర్థనీయం కాదు. న్యాయవాదులతో సంప్రదింపుల పేరిట ఢిల్లీలో రోజుల తరబడి మకాం వేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు అరెస్టు న్యాయపరిధిలో ఉంది, కాబట్టి దాన్ని లీగల్‌ టీమ్‌కి అప్పగించి లోకేశ్‌ ప్రజాక్షేత్రంలోకి వెళ్లుంటే పరిస్థితులు మరోలా ఉండేవి. నాయకుడిగా తనను తాను నిరూపించుకోవడానికి వచ్చిన ఈ సదవకాశాన్ని ఆయనే జారవిడుచుకున్నారు.

యువగళం మధ్యలో ఆపేయడం లోకేశ్‌ చేస్తున్న అతిపెద్ద తప్పు. పాదయాత్ర చేస్తే, మధ్యలో ఆపి అరెస్టు చేస్తే, మహా అయితే, జైలుకు వెళ్తారు. కానీ, యువగళం ద్వారా ప్రజా నాయకుడిగా ఎదిగేందుకు వచ్చిన సువర్ణవకాశాన్ని లోకేశ్‌ జారవిడుచుకుంటున్నారు. 16 నెలలు జైలులో ఉండి వచ్చిన వారం రోజుల్లోపే జగన్‌ లోటస్‌ పాండ్‌ వద్ద సమైక్యాంధ్ర కోసం దీక్ష చేశారు. జైలు నుంచి వచ్చేనాటికి ఎన్నికలకు ఆరు నెలలే ఉండటంతో, ఆ ఆరు నెలలూ ఊరూవాడా తిరిగారు. 67 సీట్లతో గెలుపుకు దగ్గరగా వచ్చి, ప్రతిపక్షనేత అయ్యారు. ఆ తర్వాత ప్రతి శుక్రవారం కోర్టులో విచారణకు హాజరవుతూనే సంవత్సరం పాటు నిరంతరాయంగా 113 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాసంకల్ప పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు. జైలుకు భయపడితే జగన్‌ ముఖ్యమంత్రి అయ్యేవారా? ఎన్నికలకు ఇంకా 180 రోజుల సమయం మిగిలి ఉన్న ఈ తరుణంలో ఇలాంటి సంకల్పం లోకేశ్‌లో లేదని కొట్టొచ్చినట్టు కనపడుతోంది.

వైఎస్‌.రాజశేఖరరెడ్డి అకాల మరణం తట్టుకోలేక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుమారుడిగా వైఎస్‌ జగన్‌ ఓదార్పు యాత్ర పేరిట నెలల తరబడి చనిపోయిన కుటుంబాలను పరామర్శించడానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడమే కాకుండా ఆ కుటుంబాలను ఆదుకోవడానికి కొంత సహాయం అందజేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేశారనే బాధ తట్టుకోలేక కొంతమంది ప్రాణాలు విడిచినట్లు మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. అరెస్టును తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారని టీడీపీ నాయకులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నా, ఆ కుటుంబాల దగ్గరకు వెళ్లి ఓదార్చే ప్రయత్నం టీడీపీ నాయకులు కానీ, నారా లోకేశ్‌, నారాబ్రాహ్మణి, నారా భువనేశ్వరి ఏ ఒక్కరూ చేయడం లేదు. హెలికాఫ్టర్‌ ప్రమాదంలో తన కుమారుడు సంజయ్‌ గాంధీ చనిపోయినప్పుడు, ఇందిరాగాంధీ ముందుగా ఆ ప్రమాదంలో చనిపోయిన కో పైలట్‌ కుటుంబాన్ని పరామర్శించారు. నాయకుడు అంటే అలా ధైర్యం ఇవ్వాలి.

చంద్రబాబు 73 ఏళ్ల వయసులో కూడా అలుపెరగని పోరాటం చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనకున్న మనోధైర్యము, సంకల్పము, పట్టుదల, సమయస్ఫూర్తి, ప్రస్తుత టీడీపీ నాయకగళంలో ఇసుమంతా కూడా ఏ ఒక్కరిలో లేదు. లోకేశ్‌ ఈ దిశగా ఆలోచించాల్సిన అసవరం ఉంది.

వైఎస్‌ విజయమ్మలాగా, నారా భువనేశ్వరి, వైఎస్‌ షర్మిలా వలే నారా బ్రహ్మణి పార్టీలో కీలక పాత్ర పోషిస్తారని అందరూ ఊహించినా... ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తల మనోభావాలకు తగ్గట్టుగా వ్యవహరించడం లేదనే అసంతృప్తి ప్రజల్లో, పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నెలకొంది. రాజమండ్రి సరిహద్దులు దాటి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ఒక్క కార్యక్రమం కూడా వారు నిర్వహించకపోవడం దీనికి నిదర్శనం.

చంద్రబాబు అరెస్టు విషయంలో బీజేపీ నాయకులపై వస్తున్న విమర్శలకు వారు పెదవి విప్పకపోయినా నారా లోకేశ్‌తో సహా టీడీపీ నాయకులు మాత్రం బీజేపీ ప్రమేయమేమీ లేదని బీజేపీకి క్లీన్‌చీట్‌ ఇవ్వడాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గుడ్డిగా ఆ పార్టీని సమర్థించడాన్ని బట్టే టీడీపీ బలహీనత బయటపడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టీడీపీ అంటే నాయకులను తయారుచేసే ఫ్యాక్టరీ అని గొప్పలు చెప్పుకుంటారు. కానీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ తర్వాత ఫ్యాక్టరీలో తయారుచేసిన నాయకులు, కార్యకర్తలు ఏమైనట్లు? దీనికి టీడీపీ నాయకత్వం సమాధానం చెప్పాలి.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తరువాత దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఆ పార్టీకి ఊపిరి పోసింది జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌. ఇందులో ఎటువంటి సందేహం లేదు. జైల్లో చంద్రబాబును కలిసి, పొత్తు ప్రకటించిన తరువాతే టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ధైర్యం వచ్చింది. వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. కష్టాల్లో ఉన్న టీడీపీకి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ చేసిన ఈ సహాయాన్ని జీవితంలో వారు మర్చిపోకూడదు.

