Womens T20 World Cup 2024 Points Table: రసవత్తరంగా సెమీస్ రేస్, భారత్ జట్టు పరిస్థితి ఏంటంటే?
Indian Women's Team Semis Qualification Scenario: ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌ను పరాజయంతో ఆరంభించిన భారత్ జట్టు ఆ తర్వాత వరుసగా పాకిస్థాన్, శ్రీలంకపై గెలిచినా సెమీస్ బెర్తు సందేహంగానే ఉంది. లీగ్ చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాని ఓడించినా మిగిలిన జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది.
యూఏఈ వేదికగా జరుగుతున్న ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ -2024 మరింత ఆసక్తికరంగా మారిపోయింది. లీగ్ దశ మ్యాచ్‌లు ఆఖరి దశకి చేరుకుంటుండగా.. సెమీస్ చేరే జట్లపై ఉత్కంఠ పెరుగుతోంది. టోర్నీలో మొత్తం 10 జట్లు పోటీపడుతుండగా ప్రతి జట్టూ లీగ్ దశలో నాలుగేసి మ్యాచ్‌లు ఆడతాయి. అయితే ఇప్పటికే చాలా జట్లు మూడు మ్యాచ్‌లు ఆడేసినా ఇంకా సెమీస్ చేరే జట్లపై క్లారిటీ రావడం లేదు.
గ్రూప్-ఎలో భారత్..
గ్రూప్-ఎలో ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు పోటీపడుతున్నాయి. ఇందులో రెండు మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా(4 పాయింట్లు) రెండింటిలోనూ గెలిచి పట్టికలో టాప్‌లో ఉంది. ఆ తర్వాత భారత్ జట్టు (4 పాయింట్లు)మూడు మ్యాచ్‌లాడి.. రెండు విజయాలతో రెండో స్థానంలో ఉంది.
పాకిస్థాన్ టీమ్ రెండు మ్యాచ్‌లు ఒక విజయంతో 2 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ టీమ్ (2 పాయింట్లు) రెండు మ్యాచ్‌లాడి ఒక విజయంతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఆఖరిగా శ్రీలంక టీమ్ (0) మూడు మ్యాచ్‌లాడి.. మూడింటిలోనూ ఓడిపోయిన ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.
గ్రూప్-బిలో మూడు జట్లు 4 పాయింట్లతో
గ్రూప్-బిలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు పోటీపడుతున్నాయి. ఇందులో ఇప్పటికే మూడేసి మ్యాచ్‌లు ఆడేసిన వెస్టిండీస్ (4 పాయింట్లు), దక్షిణాఫ్రికా (4 పాయింట్లు).. రెండేసి విజయాలతో పట్టికలో టాప్-2లో కొనసాగుతున్నాయి.
మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ టీమ్ (4 పాయింట్లు) ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా.. నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండటంతో మూడో స్థానంతో సరిపెడుతోంది. ఇక మిగిలిన బంగ్లాదేశ్ టీమ్ (2 పాయింట్లు) మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓడిపోయి నాలుగో స్థానంలో ఉండగా.. స్కాంట్లాండ్ (0) ఆడిన మూడింటిలోనూ ఓడిపోయి సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.
భారత్ పరిస్థితి ఏంటి?
గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగిసే సమయానికి రెండు గ్రూప్‌ల పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్‌కి అర్హత సాధిస్తాయి. భారత్ జట్టు సెమీస్ చేరాలంటే ఆస్ట్రేలియాతో అక్టోబరు 18న జరగనున్న మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది. అది కూడా మెరుగైన రన్‌రేట్‌తో గెలిస్తే.. సెమీస్ రేసులో ఉంది.
ఆస్ట్రేలియాపై గెలిచి సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ సెమీస్ చేరాలంటే మాత్రం న్యూజిలాండ్ తన చివరి రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక లేదా పాకిస్థాన్ చేతిలో ఓడిపోవాలి. అలానే పాకిస్థాన్ కూడా ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్ చేతిలో ఓడిపోతే భారత్ సెమీస్‌కి మార్గం సుగుమం అవుతుంది.
భారత్ జట్టు ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడేయగా.. పాకిస్థాన్, న్యూజిలాండ్ రెండేసి మ్యాచ్‌లు మాత్రమే ఆడాయి. కాబట్టి.. ఈ రెండు జట్లూ కనీసం ఒక్క మ్యాచ్‌లో ఓడినా భారత్ జట్టు సెమీస్‌కి లైన్ క్లియర్ అవుతుంది.