తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Womens T20 World Cup 2024: భారత్ ఎక్కడ తప్పు చేసింది, సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టడానికి కారణాలివే!

Womens T20 World Cup 2024: భారత్ ఎక్కడ తప్పు చేసింది, సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టడానికి కారణాలివే!

Galeti Rajendra HT Telugu

15 October 2024, 8:00 IST

google News
  • India Women Cricket Team: టీ20 వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలో ప్రతి మ్యాచ్ కీలకం. ఒకవేళ ఏదైనా మ్యాచ్‌లో తప్పిదం చేస్తే.. తర్వాత మ్యాచ్‌లో దాన్ని దిద్దుకునేలా ఉండాలి. కానీ భారత్ జట్టు సీరియస్‌గా ఆ ప్రయత్నం చేయలేదు. 

భారత మహిళల జట్టు
భారత మహిళల జట్టు (AFP)

భారత మహిళల జట్టు

యూఏఈ వేదికగా జరుగుతున్న ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ -2024లో సెమీస్ ముంగిట భారత్ జట్టు పోరాటం ముగిసింది. టోర్నీలో నాలుగు మ్యాచ్‌లాడి రెండింటిలో మాత్రమే గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. సోమవారం పాకిస్థాన్ టీమ్ గెలిచి భారత్‌ను సెమీస్ చేరుస్తుందని ఆశించింది. కానీ దాయాది జట్టు న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడి భారత్‌ సెమీస్ ఆశలపై నీళ్లు చల్లింది. అసలు ఈ మెగా టోర్నీలో భారత్ ఉమెన్స్ టీమ్ చేసిన తప్పిదాలు ఏంటో ఒకసారి చూద్దాం .

ఫస్ట్ మ్యాచ్‌తోనే ఒత్తిడిలోకి

ఏ టోర్నీలోనైనా జట్లకి ఆరంభ మ్యాచ్ చాలా కీలకం. కానీ భారత్ జట్టు టీ20 వరల్డ్‌కప్ -2024‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతిలో 58 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. దెబ్బకి టోర్నీ పోటీపడుతున్న మిగిలిన 9 జట్ల కంటే వరస్ట్ నెట్ రన్‌రేట్‌‌తో భారత్ నిలిచింది.

ఇది ప్లేయర్లని మానసికంగా దెబ్బతీసింది. మిగిలిన మ్యాచ్‌ల్లో నామమాత్రంగా గెలిస్తే సరిపోదు.. భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 160 పరుగులు చేయగా.. భారత్ జట్టు 102 పరుగులకే ఆలౌటైంది.

అతి జాగ్రత్తతో మొదటికే మోసం

సెకండ్ మ్యాచ్‌‌ను పాకిస్థాన్‌తో ఆడిన భారత్ జట్టు బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకుంది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ టీమ్ కేవలం 105 పరుగులే చేయగా.. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ జట్టు ఛేదించడానికి ఏకంగా 18.5 ఓవర్లని తీసుకుంది. వాస్తవానికి పాకిస్థాన్‌పై భారత్‌కి టీ20ల్లో తిరుగులేని రికార్డ్ ఉంది.

కానీ.. చాలినన్ని వికెట్లు చేతిలో ఉన్నా అతి జాగ్రత్తకి పోయి నెట్‌ రన్‌రేట్‌ను మెరుగుపరుచుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. ఒకవేళ పాక్‌పై భారత్ జట్టు కాస్త దూకుడుగా ఆడి ఏ 9-10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఉంటే.. పాజిటివ్ రన్‌రేట్‌తో టీమ్‌పై ఒత్తిడి తగ్గేది. కానీ పాక్‌పై గెలిచినందుకు పాయింట్లు తప్ప.. నెట్ రన్‌రేట్ విషయంలో భారీగా భారత్‌కి ఒరిగింది ఏమీ లేదు.

