Ambati Rayudu: కోహ్లి, ఆర్సీబీకి అంబటి రాయుడు మరో పంచ్.. అలా కాదు ఇలా గెలుస్తారంటూ..
Ambati Rayudu: అంబటి రాయుడు మరోసారి విరాట్ కోహ్లికి, ఆర్సీబీకి అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. ఐపీఎల్ 2024ను కోల్‌కతా నైట్ రైడర్స్ గెలిచిన తర్వాత రాయుడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Ambati Rayudu: ఐపీఎల్ ఎలా గెలుస్తారో చెబుతూ మరోసారి విరాట్ కోహ్లి, ఆర్సీబీకి పరోక్షంగా చురకలు అంటించాడు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. ఆదివారం (మే 26) కేకేఆర్ తమ మూడో ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత అతడు స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడాడు. ఐపీఎల్ గెలిపించేది ఆరెంజ్ క్యాప్‌లు కాదంటూ కోహ్లి, ఆర్సీబీకి రాయుడు పంచ్ ఇచ్చాడు.
ఐపీఎల్ ఇలా గెలవాలి
17 సీజన్లు ఐపీఎల్ ట్రోఫీ గెలవలేకపోయిన ఆర్సీబీకి ఈ మెగా లీగ్ ఎలా గెలవాలో చెప్పాడు అంబటి రాయుడు. "కేకేఆర్ జట్టుకు శుభాకాంక్షలు. ఆ టీమ్ నరైన్, రసెల్, స్టార్క్ లాంటి వాళ్లకు వెన్నంటి నిలిచి విజయాల్లో వాళ్ల పాత్ర పోషించేలా చేసింది. ఓ టీమ్ ఐపీఎల్ గెలిచేది ఇలాగే. ఎన్నో ఏళ్లుగా మనం చూస్తున్నది అదే. ఐపీఎల్ గెలిపించేది ఆరెంజ్ క్యాప్ కాదు. ఒక్కొక్కరు 300 వరకు పరుగులు చేయడంలాంటివే గెలిపిస్తాయి" అని రాయుడు అన్నాడు.
ఐపీఎల్ 2024లోనూ 741 రన్స్ తో విరాట్ కోహ్లియే ఆరెంజ్ క్యాప్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఈసారి కూడా ఆర్సీబీ ట్రోఫీ గెలవలేకపోయింది. ఎలిమినేటర్ లో ఆర్సీబీ ఓడిన సమయంలోనూ ఆ ఫ్రాంఛైజీపై రాయుడు తీవ్రంగా మండిపడ్డాడు. అతడు చేసిన ట్వీట్ వైరల్ అయింది.
"ఎన్నో ఏళ్లుగా ఆర్సీబీ జట్టుకు మద్దతుగా నిలిచిన అభిమానులను చూస్తే జాలేస్తోంది. వ్యక్తిగత మైలురాళ్లు కాకుండా టీమ్ ప్రయోజనాలను ఆ టీమ్ మేనేజ్‌మెంట్, లీడర్స్ పట్టించుకొని ఉంటే.. ఆర్సీబీ ఎన్నో టైటిల్స్ గెలిచేది. ఎంతో మంది అద్బుతమైన ప్లేయర్స్ ను ఆ టీమ్ వదిలేసింది. టీమ్ ప్రయోజనాలే ముఖ్యమని భావించే ప్లేయర్స్ ను తీసుకొచ్చేలా మీ మేనేజ్‌మెంట్ పై ఒత్తిడి తీసుకురండి. మెగా వేలం నుంచి ఓ కొత్త గొప్ప అధ్యాయం ప్రారంభమవుతుందేమో చూడాలి" అని రాయుడు ట్వీట్ చేశాడు.
ఆరెంజ్ క్యాప్ ఆర్సీబీకి.. ట్రోఫీ కేకేఆర్‌కు..
ఆర్సీబీ ట్రోఫీ గెలవకపోయినా ఈసారి కూడా ఆరెంజ్ క్యాప్ ఆ టీమ్ కే దక్కింది. ఆ టీమ్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 741 రన్స్ తో టాప్ లో నిలిచాడు. గతంలో 2016లోనూ విరాట్ ఆరెంజ్ క్యాప్ గెలిచిన విషయం తెలిసిందే. ఇలా రెండుసార్లు ఓ ఇండియన్ ఆరెంజ్ క్యాప్ గెలవడం ఇదే తొలిసారి. అయితే ఈ ఆరెంజ్ క్యాప్ పైనే ఇప్పుడు రాయుడు సెటైర్ వేశాడు.
అదే ట్రోఫీ గెలిచిన కేకేఆర్ టీమ్ లో మాత్రం నలుగురు ప్లేయర్స్ 350కిపైగా రన్స్ చేశారు. ఓపెనర్ సునీల్ నరైన్ 488 రన్స్ తో ఆ టీమ్ తరఫున టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఫిల్ సాల్ట్ 435, వెంకటేశ్ అయ్యర్ 370, శ్రేయస్ అయ్యర్ 354 రన్స్ చేశారు. బౌలింగ్ లో స్టార్క్, నరైన్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, రసెల్ సమష్టిగా రాణించారు. దీంతో కేకేఆర్ మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది.