SL vs AUS: టీ20ల్లో శ్రీలంక టీమ్ వరల్డ్ రికార్డ్.. వీడియో
టీ20ల్లో శ్రీలంక టీమ్ సరికొత్త వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఆ టీమ్ కెప్టెన్ శనక.. ఈ రికార్డులో కీలకపాత్ర పోషించాడు.
పల్లెకెలె: కొన్నేళ్లుగా శ్రీలంక క్రికెట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూస్తూనే ఉన్నాం. బయట కాదు కదా సొంతగడ్డపై కూడా మ్యాచ్‌లు గెలవడానికి కిందామీదా పడుతోంది. సంగక్కర, జయవర్దనె, మలింగలాంటి స్టార్ ఆటగాళ్లు రిటైరైన తర్వాత శ్రీలంక టీమ్ ప్రదర్శన క్రమంగా దిగజారుతూ వస్తోంది. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను కూడా ఆ టీమ్ కోల్పోయింది.
అయితే చివరిదైన మూడో టీ20లో మాత్రం ఆస్ట్రేలియా టీమ్‌కు షాకివ్వడమే కాదు.. ఏకంగా వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ డాసన్ శనక చెలరేగిపోయాడు. మ్యాచ్‌లో ఓటమి ఖాయం అనుకున్న సమయంలో అతడు సృష్టించిన విధ్వంసం అంతాఇంతా కాదు. దీంతో లంక చివరి 3 ఓవర్లలో ఏకంగా 59 రన్స్ చేసి మ్యాచ్ గెలవడం విశేషం.
ఇప్పటి వరకూ టీ20 ఫార్మాట్‌లో ఏ ఇతర టీమ్ కూడా చివరి 3 ఓవర్లలో ఇన్ని రన్స్ చేసి గెలవలేదు. కెప్టెన్ శనక 25 బాల్స్‌లోనే 54 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. 18వ ఓవర్లో మొదలైన అతని విధ్వంసం.. చివరి ఓవర్ వరకూ సాగింది. 18వ ఓవర్లో 22, 19వ ఓవర్లో 18, చివరి ఓవర్లో 19 పరుగులు రావడం విశేషం. దీంతో ఒక బంతి మిగిలి ఉండగానే శ్రీలంక విజయం సాధించింది.
177 రన్స్ టార్గెట్‌ను శ్రీలంక 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. ఒక దశలో 108 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయినా.. ఏడో వికెట్‌కు అజేయంగా 69 రన్స్ జోడించి లంకకు నమ్మశక్యం కాని విజయాన్ని సాధించిపెట్టారు శనక, కరుణరత్నె.
సంబంధిత కథనం
టాపిక్