Kamindu Mendis: చరిత్ర సృష్టించిన శ్రీలంక క్రికెటర్.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్
Kamindu Mendis: శ్రీలంక క్రికెటర్ కమిందు మెండిస్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకూ 147 టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ ఇతర క్రికెటర్ కూ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఈ రికార్డు నమోదైంది.
Kamindu Mendis: శ్రీలంక ఆల్ రౌండర్ కమిందు మెండిస్ ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. తాను ఆడిన తొలి ఎనిమిది టెస్టుల్లో ప్రతి మ్యాచ్ లోనూ 50 ప్లస్ స్కోరు నమోదు చేసిన ఘనతను అతడు సొంతం చేసుకున్నాడు. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో గతంలో ఏ ఇతర ప్లేయర్ ఈ రికార్డును నమోదు చేయలేదు. శ్రీలంక, న్యూజిలాండ్ రెండో టెస్టు తొలి రోజు ఆటలో అతడు మరో హాఫ్ సెంచరీ చేశాడు.
కమిందు మెండిస్ రికార్డు
శ్రీలంక బ్యాటర్ కమిందు మెండిస్ 2022లో ఆస్ట్రేలియాపై టెస్ట్ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 8 టెస్టులు ఆడాడు. ప్రతి మ్యాచ్ లోనూ కనీసం ఒక 50 ప్లస్ స్కోరు అతడు చేయడం విశేషం. తాజాగా న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు టెస్టుల్లో తన ఐదో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఇక ఇప్పటికే అతని ఖాతాలో నాలుగు సెంచరీలు ఉన్నాయి. 164 అతని అత్యధిక స్కోరు. ఇప్పుడు తొలి రోజు అజేయంగా క్రీజులో ఉన్న అతడు.. రెండో రోజు మరో సెంచరీపై కన్నేశాడు. న్యూజిలాండ్ తో రెండో టెస్ట్ తొలి రోజు వరకూ చూసుకుంటే.. కమిందు 8 టెస్టుల్లో 873 రన్స్ చేయడం విశేషం. అతని సగటు 79.36గా ఉంది.
శ్రీలంక పైచేయి
న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన శ్రీలంక.. రెండో టెస్టులోనూ తొలిరోజే పైచేయి సాధించింది. దినేష్ చండీమాల్ (116) సెంచరీకితోడు ఏంజెలో మాథ్యూస్ (78 నాటౌట్) హాఫ్ సెంచరీ చేశాడు. ఇక కమిందు కూడా 51 పరుగులతో నాటౌట్ గా ఉండటంతో తొలి రోజు శ్రీలంక 3 వికెట్లకు 306 పరుగులు చేసింది.
కమిందు కేవలం 56 బంతుల్లోనే 8 ఫోర్లు, ఒక సిక్స్ తో 51 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఈ హాఫ్ సెంచరీతోనే కమిందు అరుదైన ఆ రికార్డును నమోదు చేశాడు. టీ20, వన్డేల్లో పెద్దగా రాణించిన ఈ బ్యాటర్.. టెస్ట్ క్రికెట్ కు వచ్చేసరికి చెలరేగుతున్నాడు. తన తొలి ఏడు టెస్టుల్లోనే నాలుగు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలతో 822 రన్స్ చేసిన కమిందు.. ఇప్పుడు 8వ టెస్టులో మరో హాఫ్ సెంచరీ చేశాడు.
ఇక కమిందు వన్డేల విషయానికి వస్తే అతడు ఇప్పటి వరకూ 9 మ్యాచ్ లు ఆడి కేవలం 190 రన్స్ మాత్రమే చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఇక 16 టీ20ల్లో ఒక హాఫ్ సెంచరీతో 280 రన్స్ చేయడం విశేషం. ఆల్ రౌండర్ అయిన కమిందు.. టెస్టుల్లో ఇప్పటి వరకూ 3 వికెట్లు కూడా తీసుకున్నాడు. వన్డేల్లో రెండు వికెట్లు పడగొట్టగా.. టీ20ల్లో ఇంకా వికెట్లేమీ తీయలేదు.