PAK vs ENG Test Highlights: ఇంగ్లాండ్‌పై ఆరుగురు పాక్ బౌలర్లు సెంచరీలు.. 20 ఏళ్ల రికార్డ్ బ్రేక్!
Pakistan vs England 1st Test Highlights: పాకిస్థాన్ టీమ్ తమ సొంతగడ్డపై ఇంగ్లాండ్ టీమ్‌ను బెదరగొట్టాలని ఆశించి ముల్తాన్ స్టేడియంలో బ్యాటింగ్ పిచ్ సిద్ధం చేసుకుంది. కానీ.. ప్లాన్ బెడిసికొట్టి ఇంగ్లాండ్ బ్యాటర్ల దెబ్బకి బలైపోయింది. ఇప్పుడు ఓటమి అంచున పాక్ ఉంది.
పాకిస్థాన్ జట్టుకి దాని సొంతగడ్డపైనే ఇంగ్లాండ్ బ్యాటర్లు రెండు రోజులు చుక్కలు చూపించేశారు. బ్యాటింగ్‌కి స్వర్గధామంగా నిలిచిన ముల్తాన్ టెస్టులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ టీమ్ 556 పరుగులు చేయగా.. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాండ్ టీమ్ ఏకంగా 823 పరుగులు చేసింది. దెబ్బకి పాకిస్థాన్ బౌలర్లు సొంతగడ్డపైనే బెంబేలెత్తిపోయారు. మ్యాచ్‌లో ఇక ఒక్క రోజు (శుక్రవారం) ఆట మాత్రమే మిగిలి ఉండగా.. ఇంగ్లాండ్ టీమ్ గెలుపు ముంగిట ఉంది.
ఒకరు డబుల్, మరొకరు ట్రిఫుల్ సెంచరీ
పాకిస్థాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ షఫీక్ (102), కెప్టెన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలు నమోదు చేయగా.. ఇంగ్లాండ్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్ (262) డబుల్ సెంచరీ, హారీ బ్రూక్ (317) ట్రిపుల్ సెంచరీ బాదేశారు. ఈ జోడిని నిలువరించేందుకు పాకిస్థాన్ టీమ్ కెప్టెన్ మసూద్ చేయని ప్రయత్నం లేదు.
నాలుగో వికెట్‌కి ఈ జంట ఏకంగా 454 పరుగుల రికార్డ్ భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ జోడీని విడదీసేందుకు మొత్తం ఆరుగురు బౌలర్లని పాక్ కెప్టెన్ ప్రయోగించగా.. ఇందులో ఆరుగురు 100కిపైగా పరుగులు సమర్పించుకుని తేలిపోయారు. ఆ మిగిలిన ఒక్క బౌలర్ షకీల్ కేవలం 2 ఓవర్లు వేసి 14 పరుగులు సమర్పించుకుని.. ఆ తర్వాత బౌలింగ్ చేసేందుకు భయపడ్డాడు.
20 ఏళ్ల క్రితం చెత్త రికార్డ్
2004లో జింబాబ్వే, శ్రీలంక జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో జింబాబ్వేకు చెందిన ఆరుగురు బౌలర్లు 100కు పైగా పరుగులు సమర్పించుకున్నారు. ఆ మ్యాచ్‌లో కూడా జింబాబ్వే కెప్టెన్ ఏడుగురు బౌలర్లను ప్రయోగించాడు. ఆ తర్వాత ఈ 20 ఏళ్లలో ఏ టీమ్ కూడా ఈ చెత్త రికార్డ్ దరిచేరలేదు.
కానీ.. తాజాగా పాకిస్థాన్ ఆ రికార్డ్ బుక్‌లోకి చేరిపోయింది. అది కూడా జింబాబ్వే కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకుని చెత్త రికార్డ్‌లో టాప్‌లో నిలిచింది. అనిశ్చితి మారుపేరైన పాకిస్థాన్ మరోసారి క్రికెట్ ప్రపంచంలో నవ్వులపాలైంది.
పాక్ కథ ముగిసినట్లే
తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగుల ఆధిక్యం ఇంగ్లాండ్ టీమ్‌కి లభించగా.. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న పాకిస్థాన్ టీమ్ గురువారం ఆట ముగిసే సమయానికి 152/6తో ఓటమి ముంగిట నిలిచింది.
పాకిస్థాన్ ఇంకా 115 పరుగులు వెనకబడి ఉండగా.. చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. దాంతో శుక్రవారం ఎంత త్వరగా ఇంగ్లాండ్ టీమ్ మ్యాచ్‌ని ముగిస్తుందో చూడాలి. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లోనూ పాకిస్థాన్ టీమ్ వైట్‌వాష్‌కి గురైన విషయం తెలిసిందే.