Pawan in Pithapuram : పిఠాపురంలో నన్ను గెలిపించండి, మీకోసం పనిచేస్తాను - ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్-janasena chief pawan kalyan election campaign start in pithapuram assembly constituency ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Pawan In Pithapuram : పిఠాపురంలో నన్ను గెలిపించండి, మీకోసం పనిచేస్తాను - ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్

Pawan in Pithapuram : పిఠాపురంలో నన్ను గెలిపించండి, మీకోసం పనిచేస్తాను - ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 31, 2024 07:25 AM IST

Pawan Election Campaign Updates:ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. శనివారం పిఠాపురంలో మాట్లాడిన ఆయన.... ప్రజాధనం దోచేసిన జగన్ పేదవాడు అయితే సొంత డబ్బును పంచిన నేను పెత్తందారుడినా..? అని ప్రశ్నించారు.వచ్చే ఎన్నికల్లో మరోసారి జగన్ చేతిలో మోసపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.

పిఠాపురంలో పవన్ ప్రచారం
పిఠాపురంలో పవన్ ప్రచారం (Janasena Twitter)

Pawan Kalyan Election Campaign 2024 Updates: పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని(Pawan Kalyan Election Campaign) ప్రారంభించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. శనివారం చేబ్రోలు గ్రామంలో తలపెట్టిన ‘వారాహి విజయభేరీ సభ’లో మాట్లాడిన ఆయన… ఈ ఎన్నికల్లో పిఠాపురం (Pithapuram assembly constituency)నుంచి తనను గెలిపించాలని ప్రజలను కోరారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పవన్.

మద్యం అమ్మకాల్లో డిజిటల్ కరెన్సీ తీసేసి రూ.20 వేలకోట్లు లూటీ చేశారని ఆరోపించారు పవన్. వైసీపీ అవినీతిపై గత నాలుగేళ్లలో 8 లక్షలకు పైగా ప్రజా ఫిర్యాదులు అందాయని…. ఇందులో మంత్రులు, వారి పేషీలపై 2 లక్షలకుపైగా ఫిర్యాదులు ఉన్నాయని చెప్పారు. కాకినాడ పోర్టులో ఎన్నికల కోసం కంటైనర్లలో డబ్బులు దాచారనే ప్రచారం నడుస్తోందన్న పవన్….. దేవాలయాలపై దాడులు చేసిన వారిని ఎందుకు పట్టుకోలేదో ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. పిఠాపురాన్ని ఆధ్యాత్మిక సర్య్కూట్ గా తయారు చేస్తానని చెప్పిన ఆయన… పిఠాపురం(Pithapuram assembly constituency) రైతుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో మల్టీ స్పెషాలిటీ తరహా ఆస్పత్రి నిర్మిస్తామని…. వచ్చే ఎన్నికల్లో మరోసారి జగన్ చేతిలో మోసపోవద్దని పిలుపునిచ్చారు.

పిఠాపురంలోనే ఉంటాను - పవన్ కల్యాణ్

వైసీపీ ప్రభుత్వానికి సౌండ్ ఎక్కువ - గాలి తక్కువ అని ఎద్దేవే చేశారు పవన్ కల్యాణ్(Pawan Kalyan). తాను ఏరోజు తన గెలుపు కోసం పనిచేయలేదని… మారుమూల ప్రాంతాల సమస్యలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు పరిష్కారం కోసమే పనిచేశానని గుర్తు చేశారు. అలాంటి తనను ఈరోజు లక్ష మెజారిటీ తో గెలిపిస్తాం అని చెప్పిన పిఠాపురం ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. “మా నియోజకవర్గానికి ఏం చేస్తావ్ అని ప్రజలకు నాపై అనుమానం ఉండి ఉండొచ్చు, కానీ శ్రీ పాద శ్రీ వల్లభుడు పుట్టిన నేల, అష్టాదశ శక్తి పీఠం అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, నేను పిఠాపురాన్ని నా స్వస్థలం చేసుకుంటాను.నేను నా పిఠాపురం(Pithapuram), ఉప్పాడ, కొత్తపల్లి, 54 గ్రామాల ప్రజలను అడుగుతున్నాను, నన్ను గెలిపించండి మీకోసం పనిచేస్తాను.ఉప్పాడ తీరప్రాంతం కోతకు గురైతే నా వాడబలిజ, మత్స్యకార సోదరులు నష్టపోతున్నారు, వారి కోసం, వారికి అండగా నిలబడటం కోసం పనిచేస్తాను.మీకోసం నిలబడతాను. నేను 2022 లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పాను, అది చేసి చూపించాను. మాట్లాడితే పెత్తందారులు - పేదల మధ్య పోరాటం అని వైఎస్ జగన్ అంటారు. విశాఖలో మమ్మల్ని అడ్డుకుంది ఎవరు? పేదల ఇల్లు కూల్చింది ఎవరు? మాస్క్ అడిగిన సుధాకర్ గారి చావుకు కారణం ఎవరు డ్రైవర్ ను చంపిన MLC అనంత బాబును వెంటేసుకుని తిరుగుతున్న పెత్తందారీ ఎవరు? వేల కోట్ల లిక్కర్ మాఫీయా చేసింది మీరా మేమా?ఎవరు పెత్తందారులు…?” అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్ది చూపిస్తానని చెప్పారు పవన్. “వంగా గీత ఓట్ల కోసం వస్తే… 219 దేవాలయాలు కూల్చేశారు, పవిత్రమైన బ్రాహ్మణుల యజ్ఞోపవీతాన్ని టెంపిన వ్యక్తులు వైసీపీ నాయకులు, అలాంటి వారిని ప్రోత్సహించే పార్టీకి ఎందుకు ఓటు వేయాలో అడగండి. నన్న గెలిపిస్తే మన పిఠాపురాన్ని టెంపుల్ సర్క్యూట్ సిటీగా అభివృద్ది చేస్తాను. గొల్లప్రోలు వద్ద ఉన్న సంతను అభివృద్ది చేస్తాను. ఉప్పాడ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను, సూరయ్య మాన్యం రైతులను ఆదుకుంటాను. సీడ్ సెంటర్ ను ఇక్కడ అభివృద్ది చేస్తాను. గొల్లప్రోలు లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తాను. దుర్గాడ మిర్చి పంటకు క్రాషింగ్ ఫ్లోర్ ఏర్పాటు చేస్తాను” అని పవన్ కల్యాణ్ హామీలిచ్చారు.

Pawan Election Campaign: తొలి విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్

  • మార్చ్ 30 నుండి ఏప్రిల్ 2 వరకు పిఠాపురంలోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.
  • ఏప్రిల్ 3 - తెనాలి.
  • ఏప్రిల్ 4 - నెల్లిమర్ల.
  • ఏప్రిల్ 5 - అనకాపల్లి.
  • ఏప్రిల్ 6 - ఎలమంచిలి.
  • ఏప్రిల్ 7 - పెందుర్తి.
  • ఏప్రిల్ 8 - కాకినాడ రూరల్.
  • ఏప్రిల్ 9 - పిఠాపురంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో పవన్ పాల్గొంటారు.
  • ఏప్రిల్ 10 - రాజోలు.
  • ఏప్రిల్ 11 - పి. గన్నవరం.
  • ఏప్రిల్ 12 - రాజానగరం.