Congress Damage: చెల్లెళ్లతో పంతం చేసిన చేటు.. పలు నియోజక వర్గాల్లో వైసీపీ ఓటమికి కారణమైన కాంగ్రెస్
Congress Damage: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో బోణీ కొట్టలేకపోయినా అధికార వైసీపీని మాత్రం ఘోరంగా దెబ్బతీసింది. పదికిపైగా స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల ఓటమి కాంగ్రెస్ కారణమైంది.
Congress Damage: వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పంతం కొద్ది ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన షర్మిలా రెడ్డి ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీల్లో ఖాతా తెరవలేక పోయినా అనుకున్నది మాత్రం సాధించారు. అన్న జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వల్ప మెజార్టీతో వైసీపీ ఓటమి పాలైన నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల వల్లే వైసీపీకి ఎక్కువ నష్టం వాటిల్లింది.
గత పదేళ్లలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఇంతగా ఓట్లను చీల్చలేదు. ఈసారి మాత్రం ఎన్నికల్లో జగన్ చెల్లెళ్లు కాలికి బలపం కట్టుకుని మరి ప్రచారం చేశారు. కడపలో వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించాలనే లక్ష్యంతో కష్టపడినా ఫలితం మాత్రం దక్కలేదు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజక వర్గాల ఫలితాల్లో వైసీపీకి దక్కే ఓట్లను కాంగ్రెస్ పార్టీ గణనీయంగా చీల్చింది. ఇక పార్లమెంటు స్థానాల్లో బీజేపీ కూటమిని సమర్ధించలేకపోయిన వర్గాలన్ని కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశాయి. ఇలా కూడా వైసీపీ తీవ్రంగా నష్టపోయింది.
మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల్లో బీజేపీపై వ్యతిరేకతతో ఉన్న ఓటర్లు కాంగ్రెస్ పార్టీని ప్రత్యామ్నయంగా భావించారు. దీంతో వైసీపీ సాంప్రదాయ ఓట్లకు భారీగా గండిపడింది. పార్లమెంటు స్థానాల్లో మెజార్టీ సీట్లను ఆ పార్టీ కోల్పోవడానికి ఇదే కారణమైంది.
రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తో వైసీపీకి నష్టం జరిగింది. దీంతో పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమికి కారణం అయింది. వైసీపీ ఓట్లకు కాంగ్రెస్ గండి కొట్టడంతో దీనివల్ల ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమి చెందింది.
కడప జిల్లాలో కాంగ్రెస్ కొంత ప్రభావం చూపింది. ఆ జిల్లాలో రెండు స్థానాల్లో వైసీపీ ఓటమికి కాంగ్రెస్ కారణం అయింది. కడప నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం అంజాద్ భాష ఓటమి చెందారు. ఆయనపై టీడీపీ అభ్యర్థి రెడ్డిగారి మాధవి 18,860 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆఫ్జల్ ఖాన్ కు 24,500 ఓట్లు వచ్చాయి. దీంతో డిప్యూటీ సీఎం అంజాద్ భాష ఓటమి చెందారు.
కడపలోని రాయచోటి నియోజకవర్గం నుండి వైసీపీ తరపున పోటీ చేసిన గడికోట శ్రీకాంత్ రెడ్డి ఓటమి చెందారు. ఆయనపై టీడీపీ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి 2,495 ఓట్లతో గెలుపొందారు. అక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన షేక్ అల్లాబక్ష్ కు 5,571 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఓట్లు చీల్చడమే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఓటమి కారణం అయింది.
ప్రకాశం జిల్లా గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కె.నాగార్జున రెడ్డి ఓటమి చెందారు. ఆయనపై టీడీపీ అభ్యర్థి కేవలం అశోక్‌రెడ్డి 973 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పెద్ద రంగస్వామికి 2,879 ఓట్లు వచ్చాయి. దీంతో వైసీపీ అభ్యర్థి ఓటమి చెందారు.
అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి ఓటమి చెందారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కె. సత్యకుమార్ గెలుపొందారు. వెంకట్రామి రెడ్డిపై కె.సత్యకుమార్ 3,734 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అశ్వర్థనారాయణకు 3,758 ఓట్లు వచ్చాయి. దీంతో వెంకట్రామి రెడ్డి స్వల్ప తేడాతో ఓటమి చెందారు.
రాష్ట్రంలో గుంతకల్లు, సత్యవేడు, మడకశిర, మదనపల్లె, నందికొట్కూర్ తదితర నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ సాధించిన ఓట్లు వైసీపీ ఓటమికి కారణమైంది.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)