Joe Root: సచిన్ టెండూల్కర్ వరల్డ్ రికార్డ్‌పై కన్నేసిన జో రూట్.. ఎంత దూరంలో ఉన్నాడంటే?
Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ అత్యధిక వన్డే సెంచరీల రికార్డును ఇప్పటికే విరాట్ కోహ్లీ బద్దలు కొట్టగా.. ఇప్పుడు టెస్టుల్లో సచిన్ అత్యధిక పరుగుల రికార్డ్ ప్రమాదంలో పడింది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ గత 26 నెలలుగా టెస్టుల్లో పరుగుల వరద పారిస్తూ సచిన్ రికార్డ్‌కి చేరువ అవుతున్నాడు.
Sachin Tendulkar Test runs record: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో నెలకొల్పిన వరల్డ్ రికార్డ్‌ను ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ బ్రేక్ చేస్తాడంటూ గత కొన్ని రోజుల నుంచి మాజీ క్రికెటర్లు జోరుగా జోస్యం చెప్తున్నారు. కెప్టెన్సీ నుంచి 26 నెలల క్రితం వైదొలిగిన జో రూట్ అప్పటి నుంచి బ్యాటింగ్‌లో అదరగొట్టేస్తున్నాడు. ఎంతలా అంటే? కెప్టెన్సీ వదిలేయక ముందు కెరీర్‌లో 117 టెస్టులాడి 25 సెంచరీలు, 54 హాఫ్ సెంచరీలు చేసిన జోరూట్.. ఈ రెండేళ్ల వ్యవధిలోనే 28 టెస్టుల్లో 8 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. దాంతో సచిన్ టెస్టు రికార్డ్‌ను జో రూట్ బ్రేక్ చేసేస్తాడంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సచిన్ వరల్డ్ రికార్డ్ ఏంటి?
సుదీర్ఘ కెరీర్‌లో 200 టెస్టులాడిన సచిన్ టెండూల్కర్ 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలతో మొత్తం 15,921 పరుగులు చేశాడు. అలానే 463 వన్డేల్లో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలతో 18,426 పరుగులు చేశాడు. ఇప్పుడు టెస్టుల్లో సచిన్ అత్యధిక పరుగుల రికార్డ్ ప్రమాదంలో పడింది.
2012లో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన జో రూట్ 145 టెస్టులాడి ఇప్పటికే 33 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలతో 12,274 పరుగులు చేశాడు. అంటే ఇక కేవలం 3,647 పరుగులు చేస్తే సచిన్ రికార్డ్ బద్దలవుతుంది. ప్రతి సంవత్సరం ఇంగ్లాండ్ టీమ్ కనీసం 12-14 టెస్టు మ్యాచ్‌లను ఆడుతుంది. కాబట్టి.. జో రూట్ ఇదే ఫామ్, ఫిట్‌నెస్‌ను కొనసాగిస్తే సచిన్ రికార్డ్ బద్దలవడం ఖాయం.
బజ్ బాల్‌తో కొత్త ఊపు
కెప్టెన్సీ నుంచి జో రూట్ వైదొలిగిన తర్వాత అతని బ్యాటింగ్ స్టయిల్ కూడా పూర్తిగా మారిపోయింది. దానికి తోడు ఇంగ్లాండ్ కోచ్‌గా మెక్‌కలమ్ రావడంతో బజ్ బాల్ గేమ్ తెరపైకి వచ్చింది. దాంతో స్వేచ్ఛగా బ్యాటింగ్‌లో చెలరేగిపోతున్న జో రూట్ టెస్టుల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాడు. వన్డే, టీ20ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన జో రూట్.. ఆ ఫార్మాట్లలో ఆడే రిస్కీ షాట్స్‌ను టెస్టుల్లో ఆడుతూ బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.
శ్రీలంకపై లార్డ్స్‌లో సెంచరీ
శ్రీలంక టీమ్‌తో ప్రస్తుతం లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ జో రూట్ సెంచరీతో కదంతొక్కాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 206 బంతుల్లోనే 18 ఫోర్ల సాయంతో జో రూట్ 143 పరుగులు చేశాడు. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 358 పరుగులను చేయగలిగింది. మూడు టెస్టుల ఈ సిరీస్‌లో ఆఖరి టెస్టు మ్యాచ్ సెప్టెంబరు 6 నుంచి జరగనుంది.
రూట్ ముందున్న సవాళ్లు
సచిన్ టెండూల్కర్ రికార్డును అందుకోవడానికి జో రూట్ ముందున్న అతి పెద్ద సవాలు ఫిట్‌నెస్. ఇప్పటికే జో రూట్ వయసు 33 ఏళ్లు.. మైదానంలో ఏమాత్రం సాహసోపేతంగా డైవ్ చేసినా పాత గాయాలు తిరగబడే ప్రమాదం ఉంది. దాంతో
ముందు జాగ్రత్తగా ఇప్పటికే టీ20, వన్డేలకి దూరంగా ఉంటున్న జో రూట్ కేవలం టెస్టుల్లో మాత్రమే ఆడుతున్నాడు. గాయపడి లేదా ఫామ్ కోల్పోయి ఇంగ్లాండ్ టీమ్‌కి దూరమైతే మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం కూడా అంత సులువు కాదు. కాబట్టి.. సచిన్ టెండూల్కర్ అత్యధిక టెస్టు పరుగుల రికార్డ్‌ను బద్దలు కొట్టాలంటే ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్‌ను కాపాడుకోవడం జోరూట్‌కి అత్యంత కీలకం.