AP Elections 2024 : ఆంధ్రాలో ఎన్నికలు.. తెలంగాణలో బెట్టింగులు.!
05 April 2024, 20:29 IST
- AP Elections 2024 Updates : ఏపీలో ఎన్నికల యుద్ధం మొదలుకాగా… గెలుపోటములపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. అయితే తెలంగాణలో పలువురు జోరుగా బెట్టింగులకు దిగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - 2024
AP Elections 2024 Updates : ఆంద్రప్రదేశ్ లో(AP Elections 2024) ఎవరిది విజయం.? మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారా..? లేక ఈసారి చతికిల పడతారా..? బీజేపీతో తెలుగుదేశం పార్టీ, జనసేనల పొత్తు పొడుస్తుందా..? ఈ కూటమి జగన్ హవాను ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా..? ఏపీలో షర్మిల ప్రభావం ఎంత..? కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల ఏ పార్టీ ఓట్లను చీల్చబోతున్నారు..? కాంగ్రెస్ చీల్చే ఓట్లు వైసీపీకి నష్టం చేకూరుస్తాయా..? లేక కూటమిని కుప్ప కూలుస్తాయా..? ఇవ్వన్నీ కనీస రాజకీయ పరిజ్ఞానం కలిగిన సగటు వ్యక్తుల్లో తలెత్తుతున్న ప్రశ్నలు. ఇవి వారిలో ప్రశ్నలుగానే ఉండిపోవట్లేదు సుమీ.! వారి మెదడులో నుంచి బయటికొచ్చి ఎదుటి వారితో చర్చలుగా రూపాంతరం చెందుతున్నాయి. రాజకీయంగా బాగా ఆసక్తి కలిగిన వారిలో ఇవి బెట్టింగులకు సైతం దారి తీస్తున్నాయి.
తెలంగాణలో జోరుగా బెట్టింగులు..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే తెలంగాణ జనానికి ఈ ఎన్నికల కంటే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలపైనే ఎక్కువ ఆసక్తి నెలకొంది. ఏది ఏమైనా అసెంబ్లీ ఎన్నికల మజానే వేరు కదా..! అందుకే కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం మాటేమో గానీ ఏపీలో ఏం జరగబోతుందన్న ఆసక్తి తెలంగాణ ప్రాజానీకానికి ఎక్కువైంది. ఈ క్రమంలోనే బెట్టింగుల వరకూ ఈ ఆసక్తి ఉరకలు వేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రా ఎన్నికలపై బెట్టింగుల జోరు ఊపందుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ హీట్ వేసవిలో ఎండ వేడిని మించుతోంది. తాజాగా ఏ నలుగురు కలిసినా ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. ఇది చర్చ వరకే పరిమితం కాకుండా పందేలు కాసే వరకూ వస్తోంది. తెలంగాణలో పల్లె, పట్టణం తేడా లేకుండా వేల నుంచి మొదలుకుని లక్షల్లోకి బెట్టింగుల(Beatings On AP Elections 2024) జోరు సాగుతోంది. ఏపీలో మళ్లీ జగనే సీఎం అవుతాడని లక్షల్లో బెట్టింగులు నడుస్తున్నాయి. కాదు.. కాదు.. చంద్రబాబు కూటమి ఈసారి విజయం సాధిస్తుందని బాబు అభిమానులు పందేలు కాస్తున్నారు. ఈ బెట్టింగుల జోరు వేలు దాటి లక్షల్లోకి వెళుతున్నట్లు కనిపిస్తోంది. కొందరైతే డబ్బు కాకుండా వస్తువులను పందెంలో ఒడ్డుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
వైసీపీకి(YSRCP) ఎన్ని సీట్లు వస్తాయి..? ఎన్ని సీట్లతో మళ్లీ ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది..? జగన్ అమలు చేసిన పథకాలు ఎంత ప్రభావం చూపిస్తాయి..? అనే అంశాల ఆధారంగా బెట్టింగులు సాగుతున్నాయి. కొందరైతే బీజేపీతో కూడిన చంద్రబాబు కూటమిని సమర్థిస్తూ ఆ కూటమి సర్కారును ఏర్పరుస్తుందని బెట్టింగులు కాస్తుండగా ప్రత్యర్ధులు అసలు ఆ పొత్తులే వారి కొంప ముంచుతాయని పందేలు కడుతున్నారు. ఈక్రమంలో 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాధించిన ఫలితాన్ని ఉదహరిస్తున్నారు. అలాగే తాజా ఏపీ కేబినెట్ లో మంత్రుల గెలుపోటములపై కూడా బెట్టింగులు సాగుతున్నాయి. ఇలా లక్షల్లో పందేలు పెట్టి ఎన్నికల ఫలితాల కోసం ఇప్పటి నుంచే ఎదురు తెన్నులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కొందరైతే ఈ బెట్టింగులు ఆన్లైన్ వేదికగా కొనసాగిస్తున్న క్రమంలో పోలీసుల కంట కూడా పడని స్థితి కనిపిస్తోంది.