IND vs PAK Final: లెజెండ్స్ ఛాంపియన్స్ టోర్నీలో పాకిస్తాన్‌తో ఫైనల్ ఫైట్‌కు సిద్ధమైన టీమిండియా
IND vs PAK Final: వరల్డ్ లెజెండ్స్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా ఛాంపియన్స్ ఫైనల్ చేరుకుంది. తుది పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. సెమీస్‌లో ఆస్ట్రేలియాను 86 పరుగుల తేడాతో ఇండియా చిత్తు చేసింది.
IND vs PAK Final: వరల్డ్ లెజెండ్స్ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. తుది పోరులో పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా శనివారం ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
ఇండియా ఛాంపియన్స్ భారీ స్కోరు...
శుక్రవారం జరిగిన సెమీస్‌లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌పై 86 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోయారు. మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ఛాంపియన్స్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 254 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఉతప్ప, యువరాజ్ హాఫ్ సెంచరీలు...
ఓపెనర్ రాబిన్ ఉతప్ప 35 బాల్స్‌లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 65 రన్స్ చేశాడు. రాయుడు, రైనా విఫలమైనా కెప్టెన్ యువరాజ్ సింగ్, ఉతప్ప కలిసి ఇండియాకు మెరుపు ఆరంభాన్ని అందించారు. యువరాజ్ సింగ్ 28 బాల్స్‌లో ఐదు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 59 పరుగులు చేశాడు. తన షాట్లతో వింటేజ్ యువీని గుర్తుచేశాడు.
పఠాన్ బ్రదర్స్ విధ్వంసం...
చివరలో పఠాన్ బ్రదర్స్ విధ్వంసంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. ఇర్ఫాన్ పఠాన్ 19 బాల్స్‌లో ఐదు సిక్సర్లు మూడు ఫోర్లతో 50 రన్స్ చేయగా...యూసుఫ్ పఠాన్ 23 బాల్స్‌లో నాలుగు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 51 రన్స్ చేశాడు. ఆస్ట్రేలియా ఛాంపియన్స్ బౌలర్లలో పీటర్ సిడెల్ నాలుగు వికెట్లతో రాణించాడు.
86 పరుగుల తేడాతో...
255 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ఆస్ట్రేలియా ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 168 పరుగులు మాత్రమే చేసింది. 86 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.
ఇండియా ఛాంపియన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ పరుగులు చేయడానికి ఇబ్బందులు పడ్డారు. ఓపెనర్ షాన్ మార్ష్ రెండు పరుగులు, అరోన్ ఫించ్ 16 పరుగులకే ఔటయ్యారు.
మిగిలిన బ్యాట్స్‌మెన్స్ కూడా భారీ స్కోర్లు చేయలేకపోవడంలో ఆస్ట్రేలియా ఓటమి ఖాయమైంది. చివరలో టీమ్ ఫైన్ 32 బాల్స్‌లో మూడు సిక్సర్లు రెండు ఫోర్లతో 40, నాథన్ కౌల్టర్ నీల్ 13 బాల్స్‌లో 30 రన్స్ చేసి ఓటమి అంతరాన్ని తగ్గించారు. టీమిండియా బౌలర్లలో పవన్ నేగి, ధావల్ కులకర్ణి తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
వెస్టిండీప్‌పై పాకిస్తాన్ విజయం...
మరో సెమీ ఫైనల్‌లో వెస్టిండీస్ ఛాంపియన్స్‌పై విజయం సాధించి పాకిస్తాన్ ఛాంపియన్స్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఛాంపియన్స్ ఇరవై ఓవర్లలో 198 పరుగులు చేయగా...లక్ష్మ ఛేదనలో వెస్టిండీస్ 178 పరుగులు మాత్రమే చేసి ఇరవై పరుగుల తేడాతో ఓటమి పాలైంది.