YSRCP Candidates: కొనసాగుతున్న వైసీపీ అభ్యర్థుల కూర్పు..ఎనిమిదో జాబితా విడుదల.. మరికొన్ని జాబితాలు రెడీ
YSRCP Candidates: వైసీపీలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. తాజాగా ఎనిమిదో జాబితాను 8th List పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది.
YSRCP Candidates: వైఎస్సార్సీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో కూడిన ఎనిమిదో జాబితాను బుధవారం రాత్రి విడుదల చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో గుంటూరుకు కిలారు రోశయ్య, ఒంగోలుకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని.. అసెంబ్లీ స్థానాల్లో పొన్నూరుకు మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళి, కందుకూరుకు బుర్రా మధుసూదన్ యాదవ్, జీడీ నెల్లూరుకు కృపాలక్ష్మిని సమన్వయకర్తలుగా నియమిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.
మరోవైపు రకరకాల కారణాలతో వైసీపీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. టిక్కెట్లు రాకపోవడం, అసెంబ్లీకి పోటీ చేయాలని ఆదేశించడంతో పాటు సర్వేల్లో ప్రతికూల ఫలితాలు వచ్చిన వారిని పక్కన పెట్టడంతో వారంతా ప్రత్యామ్నయాల వైపు చూస్తున్నారు. తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు.
ఇప్పటికే వైసీపీ లోక్‌సభ ఎంపీలు డాక్టర్ సంజీవ్‌కుమార్ (కర్నూలు), లావు శ్రీకృష్ణ దేవరాయలు (నరసరావుపేట), వల్లభనేని బాలశౌరి (మచిలీపట్నం), రఘురామకృష్ణరాజు (నరసాపురం) పార్టీకి రాజీనామా చేశారు. మొత్తం అయిదుగురు లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడారు. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి , హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు టికెట్ కేటాయించ లేదు. 2019లో లోక్‌సభకు ఎన్నికైన వారిలో ఏడుగురు ఎంపీలకు ఈసారి అవకాశం లేకుండా పోయింది.
అరకు ఎంపీగా ఉన్న గోడ్డేటి మాధవిని అరకు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా నియమించారు. తాజాగా అక్కడ మరో కొత్త సమన్వయకర్తను తెరపైకి తీసుకువచ్చారు. మాధవిని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆమెకు మరోచోట టికెట్ ఇస్తారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయలేనని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు.
భారీగా మార్పులు..
తాజా జాబితాలో ఒంగోలు పార్లమెంటరీ స్థానం ఇన్‌ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న కిలారు రోశయ్యకు.. గుంటూరు ఎంపీ ఇన్‌ఛార్జిగా ప్రకటించారు.
గత జనవరి నుంచి వైసీపీ అసెంబ్లీ, లోక్‌సభ నియోజక వర్గాలకు అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో దాదాపు 65 స్థానాల్లో మార్పులు చేసింది. కొందరిని పూర్తిగా పక్కన పెట్టడమో, పార్లమెంటు అభ్యర్థుల్ని ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీ స్థానాలకు ప్రకటించడమో చేశారు. మొత్తం ఎనిమిది జాబితాల్లో పెద్ద ఎత్తున బీసీ అభ్యర్థులకు స్థానం కల్పించారు.
అన్ రిజర్వ్‌డ్ నియోజక వర్గాల్లో ఎక్కువగా బీసీ అభ్యర్థులకు అవకాశం కల్పించారు. సోషల్ ఇంజనీరింగ్ పేరుతో వైసీపీ బీసీ ఓట్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సారి ఎన్నికల్లో 175కు 175 నియోజక వర్గాల్లో గెలిచి తీరాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.
పార్లమెంటు అభ్యర్థుల్లో సైతం సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాకు వైసీపీ అధ్యక్షుడు పెద్ద పీట వేస్తున్నారు. రిజర్వుడు నియోజక వర్గాల్లో సైతం కొత్త వారికి అవకాశం కల్పించడమో, నియోజక వర్గాల్లో మార్పులు చేయడమో చేస్తున్నారు. దీని ద్వారా స్థానికంగా ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తితో ఉన్న వారికి మరో ప్రత్యామ్నయ నాయకత్వాన్ని పరిచయం చేస్తున్నారు. త్వరలో మరికొన్ని నియోజక వర్గాల్లో మార్పులు ఉండొచ్చని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.