Bypoll results : ‘ఉప’ సమరంలోనూ ఎన్డీఏకి షాక్! దూసుకెళుతున్న ఇండియా కూటమి..
జలంధర్ వెస్ట్ నుంచి ఆప్ అభ్యర్థి మోహిందర్ భగత్, డెహ్రాడూన్ స్థానం నుంచి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు సతీమణి కమలేష్ ఠాకూర్ గెలుపొందారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన మేర ప్రదర్శన చూపించలేకపోయిన బీజేపీ- ఎన్డీఏ కూటమికి మరో షాక్! ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఇటీవలే ఎన్నికలు జరగ్గా, వాటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం కొనసాగుతోంది. కాగా ఈ 13 సీట్లల్లో ఇండియా కూటమి ఇప్పటికే రెండు స్థానాల్లో విజయం సాధించి, మరో 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. భారతీయ జనతా పార్టీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది.
‘ఉప’ సమరంలోనూ బీజేపీకి షాక్ తప్పదా!
2024 లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్ల టార్గెట్ పెట్టుకుంది ఎన్డీఏ కూటమి. బీజేపీ సొంతగా 350 సీట్ల లక్ష్యాన్నిపెట్టుకుంది. కానీ మోదీ నేతృత్వంలోని బీజేపీ సొంతంగా మెజారిటీ సైతం దక్కించుకోలేకపోయింది. ఈ పరిణామాల మధ్య 13 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల సమరం ఆసక్తిగా మారింది.
లోక్‌సభ ఎన్నికల్లో 99 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ తాజా ఉప ఎన్నికల్ల ఉత్తరాఖండ్‌లో రెండు స్థానాల్లో, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో ఒక్కో స్థానంలో ఆధిక్యంలో ఉంది.
ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సతీమణి కమలేష్ ఠాకూర్‌ను బరిలోకి దింపిన డెహ్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఇప్పటికే గెలిచింది.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్).. పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్ నుంచి మోహిందర్ భగత్‌ను బరిలోకి దింపి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి శీతల్ అంగురాల్ పై 37 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించింది.
పశ్చిమ్ బెంగాల్లోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ తన ప్రత్యర్థులపై ముందంజలో ఉందని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గణాంకాలు చెబుతున్నాయి. మణిక్తాలా, బాగ్దా, రాణాఘాట్ దక్షిణ్, రాయ్‌గంజ్ అసెంబ్లీ స్థానాలకు జూలై 10న ఉప ఎన్నికలు జరిగాయి. తమిళనాడులోని విక్రావండి అసెంబ్లీ నియోజకవర్గంలో డీఎంకే నేత అన్నియూర్ శివ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సతీమణి కమలేష్ ఠాకూర్ గెలవగా.. హర్ దీప్ సింగ్ నలగఢ్‌లో ముందంజలో ఉన్నారు. హమీర్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి ఆశిష్ శర్మ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది.
డెహ్రాలో కమలేష్ ఠాకూర్ తన బీజేపీ అభ్యర్థి హోషియార్ సింగ్‌పై 9వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. హమీర్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి ఆశిష్ శర్మపై కాంగ్రెస్ అభ్యర్థి పుష్పిందర్ వర్మ 1,545 ఓట్ల ఆధిక్యంలో, కాంగ్రెస్ అభ్యర్థి హర్దీప్ సింగ్ బావా 4,137 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
నలగఢ్‌లో బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి హర్దీప్ సింగ్ 4,137 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక హమీర్‌పూర్‌లో కాంగ్రెస్ పుష్పిందర్పై 1,545 ఓట్ల స్వల్ప మెజారిటీతో ముందంజలో ఉన్నారు బీజేపీ ఆశిశ్ శర్మ.
బిహార్‌లోని రూపౌలి స్థానంలో బీజేపీ మిత్రపక్షం జనతాదళ్ (యునైటెడ్) ఆధిక్యంలో ఉంది.
మార్చ్‌లో జనతాదళ్ (యునైటెడ్)కు రాజీనామా చేసి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో చేరిన బీమా భారతి పార్లమెంట్ సీటు నుంచి లోక్ సభకు పోటీ చేశారు. అయితే ఆమె స్వతంత్ర అభ్యర్థి రాజేష్ రంజన్ చేతిలో ఓడిపోయారు.
బీజేపీకి ముఖ్య 'ఉప' సమరం..!
2019, 2014 ఎన్నికల్లో వరుసగా 303, 282 స్థానాల్లో విజయం సాధించి సొంతంగా మెజారిటీ సాధించింది బీజేపీ. కానీ 2024 ఎన్నికల్ల 240 స్థానాలు గెలుచుకుని, 272 మెజారిటీ మార్కుకు దిగువకు పడిపోవడం, ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే కూటమిలోని మిత్రపక్షాల మద్దతు అవసరం కావడంతో ఈ ఉప ఎన్నికలు బీజేపీకి ముఖ్యమైన పరీక్షగా భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, బీహార్లలో వరుసగా 16, 12 స్థానాలను గెలుచుకున్న ప్రధాన మిత్రపక్షాలైన నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ (టీడీపీ), నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) మద్దతుతో, ఇతర సంకీర్ణ భాగస్వామ్య పక్షాల మద్దతుతో ఎన్డీఏ మెజారిటీ మార్కును దాటిన విషయం తెలిసిందే.
సంబంధిత కథనం