Harmanpreet Kaur: భారత్ జట్టుకి శాపంగా మారిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తప్పిదం, లాస్ట్ ఓవర్‌లో ట్విస్ట్‌లు-india captain harmanpreet kaur bizarre final over act leaves fans baffled in ind vs aus match ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Harmanpreet Kaur: భారత్ జట్టుకి శాపంగా మారిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తప్పిదం, లాస్ట్ ఓవర్‌లో ట్విస్ట్‌లు

Harmanpreet Kaur: భారత్ జట్టుకి శాపంగా మారిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తప్పిదం, లాస్ట్ ఓవర్‌లో ట్విస్ట్‌లు

Galeti Rajendra HT Telugu
Oct 14, 2024 12:48 PM IST

ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ -2024లో ఆస్ట్రేలియాపై భారత్ జట్టు గెలిచే అవకాశం లభించినా.. హర్మన్‌ప్రీత్ కౌర్ ఉదాసీనతతో చేజార్చింది. దాంతో భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారిపోయాయి.

హర్మన్‌ప్రీత్ కౌర్
హర్మన్‌ప్రీత్ కౌర్ (AP)

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ -2024లో సెమీస్‌కి చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చేసిన తప్పిదం టీమ్‌కి శాపంగా మారింది. ఆస్ట్రేలియాతో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో భారత్ ముందు 152 టార్గెట్ నిలిచింది.

దీప్తి ఔట్‌తో మ్యాచ్ టర్న్

ఛేదనలో భారత్ జట్టుకి శుభారంభం లభించకపోయినా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 47 బంతుల్లో 6 ఫోర్లు కొట్టి అజేయంగా 54 పరుగులు చేసింది. కానీ.. చివర్లో ఆమె ఉదాసీనతతో భారత్ జట్టుకి 9 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. ఛేదనలో హర్మన్‌ప్రీత్ కౌర్‌కి దీప్తి శర్మ 25 బంతుల్లో 29 పరుగులు చేసి మంచి సహకారం అందించింది. కానీ.. ఇన్నింగ్స్ 16 ఓవర్‌లో దీప్తి ఔట్ అయిపోవడంతో అక్కడి నుంచి నెమ్మదిగా భారత్‌కి మ్యాచ్ చేజారుతూ వచ్చింది.

ఛేదనలో 17 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి చివరి మూడు ఓవర్లలో 40 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో పూజా వస్త్రాకర్, హర్మన్‌ప్రీత్ కౌర్ జోడి దూకుడుగా ఆడి 18వ ఓవర్‌లో 12 పరుగులు, 19వ ఓవర్‌లో 14 పరుగులు రాబట్టి భారత జట్టును విజయానికి చేరువ చేసింది.

ఆఖరి ఓవర్‌లో బాధ్యత తీసుకోని హర్మన్

కానీ.. ఆఖరి ఓవర్‌లో బాధ్యత తీసుకోవాల్సిన హర్మన్‌ప్రీత్ కౌర్.. తెలివి తక్కువగా ఆలోచించి భారత్ జట్టు ఓటమికి కారణమైందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. భారత్ విజయానికి 6 బంతుల్లో 14 పరుగులు కావాలి.. అప్పటికే హాఫ్ సెంచరీతో మంచి టచ్‌లో ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ తొలి బంతికి కేవలం సింగిల్ తీసుకుని నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత రెండో బంతికి పూజా వస్త్రాకర్ ఔటైపోగా.. క్రీజులోకి వచ్చిన అరుధంతి రెడ్డి మూడో బంతికి పరుగు తీస్తూ రనౌటైంది.

దాంతో ఆఖరి 3 బంతుల్లో భారత్ విజయానికి 13 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో స్ట్రైకింగ్‌‌కి వచ్చిన హర్మన్‌ప్రీత్ చివరి మూడు బంతుల్లో భారీ షాట్లు ఆడి భారత్‌ని గెలిపిస్తుందని అభిమానులు ఆశించారు. కానీ.. ఆశ్చర్యకరంగా నాలుగో బంతికి సింగిల్ తీసుకున్న హర్మన్.. అప్పుడే క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ పాటిల్‌కి స్ట్రైక్ ఇచ్చింది. కానీ.. తర్వాత రెండు బంతుల్లో వరుసగా శ్రేయాస్, రాధ యాదవ్ ఔటైపోవడంతో భారత్‌కి ఓటమి ఖాయమైంది. మ్యాచ్‌లో గెలిచిన ఆస్ట్రేలియా దర్జాగా సెమీస్‌కి చేరిపోయింది.

పాక్ గెలుపుపైనే భారత్ ఆశలు

సాధారణంగా ఆఖరి ఓవర్‌లో అప్పటికే క్రీజులో సెటిలైన బ్యాటర్ ఎక్కువగా స్ట్రైక్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. మరీ ముఖ్యంగా.. టీ20 వరల్డ్‌కప్ లాంటి టోర్నీల్లో. హర్మన్‌ప్రీత్ కౌర్ ప్లేస్‌లో ఏ బ్యాటర్ ఉన్నా ఇదే పని చేస్తారు. కానీ.. ఎందుకో హర్మన్‌ప్రీత్ కౌర్ బాధ్యత తీసుకోవడానికి వెనుకాడినట్లు కనిపిస్తోంది. బౌండరీలు కొట్టాల్సిన వేళ ఉదాసీనతతో సింగిల్స్ తీసి భారత్ ఓటమికి కారణమైంది. ఇప్పుడు భారత్ జట్టు సెమీస్ ఆశలు నిలవాలంటే సోమవారం న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ గెలవాల్సి ఉంది.

Whats_app_banner