New Zealand Test Squad: భారత్‌తో టెస్టు సిరీస్‌కి న్యూజిలాండ్ టీమ్ ప్రకటన, ఫస్ట్ మ్యాచ్‌కి కేన్ దూరం-new zealand announce 15 member test squad for india tour 2024 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  New Zealand Test Squad: భారత్‌తో టెస్టు సిరీస్‌కి న్యూజిలాండ్ టీమ్ ప్రకటన, ఫస్ట్ మ్యాచ్‌కి కేన్ దూరం

New Zealand Test Squad: భారత్‌తో టెస్టు సిరీస్‌కి న్యూజిలాండ్ టీమ్ ప్రకటన, ఫస్ట్ మ్యాచ్‌కి కేన్ దూరం

Galeti Rajendra HT Telugu

India vs New Zealand Test Series 2024: భారత్, న్యూజిలాండ్ మధ్య ఈ నెలలోనే మూడు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. తొలి టెస్టుకి బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనుండగా.. ఆ మ్యాచ్‌కి కేన్ దూరంగా ఉండనున్నాడు.

న్యూజిలాండ్ టెస్టు జట్టు (icc photo)

భారత్‌తో టెస్టు సిరీస్ కోసం న్యూజిలాండ్ బుధవారం (అక్టోబరు 9)న 15 మందితో కూడిన జట్టుని ప్రకటించింది. అయితే.. ఆ జట్టులో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ పేరు కనిపించలేదు. మొత్తం మూడు టెస్టుల సిరీస్‌ని భారత్ గడ్డపై న్యూజిలాండ్ ఆడనుంది.

టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్ జట్టుతో బెంగళూరు వేదికగా అక్టోబరు 16 నుంచి తొలి టెస్టు ఆడనున్న న్యూజిలాండ్ టీమ్.. ఆ తర్వాత అక్టోబరు 24 నుంచి పుణెలో, నవంబరు 1 నుంచి ముంబయిలో ఆఖరి టెస్టుని ఆడనుంది.

రెస్ట్‌లో భారత్ టెస్టు జట్టు

ఇటీవల బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ని 2-0తో కైవసం చేసుకున్న భారత్ టెస్టు జట్టులోనిఆటగాళ్లు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోనే టీ20 జట్టు.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈరోజు ఢిల్లీ వేదికగా రెండో టీ20 జరగనుంది.

భారత్‌తో టెస్టు సిరీస్‌కు కెేన్ విలియమ్సన్ దూరమవడం న్యూజిలాండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. ఐపీఎల్‌లో ఆడిన కేన్‌కి భారత్ పిచ్‌లపై మంచి అవగాహన, రికార్డులు కూడా ఉన్నాయి.

తొలి టెస్టుకి కేన్ దూరం

ప్రస్తుతానికి బెంగళూరులో జరిగే తొలి టెస్టుకు మాత్రమే మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అందుబాటులో ఉండడు అని న్యూజిలాండ్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. అతను గత కొన్ని రోజుల నుంచి గజ్జల్లో గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. తొలి టెస్టు తర్వాత భారత్‌కి కేన్ వచ్చే అవకాశం ఉందని.. కూడా న్యూజిలాండ్ చెప్పుకొచ్చింది.

ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో గాయం కారణంగా కేన్ విలియమ్సన్ ఇబ్బంది పడ్డాడు. దాంతో ముందు జాగ్రత్తల్లో భాగంగా తొలి టెస్టు నుంచి అతడ్ని తప్పించి విశ్రాంతినిచ్చారు.

సిరీస్‌లో కేన్ విలియమ్సన్ ఆడతాడని న్యూజిలాండ్ జట్టు సెలెక్టర్ సామ్ వెల్స్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘కేన్ గాయం తీవ్రత పెంచడం కంటే విశ్రాంతి ఇవ్వడం మంచిది అనుకున్నాం. ఫిట్‌నెస్ సాధించి కేన్ విలియమ్సన్ తప్పకుండా భారత్‌తో సిరీస్ ఆడతాడు. తొలి టెస్టుకి అతను అందుబాటులో లేకపోవడం నిరాశ కలిగిస్తోంది’’ అని సామ్ వెల్స్ చెప్పకొచ్చాడు.

న్యూజిలాండ్ టెస్టు జట్టు

టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్ వెల్ (మొదటి టెస్టుకి మాత్రమే), మార్క్ చాప్మన్, దేవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, డార్లీ మిచెల్, విల్ ఓ రూర్కే, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, బెన్ సియర్స్, ఇస్ సోధి (రెండు, మూడో టెస్టులకి మాత్రమే), టిమ్ సౌథీ, కేన్ విలియమ్సన్ (మొదటి టెస్టుకి అందుబాటులో లేడు), విల్ యంగ్

యంగ్ గన్‌ని దింపుతున్న కివీస్

న్యూజిలాండ్ వైట్ బాల్ క్రికెట్‌లో సత్తాచాటుతున్న మార్క్ చాప్మన్‌కి ఈ జట్టులో న్యూజిలాండ్ చోటిచ్చింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆరు సెంచరీలతో పాటు 41.9 సగటును అతను సత్తాచాటాడు.

2020లో భారత్-ఎ జట్టుపై కూడా మార్క్ చాప్మన్‌ సెంచరీ సాధించాడు. బ్యాటర్‌గానే కాదు.. స్పిన్ బౌలింగ్‌ను కూడా అతను చేయగలడు. మైఖేల్ బ్రేస్ వెల్ భార్య త్వరలోనే ప్రసవించబోతుండటంతో.. మొదటి టెస్టు ఆడేసి అతను న్యూజిలాండ్‌కి వెళ్లిపోతాడు. దాంతో అతని స్థానంలో ఇష్ సోధీని సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఆడించనున్నారు.