బ్యాటర్లు ఓకే.. బౌలింగ్ తేడా కొట్టింది

శ్రీలంకతో జరిగిన మూడో మ్యాచ్‌లో మాత్రం భారత్ జట్టు బ్యాటింగ్‌లో అద్వితీయ ప్రదర్శన కనబర్చింది. కానీ బౌలింగ్‌లో మాత్రం నిరాశపరిచింది. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 172 పరుగులు చేసి.. శ్రీలంకని కేవలం 90 పరుగులే కట్టడింది.

కానీ.. శ్రీలంకను ఆలౌట్ చేయడానికి ఏకంగా 19.5 ఓవర్లని తీసుకుంది. అంటే ఒక్క బంతి మాత్రమే మిగిలింది. అయినప్పటికీ 82 పరుగుల తేడాతో భారత్ గెలవడంతో నెట్ రన్‌రేట్ మెరుగైంది. కానీ బౌలర్లు సమష్టిగా రాణిస్తూ క్రమం తప్పకుండా వికెట్లు తీయడంలో విఫలమయ్యారు.

మరీ ముఖ్యంగా 12 ఓవర్లకే 58/6తో నిలిచిన శ్రీలంక.. టాప్ ఆర్డర్ బ్యాటర్లందరినీ కోల్పోయింది. అయినప్పటికీ భారత్ బౌలర్ల బలహీనతని సొమ్ము చేసుకుంటూ లంక బ్యాటర్లు నెట్టుకుంటూ ఆఖరి వరకూ వచ్చారు. ఇది బౌలింగ్‌లో భారత్ బలహీనతని ఎత్తిచూపించింది.

కొంప ముంచి కెప్టెన్ తప్పిదం

ఆస్ట్రేలియాతో లీగ్ దశ ఆఖరి మ్యాచ్ ఆడిన భారత్ జట్టు గెలిచే అవకాశాన్ని కూడా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేలవ నిర్ణయాలతో చేజార్చుకుంది. మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 151 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో భారత్ జట్టు 142/9కే పరిమితమైంది. 
 

ఆఖరి ఓవర్‌లో భారత్ జట్టు విజయానికి 14 పరుగులు అవసరం అవగా.. క్రీజులో ఉన్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కి ఆరు బంతులూ ఆడే అవకాశం ఉన్నా మొదటి బంతికే సింపుల్‌గా సింగిల్ తీసుకుని నాన్‌స్ట్రైక్ ఎండ్‌ వైపు వెళ్లిపోయింది. అప్పటికే ఒత్తిడిని ఎదుర్కొంటూ 45 బంతుల్లో 52 పరుగులు చేసిన హర్మన్‌ అలా చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

లాస్ట్ ఓవర్‌లో ఒత్తిడిని తట్టుకోలేక వరుసగా పూజా వస్త్రాకర్, అరుంధరి రెడ్డి, శ్రేయాస్ పాటిల్ ఔటైపోయారు. ఒకవేళ హర్మన్‌ లాస్ట్ ఓవర్ మొత్తం స్ట్రైక్‌లో ఉండి హిట్టింగ్ చేసి ఉంటే భారత్ గెలిచే అవకాశాలు ఉండేవి. ఆస్ట్రేలియాపై తిరుగులేని రికార్డ్ ఉన్న హర్మన్‌ప్రీత్.. భారీ సిక్సర్లను కూడా కొట్టగలదు. కానీ.. ఆమె ఫినిషర్ రోల్‌ను తీసుకోవడానికి లాస్ట్ మ్యాచ్‌లో ఇష్టపడలేదు.

పాక్‌పై బ్యాటింగ్‌లో, శ్రీలంకపై బౌలింగ్‌లో, ఆస్ట్రేలియాపై ఆఖరి ఓవర్‌లో ఉదాసీనంగా వ్యవహరించి భారత్ ఉమెన్స్ టీమ్ మూల్యం చెల్లించుకుంది.  చివరిగా ఆడిన మూడు టీ20 వరల్డ్‌కప్స్‌లో రెండు సార్లు సెమీస్, ఒకసారి ఫైనల్‌కి కూడా చేరిన భారత్ జట్టు.. ఈ సారి కనీసం సెమీస్ గడప కూడా తొక్కకపోవడం నిరాశ కలిగించే విషయమే. 

తదుపరి వ్యాసం