IND vs PAK Hockey: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్ - కెప్టెన్ హర్మన్ ప్రీత్ అరుదైన రికార్డ్
IND vs PAK Hockey: ఆసియా ఛాంపియన్స్ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత జట్టు 2-1 తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ రెండు గోల్స్‌తో భారత్‌కు అసమాన విజయాన్ని అందించాడు.
IND vs PAK Hockey: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ హాకీ జట్టు అపజయమే లేకుండా దూసుకుపోతుంది. శనివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 2-1 తేడాతో ఓడించిన భారత జట్టు వరుసగా ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నది. ఈ టోర్నీలో పదిహేను పాయింట్లతో భారత జట్టు టాప్ ప్లేస్‌లో నిలిచింది.
ఎనిమిదో నిమిషంలో గోల్...
చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆరంభంలో పాకిస్థాన్ ఆధిపత్యం కనబరిచింది. ఎనిమిదో నిమిషంలో అహ్మద్ నదీమ్ గోల్‌తో పాకిస్థాన్ బోణీ చేసింది. హన్నన్ షాహిద్ ఇచ్చిన పాస్‌ను అహ్మద్ నదీమ్ గోల్‌గా మలిచాడు. పాకిస్థాన్ గోల్ ఆనందం ఎక్కుసేపు నిలవలేదు.
డబుల్ గోల్...
13వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ గోల్‌గా మలిచి స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత 19వ నిమిషంలో లభించిన మరో పెనాల్టీ కార్నర్ గోల్ పోస్ట్‌లోకి పంపించిన హర్మన్ ప్రీత్ భారత్‌కు 2-1లో ఆధిక్యాన్ని సంపాదించిపెట్టాడు. ఆట చివరి నిమిషంలో మరో పెనాల్టీ కార్నర్ లభించిన హర్మన్ గోల్ చేయలేకపోయాడు.
ఎల్లో కార్డ్...
స్కోరును సమం చేసేందుకు పాకిస్థాన్ చివరి వరకు ప్రయత్నించింది.రెండు పెనాల్టీ కార్నర్‌లు వచ్చిన గోల్స్ చేయలేకపోయింది. కానీ పాక్ ఆటగాళ్ల ప్రయత్నాలను గోల్ కీపర్ క్రిషన్ పాఠక్ అద్భుతంగా తిప్పికొట్టాడు. ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు పలుమార్లు భారత ప్లేయర్లతో దురుసుగా ప్రవర్తించారు.
మ్యాచ్ చివరి పది నిమిషాలు ఉత్కంఠభరితంగా సాగింది. ఇరు జట్ల ఆటగాళ్లు సహనం కోల్పోయి కోపంగా కనిపించారు. 50వనిమిషంలో పాకిస్థాన్ ప్లేయర్ అష్రఫ్ రానా ఇండియన్ ఆటగాడు జుగర్‌రాజ్‌ను ఉద్దేశపూర్వకంగా తోసేశాడు. వీడియో రివ్యూలో పాకిస్థాన్ ప్లేయర్ తప్పిదం బయటపడటంతో అంపైర్ అతడిని ఎల్లో కార్డ్ ఇచ్చాడు. దాంతో చివరి పది నిమిషాలు పాకిస్థాన్ పదిమందితోనే ఆడాల్సివచ్చింది.
ఈ మ్యాచ్‌లో అష్రఫ్ రానాతో పాటు మరో పాక్ ప్లేయర్ సఫ్యాన్ ఎల్లో కార్డ్‌కు గురవ్వడంతో ఐదు నిమిషాల పాటు మైదానాన్ని వదిలిపెట్టాడు. ఇండియా నుంచి మన్‌ప్రీత్ సింగ్ ఎల్లో కార్డ్‌కు గురయ్యాడు.
హర్మర్ రేర్ రికార్డ్...
ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. ఇంటర్నేషనల్ కెరీర్‌లో 200 గోల్స్ పూర్తిచేసుకున్నాడు. ధ్యాన్ సింగ్, బల్బీర్ సింగ్ తర్వాత భారత్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన మూడో ప్లేయర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. హర్మర్ ప్రీత్ మొత్తం 201 గోల్స్ చేశాడు.
సెమీస్‌లో పాక్...
కాగా భారత్ చేతిలో ఓటమి పాలైన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ సెమీస్ చేరింది. ఇప్పటివరకు ఐదు మ్యాచులు ఆడిన పాకిస్థాన్ రెండు విజయాలు, రెండు టైలతో పాటు ఓ ఓటమితో ఎనిమిది పాయింట్లు సాధించింది. పాయింట్స్ టేబుల్‌లో భారత్ తర్వాత సెకండ్ ప్లేస్‌లో నిలిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నది. కాగా హాకీలో ఇండియాపై పాకిస్థాన్ గెలిచి ఎనిమిదేళ్లు దాటిపోయింది. చివరగా 2016లో ఇండియాను పాకిస్థాన్ ఓడించింది.
టాపిక్