ENG vs SL 2nd Test: లార్డ్స్‌లో చేతులెత్తేసిన శ్రీలంక బ్యాటర్లు.. ఇంగ్లాండ్ టీమ్‌కి భారీ ఆధిక్యం
England Vs Sri Lanka 2nd Test: ఇంగ్లాండ్ చేతిలో తొలి టెస్టులో ఓడిన శ్రీలంక టీమ్ రెండో టెస్టులోనూ రెండో రోజే చేతులెత్తేసింది. దాంతో భారీ ఆధిక్యాన్ని అందుకున్న ఇంగ్లాండ్ టీమ్ రెండో ఇన్నింగ్స్‌లో స్వేచ్ఛగా చెలరేగిపోయే అవకాశం ఉంది.
ఇంగ్లాండ్ పర్యటనలో శ్రీలంక పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓడిన పర్యాటక జట్టు.. లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ ఇంగ్లాండ్‌కి భారీ ఆధిక్యాన్ని సమర్పించుకుంది.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ టీమ్ ఒక వికెట్ కోల్పోయి 25 పరుగులతో ఉంది. క్రీజులో ఓపెనర్ బెన్ డకెట్ (15 బ్యాటింగ్: 24 బంతుల్లో 2x4), ఓలీ పోప్ (2 బ్యాటింగ్: 6 బంతుల్లో) ఉన్నారు. ఓపెనర్ డేనియల్ లారెన్స్ 7 పరుగుల వద్ద వికెట్ చేజార్చుకున్నాడు.
మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 427 పరుగులు చేసింది. ఆ జట్టులో జో రూట్ (143: 206 బంతుల్లో 18x4) సెంచరీ నమోదు చేశాడు. అతనితో పాటు లోయర్ ఆర్డర్ బ్యాటర్ గస్ అట్కిస్సన్ (118: 115 బంతుల్లో 14x4, 4x6) విధ్వంసకరరీతిలో శతకం బాదేశాడు. దాంతో ఇంగ్లాండ్ టీమ్ మెరుగైన స్కోరుని బోర్డుపై ఉంచగలిగింది. శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో 5 వికెట్లు, మిలాన్ రత్నయాక్, లాహిరు కుమార చెరో రెండు, ప్రభాత్ జయసూర్య ఒక వికెట్ పడగొట్టారు.
మెండిస్ ఒంటరి పోరు
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీమ్ అనూహ్యరీతిలో వరుసగా వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్లు నిషాన్ మదుశంక (7), కరుణరత్నె (7) సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరిపోయారు. ఆ తర్వాత వచ్చిన మాథ్యూస్ (22), చండిమాల్ (23), ధనంజయ డిసిల్వా (0) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోవడంతో శ్రీలంక 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఆత్మరక్షణలో పడిపోయింది. ఈ దశలో కామిండు మెండిస్ (74: 120 బంతుల్లో 8x4, 3x6) అసాధారణ పోరాట పటిమను కనబర్చాడు.
ఒక ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నా.. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుడాడి చేస్తూ స్కోరు బోర్డుని నడిపించాడు. లోయర్ ఆర్డర్‌లో అతనికి ప్రభాత్ జయసూర్య (8: 46 బంతుల్లో) కాస్త సపోర్ట్ లభించింది. ఓవరాల్‌గా 55.3 ఓవర్లను మాత్రమే ఎదుర్కొన్న శ్రీలంక టీమ్ 196 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైపోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, గస్ ఆట్కిసన్, ఓలీ స్టోన్, మాథ్యూ పోట్స్ తలో రెండ వికెట్లు పడగొట్టగా.. షోయబ్ బషీర్ ఒక వికెట్ తీశాడు.
ఇంగ్లాండ్‌కి భారీ ఆధిక్యం
లార్డ్స్‌లో 231 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ టీమ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 256 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
మ్యాచ్‌లో ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉండటంతో ఈరోజు మూడు సెషన్ల పాటు ఇంగ్లాండ్ టీమ్ బ్యాటింగ్ కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. అదే జరిగితే శ్రీలంక టీమ్ ముందు 500 పరుగులపైనే టార్గెట్‌ను ఇంగ్లాండ్ నిర్దేశించే అవకాశం ఉంది.
ఇటీవల ముగిసిన తొలి టెస్టులో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ టీమ్ సునాయస విజయం సాధించిన విషయం తెలిసిందే. దాంతో మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఇంగ్లాండ్ ఉంది.