జనసేన-టీడీపీ పొత్తు కార్యాచరణ కోసం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ తమ పార్టీ తరుఫున నాదేండ్ల మనోహర్‌ చైర్మన్‌గా సమన్వయ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. కానీ, తమవైపు నుంచి సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పిన టీడీపీ రోజులు గడుస్తున్నా... ఏమీ తేల్చడం లేదు.

ఈ నాలుగున్నరేళ్లుగా వైఎస్‌ఆర్‌సీపీ ఎజెండా సెట్‌ చేస్తోంది. వైఎస్‌ఆర్‌సీపీ ఎజెండాలో పడిపోవడం లేదా అనుకూల మీడియా ఎజెండాను అమలు చేయడం తప్ప టీడీపీకి సొంత ఎజెండానే లేదు. ఎంతసేపూ పీపీటీలు, మీడియా కాన్ఫరెన్సులు, సోషల్‌ మీడియా పోస్టులతోనే కాలాన్ని వెల్లదీస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌ కేసులతో తమను వేధిస్తుంటే, తమ నాయకులు గంటల తరబడి టెలికాన్ఫరెన్సులతో వేధిస్తున్నారని స్వయంగా టీడీపీ కార్యకర్తలే వాపోవడం దేనికి సంకేతం? ప్రపంచ బాధ శ్రీశ్రీది, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానిది అన్నట్టు... టీడీపీ బాధ ప్రపంచానిది అనుకుంటే ఎలా? ప్రజల బాధ టీడీపీ బాధ అయినప్పుడే పార్టీకి మనుగడ ఉంటుంది.

చంద్రబాబు అరెస్టును లీగల్‌ టీమ్‌కి వదిలేయాలి. ఈసారి టీడీపీ అధికారంలోకి రాకపోతే, ఇంకెప్పటికీ రాదు అన్నట్టుగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి, ఒక్కో నియోజకవర్గంలో వంద గ్రామాలు, సుమారు 250- 300 పోలింగ్‌ స్టేషన్లు ఉంటాయి. ఎన్నికలకు 180 రోజులే ఉన్న నేపథ్యంలో... ఇప్పటికైనా సోషల్‌మీడియా పోస్టులకు, మీడియాకు దూరంగా ఉంటూ క్షేత్రస్థాయిలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటేనే టీడీపీకి భవిష్యత్‌ ఉంటుంది. లేనిపక్షంలో 2019 ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయి.

అధికార వైఎస్‌ఆర్‌సీపీ వ్యుహాత్మకంగా ప్రతిపక్షాన్ని పక్కదోవ పట్టించి, ‘గడపగడపకు ప్రభుత్వం’, ‘ఏపీకి జగనే ఎందుకు కావాలంటే’, ‘జగనైతేనే చేస్తాడు’ వంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేరువ అవుతూ వారి మనస్సులను దోచుకుంటోంది. వాలెంటీర్లతో పోలింగ్‌ బూతుల వారీగా సమాచారం సేకరించి, వివిధ కులాలకు జరిగిన లబ్థిని జగన్‌ వాయిస్‌ మెసేజ్‌తో లబ్ధిదారులకు చేరవేస్తున్నారు. వైసీపీ ఇంత సూక్ష్మస్థాయి ప్రచారం చేస్తుంటే, ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఇంకా ఎన్నికలు నాలుగు సంవత్సరాలు ఉన్నాయన్నట్లుగా సోషల్‌ మీడియా పోస్టులకు, మీడియా పోస్టులకే పరిమితమవుతోంది.

టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు విరమించుకున్నట్లు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా విరమించుకుంటుందా? అనే సందేహాలు టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరును పరిశీలిస్తే రాష్ట్ర ప్రజలకు కలుగుతోంది. మొరం రాళ్లపై శిల్పాలు చెక్కడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఇప్పటికైనా టీడీపీ గ్రహించి, ఊహా ప్రపంచం నుంచి బయటకు వచ్చి వాస్తవాలకు దగ్గరగా తమ రాజకీయ కార్యాచరణ రూపొందించుకుంటేనే వారికి భవిష్యత్తు ఉంటుంది. టీడీపీ నాయకులు ప్రస్తుత పనితీరులో 360 డిగ్రీలు మార్పు రావాలి. ఈ మార్పు కోసం ఏ కన్సెల్టెన్సీ దగ్గరకో వెళ్లి కోట్ల ఫీజులు చెల్లించి గోలీలు తెచ్చుకోనక్కర్లేదు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి, విజయవాడలో గద్దె రామ్మోహన్‌ రావు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు వంటి నిఖార్సయిన నాయకులు ప్రజల్లో ఉంటూ ఎలా పని చేస్తున్నారో అధ్యయనం చేసి, దాన్నే రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రతీ ఒక్క టీడీపీ నాయకుడు అమలు చేస్తే ఫలితం ఉంటుంది, పార్టీకి దిశా-దశా లభిస్తుంది.

- జి.మురళికృష్ణ,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

Email: peoplespulse.hyd@gmail.com

- జి.మురళికృష్ణ, రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,
- జి.మురళికృష్ణ, రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

(డిస్‌క్లెయిమర్: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు రచయిత వ్యక్తిగతం లేదా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థవి. హెచ్‌టీ తెలుగువి కావు..)

WhatsApp channel