Yusuf Pathan: యూసుఫ్ పఠాన్ పొలిటికల్ ఇన్నింగ్స్ - ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్న టీమిండియా మాజీ క్రికెటర్
Yusuf Pathan: టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందాడు. పశ్చిమ బెంగాళ్‌లోని బహరాంపూర్ నియోజక వర్గంనుంచి ఐదు సార్లు ఎంపీగా ఎన్నికైన కాంగ్రెస్ సీనియర్ లీడర్ అధీర్ రంజన్ చౌదరిపై యూసుఫ్ పఠాన్ 85 వేల ఓట్ల తేడాతో విజయం సాధించాడు.
Yusuf Pathan: టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ఎంపీగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. పొలిటికల్ లీడర్‌గా కొత్త ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టనున్నాడు. పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాళ్‌లోని బహరాంపూర్ నియోజక వర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన యూసుఫ్ పఠాన్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ అధీర్ రంజన్ చౌదరిపై 85 వేల ఓట్ల తేడాతో యూసుఫ్ పఠాన్ విజయాన్ని సాధించాడు.
ఐదు సార్లు ఎంపీ...
అధీర్ రంజన్ చౌదరి 1999 నుంచి బహరంపూర్ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తోన్నాడు. ఐదుసార్లు ఎంపీగా గెలుపొంది రికార్డును క్రియేట్ చేశాడు. 2019లో ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్‌లో తృణమూల్ ధాటికి కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ అయ్యింది. గత ఎన్నికల్లో కేవలం ఇద్దరే ఎంపీలు కాంగ్రెస్ పార్టీ తరఫున విజయాన్ని సాధించారు. అందులో అధీర్ రంజన్ చౌదరి ఒకరు. టీఎంసీ ఆధిపత్యాన్ని ఎదుర్కొంటూ కాంగ్రెస్ ఉనికిని ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చిన అధీర్ రంజన్ చౌదరిని యూసుఫ్ పఠాన్ చిత్తుగా ఓడించడం వెస్ట్ బెంగాల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
యూసుఫ్ పఠాన్‌కు వచ్చిన ఓట్లు ఎన్నంటే...
ఐదు సార్లు ఎంపీగా ప్రజలకు సేవ చేసిన అధీర్ రంజన్ చౌదరిని ఓడించి ఎంపీగా పార్లమెంట్‌లోకి యూసుఫ్ పఠాన్ అడుగుపెట్టబోతున్నాడు. ఈ ఎన్నికల్లో యూసుఫ్ పఠాన్‌కు 524516 ఓట్లు రాగా...అధీర్ రంజాన్ చౌదరికి 439494 ఓట్లు వచ్చాయి.
మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి నిర్మల్ కుమార్‌కు 371 వేల ఓట్లు వచ్చాయి. యూసుఫ్ పఠాన్ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. మమతా బెనర్జీ ఆహ్వానం మేరకు ఈ ఏడాదే ఆయన టీఎంసీ పార్టీలో చేరారు. అధీర్ రంజన్ చౌదరిపై యూసుఫ్ గెలుస్తాడని టీఎంసీ వర్గాలు కూడా అనుకోలేదు. ఈ రిజల్ట్ కాంగ్రెస్ తో పాటు టీఎంసీ పార్టీ వర్గాలకు షాకింగ్‌గా మారింది.
పార్టీ వర్కర్స్‌కు అంకితం...
బహరాంపూర్ ఎంపీగా విజయం సాధించడం పట్ల యూసుఫ్ పఠాన్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ విజయాన్ని బహరాంపూర్ ప్రజలతో పాటు పార్టీ వర్కర్స్‌కు అంకితం ఇచ్చాడు. బహరాంపూర్ అభివృద్ధికి పాటుపడతానని ట్విట్టర్ వేదికగా యూసుఫ్ పఠాన్ వెల్లడించాడు.
పాకిస్థాన్‌పై ఎంట్రీ...వీడ్కోలు...
2008లో మీర్పూర్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన యూసుఫ్ పఠాన్ అదే వేదికపై పాకిస్థాన్‌పైనే చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. టీమిండియా తరఫున 57 వన్డేలు ఆడిన యూసుఫ్ పఠాన్ 27 యావరేజ్‌తో 810 రన్స్ చేశాడు. వన్డేల్లో రెండు సెంచరీలతో పాటు మూడు హాఫ్ సెంచరీలు చేశాడు..
2010లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేల్లో 96 బాల్స్‌లో 123 పరుగులు చేసి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. బౌలింగ్‌లో సత్తా చాటిన యూసుఫ్ 33 వికెట్లు తీసుకున్నాడు. వన్డేల్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ దిగి అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన ప్లేయర్‌గా రికార్డ్ నెలకొల్పాడు.
టీ20ల్లో...
టీమిండియా తరఫున 22 టీ20 మ్యాచ్‌లు ఆడియన యూసుఫ్ పఠాన్ 236 రన్స్ చేయడంతో పాటు , 13 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు యూసుఫ్ పఠాన్ ప్రాతినిథ్యం వహించాడు.