Betting On AP Elections : ఏపీ ఎన్నికలపై కాయ్ రాజా కాయ్-అభ్యర్థుల గెలుపుపై జోరుగా బెట్టింగులు
20 April 2024, 15:07 IST
- Betting On AP Elections : ఏపీ ఎన్నికలపై బెట్టింగ్ లు జోరందుతున్నాయి. అభ్యర్థుల గెలుపు, మెజార్టీ, ప్రభుత్వం ఏర్పాటుపై బెట్టింగులు కాస్తున్నారు.
ఏపీ ఎన్నికలపై కాయ్ రాజా కాయ్
Betting On AP Elections : ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్(AP Politics) ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి. సాధారణ రోజుల్లోనే తిట్లదండకం చదివే నేతలు... ఇక ఎన్నికల్లో ఆగుతారా? ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా...విమర్శలతో ప్రచారం హోరెక్కిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు(AP Assembly Lok Sabha Elections) ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీలో ఎవర్ని కదిపినా రాజకీయమే ప్రధాన అంశం. ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే చర్చే జరుగుతోంది. కూటమికి అధికారం ఇస్తారా? మళ్లీ జగన్ కే కుర్చీ కట్టబెడతారా? పిఠాపురంలో పవన్ మెజార్టీ ఎంత? బూతులు తిట్టిన నేతల పరిస్థితి ఏంటి? అందరి దృష్టి ఓటర్ (Voter)నాడిపైనే ఉంది. సాధారణంగానే కాయ్ రాజా కాయ్ అనే బెట్టింగ్ రాయుళ్లు... ఇక ఎన్నికలంటే ఆగుతారా? తమ నియోజకవర్గంలో అభ్యర్థి నుంచి దేశ ప్రధాని వరకూ ఎవరు గెలుస్తారో అంచనాలు వేసేసుకుని బెట్టింగులు కాసేస్తున్నారు.
కూటమి వర్సెస్ జగన్
ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు ఎవరిది, కూటమికి(NDA) ఎన్ని సీట్లు, వైసీపీ(Ysrcp)కి ఎన్ని సీట్లు, అభ్యర్థుల మెజార్టీలపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. సర్వేల ఆధారంగా పార్టీల గెలుపు అవకాశాలపై బెట్టింగులు జోరందుకున్నాయి. జాతీయ మీడియా సంస్థల సర్వేల(Election Survey) ఆధారంగా ఏపీలో కూటమి విజయంపై పందేలు కాస్తున్నాయి. కూటమికి 100కి పైగా సీట్లు అంటూ 1కి 10 రెట్లు బెట్టింగ్ నడుస్తోంది. ఇక అభ్యర్థుల మెజార్టీలపైనా జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. గోదావరి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందంటూ పెద్ద మొత్తంలో బెట్టింగ్‌లు కాస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన(TDP BJP Janasena) కలిసి పోటీ చేస్తున్నాయి. ప్రచారంలో కూడా మూడు పార్టీలు ఉమ్మడిగా ముందుకెళ్తున్నాయి. దీంతో బెట్టింగ్(Betting) రాయుళ్ల మొగ్గు కూటమి వైపు ఉందని తెలుస్తోంది. వైసీపీకి రెండోసారి అవకాశం ఉంటుందని కొందరు బెట్టింగ్ కాస్తున్నాయి. మేజిక్ ఫిగర్ కు కాస్త అటు ఇటుగా వైసీపీకి సీట్లు వస్తాయని కొందరు బెట్టింగులు పెడుతున్నారని తెలుస్తోంది.
పిఠాపురం, మంగళగిరి స్థానాలపై
రాష్ట్రంలోని కొన్ని కీలక నియోజకవర్గాల్లో విజయాలపై బెట్టింగ్(Betting) రాయుళ్లు జోరుగా పందేలు కాస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పోటీ చేస్తున్న పిఠాపురం(Pithapuram), లోకేష్(Lokesh) పోటీ చేస్తున్న మంగళగిరి(Mangalagiri), చంద్రబాబు(Chandrababu) పోటీ చేస్తున్న కుప్పం, జగన్ పోటీ చేస్తున్న పులివెందుల, షర్మిల(YS Sharmila) పోటీ చేస్తున్న కడప స్థానాల్లో గెలుపు, మెజార్టీలపై జోరుగా పందేలు కడుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో పవన్ కల్యాణ్ ఓడిపోయారు. దీంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం స్థానంపై కూడా జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయని సమాచారం. పవన్ మెజార్టీ(Pawan Kalyan Majority)పై పందెంరాయుళ్లు బెట్టింగులు పెడుతున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల కడప ఎంపీ(Kadapa MP )గా పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు. అక్కాతమ్ముళ్ల మధ్య పోరుపై ఆసక్తి నెలకొంది. దీంతో కడప ఎంపీ సీటుపై కూడా పందెంరాయుళ్లు కన్నేశారు. గత ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్ ఓడిపోయారు. ఈసారి విజయం సాధించాలని జోరుగా ప్రచారం చేస్తున్నారు. మంగళగిరిలో లోకేష్ గెలుపుపై కూడా బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాస్తున్నారని సమాచారం.
పులివెందులలో మెజార్టీపై
వైనాట్ 175 అంటూ ఎన్నికల బరిలో దిగిన వైసీపీ(Ysrcp)...జోరుగా ప్రచారం చేస్తుంది. సీఎం జగన్(CM Jagan) మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర చేస్తున్నారు. అయితే ఈసారి పులివెందులలో(Pulivendula) జగన్ మెజారిటీ తగ్గుతుందనే అంశం బెట్టింగ్(Betting) జోరుగా సాగుతోందని సమాచారం. మంత్రులుగా చేసినవాళ్ల సీట్లు గల్లంతు అవుతాయని, వైసీపీ 30 లోపు సీట్లు వస్తాయని, బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాస్తున్నారు.
(బెట్టింగ్ చట్టరీత్యా నేరం. బెట్టింగ్ కాసినా, ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ ఆర్టికల్ మీ అవగాహన కోసం మాత్రమే)