Parliament news | పార్లమెంట్లో పాల పాకెట్లతో నిరసన
Parliament news | నిత్యావసర వస్తువులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. పార్లమెంటులోనూ ఆ ప్రకంపనలు కనిపిస్తున్నాయి. పాలు, పెరుగు, ఇతర ప్యాకేజ్డ్ ఆహార పదార్ధాలపై జీఎస్టీ విధించడాన్న నిరసిస్తూ పార్లమెంటు ఉభయసభల్లో విపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేసారు.
Parliament news | నిత్యావసర వస్తువులపై జీఎస్టీ(goods and service tax - GST) ని నిరసిస్తూ విపక్ష సభ్యులు ఉభయ సభల కార్యక్రమాలను అడ్డుకున్నారు. దాంతో, ఉభయసభలు మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి. తిరిగి, సభ ప్రారంభమైన తరువాత కూడా విపక్షాలు పట్టు విడవలేదు. జీఎస్టీపై పునరాలోచించాలని డిమాండ్ చేస్తూ సభను అడ్డుకున్నారు.
Parliament news | పాల ప్యాకెట్లతో..
నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపును నిరసిస్తూ విపక్ష సభ్యులు లోక్‌సభలోనికి పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లను తీసుకువచ్చారు. ఇటీవల, పాలు, పెరుగు ప్యాకెట్లు సహా ప్యాకేజ్డ్ ఆహార పదార్ధాల విక్రయాలపై 5% జీఎస్టీ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సభ వాయిదా పడిన అనంతరం విపక్ష సభ్యలు పార్లమెంటు ప్రాంగణంలోని మహాత్మగాంధీ విగ్రహం వద్ద నిరసన కొనసాగించారు. జీఎస్టీ పెంపుపై నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు కాంగ్రెస్ సభ్యుడు, లోక్‌సభలో విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు.
Parliament news | జీరో అవర్‌లో మాట్లాడుదాం..
లోక్‌సభలో నిరసన తెలుపుతున్న ఎంపీలను చర్చలో పాల్గొనాలని స్పీకర్ ఓం బిర్లా కోరారు. వారు నిరసన తెలుపుతున్న అంశాన్ని జీరో అవర్‌లో లేవనెత్తాలని సూచించారు. కానీ, స్పీకర్ విజ్ఞప్తిని విపక్ష సభ్యులు పట్టించుకోలేదు. రాజ్యసభలోనూ కీలకమైన Weapons of Mass Destruction and their Deliveries Systems (Amendment) Bill, 2022పై చర్చ జరగాల్సి ఉండగా, విపక్షాల నిరసనలతో చర్చ జరగలేదు. డెప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ పలుమార్లు చేసిన విజ్ఞప్తిని విపక్షాలు పట్టించుకోలేదు. సభ్యులు పాలప్యాకెట్లను సభలోనికి తీసుకురావడంపై రాజ్యసభ డెప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అవి చిరిగిపోతే, అంతా గందరగోళం అవుతుందన్నారు. మరోవైపు, సభలో జరుగుతున్న గందరగోళాన్ని ఫొటోలు, వీడియోలుగా తీస్తున్న కాంగ్రెస్ ఎంపీ రణ్‌దీప్ సూర్జేవాలాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా నిబంధనలకు అది వ్యతిరేకమని మండిపడ్డారు. నిరసనలు కొనసాగుతుండడం, సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో రాజ్యసభను గురువారానికి వాయిదా వేశారు.