IND vs PAK: ఫైనల్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసి టైటిల్ గెలిచిన ఇండియా - అదరగొట్టిన తెలుగు క్రికెటర్
14 July 2024, 15:15 IST
IND vs PAK: వరల్డ్ లెజెండ్స్ ఛాంపియన్స్ టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఇండియా చిత్తు చేసింది. అంబాటిరాయుడు హాఫ్ సెంచరీతో రాణించి ఇండియా ఛాంపియన్స్‌కు కప్ అందించాడు.
ఇండియా వర్సెస్ పాకిస్థాన్
IND vs PAK: వరల్డ్ లెజెండ్స్ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను టీమిండియా సొంతం చేసుకున్నది. శనివారం జరిగిన ఫైనల్‌లో పాకిస్తాన్‌పై ఇండియా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తెలుగు క్రికెటర్ అంబాటి రాయుడు హాఫ్ సెంచరీతో రాణించి టీమిండియాకు కప్పు అందించాడు. ఫైనల్ లో అంబాటి రాయుడితో పాటు యూసుఫ్ పఠాన్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.
షోయబ్ మాలిక్ మినహా...
ఈ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఛాంపియన్స్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 156 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ తడబడటంతో పాకిస్తాన్ మోస్తారు స్కోరు కే పరిమితమైంది. షోయబ్ మాలిక్ 36 బాల్స్‌లో మూడు సిక్సర్లతో 41 రన్స్ చేశాడు.
కమ్రాన్ ఆక్మల్ 19 బాల్స్‌లో 24 రన్స్ చేయగా మక్సూద్ 21 పరుగులు చేసి ఔటయ్యాడు. చివరలో సోహైల్ తన్వీర్ 9 బాల్స్‌లో ఓ సిక్సర్, రెండు ఫోర్లతో 19 రన్స్ చేసి పాకిస్థాన్‌ను 150 పరుగులు దాటించాడు.
భారత బౌలర్లలో అనురీత్ సింగ్ మూడు వికెట్లు, ఇర్ఫాన్ పఠాన్, వినయ్ కుమార్, పవన్ నేగి తలో వికెట్ దక్కించుకున్నారు.
అంబాటిరాయుడు హాఫ్ సెంచరీ...
157 పరుగుల టార్గెట్‌లో బరిలో దిగిన ఇండియా ఛాంపియన్స్‌కు తెలుగు క్రికెటర్ అంబాటి రాయుడు అదిరే ఆరంభాన్ని అందించాడు. ఉతప్ప, రైనా విఫలమైన గురు కీరత్ సింగ్ మన్‌తో కలిసి ఇండియా టీమ్‌ను విజయం దిశగా నడిపించాడు. అంబాటి రాయుడు హాఫ్ సెంచరీ (30 బాల్స్‌లో రెండు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 50 రన్స్) సాధించగా...గురుకీరత్ 33 బాల్స్‌లో 34 రన్స్ చేశాడు.
యూసుఫ్ పఠాన్ మెరుపులు...
చివరలో యూసుఫ్ పఠాన్ 16 బాల్స్‌లో మూడు సిక్సర్లు ఓ ఫోర్‌తో 30 పరుగులతో చెలరేగడంతో 19.1 ఓవర్లలోనే టీమిండియా 159 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో అమీన్ యామిన్‌కు రెండు వికెట్లు దక్కాయి.
ఫైనల్‌లో హాఫ్ సెంచరీతో టీమిండియాకు కప్ అందించిన అంబాటి రాయుడుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా...యూసుఫ్ పఠాన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నారు.
ఈ టోర్నీలో ఇండియా ఛాంపియన్స్‌కు యువరాజ్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. టీ20, వన్డే వరల్డ్ కప్‌తో పాటు అండర్ 15, అండర్ 19 గెలిచిన వరల్డ్ కప్ జట్టులో యువరాజ్ సింగ్ సభ్యుడిగా ఉన్నాడు. అంతే కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ టైటిల్, దులీప్ ట్రోపీ, బీసీసీఐ కార్పొరేట్ ట్రోర్నీ, ఇరానీ కప్, టీ10 లీగ్‌తో పలు టైటిల్స్ తన ఖాతాలో వేసుకున్నాడు యువీ.