Pakistan - World Cup: పాకిస్థాన్ జట్టులో వైరల్ ఫీవర్ కలవరం! కీలక మ్యాచ్‍కు ముందు..-pakistan cricket team hit by viral fever ahead of clash against australia in icc odi world cup 2023 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Pakistan - World Cup: పాకిస్థాన్ జట్టులో వైరల్ ఫీవర్ కలవరం! కీలక మ్యాచ్‍కు ముందు..

Pakistan - World Cup: పాకిస్థాన్ జట్టులో వైరల్ ఫీవర్ కలవరం! కీలక మ్యాచ్‍కు ముందు..

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 17, 2023 06:36 PM IST

Pakistan - World Cup 2023: పాకిస్థాన్ జట్టులో కొందరు ఆటగాళ్లు వైరల్ ఫీవర్ వచ్చిందని సమాచారం వెల్లడైంది. ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్‍కు ముందు పాక్ జట్టుకు ఈ ఇబ్బంది ఎదురైంది. వివరాలివే..

Pakistan - World Cup: పాకిస్థాన్ జట్టులో వైరల్ ఫీవర్ కలవరం
Pakistan - World Cup: పాకిస్థాన్ జట్టులో వైరల్ ఫీవర్ కలవరం (PTI)

Pakistan - World Cup 2023: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‍ 2023 టోర్నీని రెండు విజయాలతో మొదలుపెట్టి జోరు చూపింది పాకిస్థాన్ జట్టు. అయితే, భారత్‍తో అక్టోబర్ 14న జరిగిన మ్యాచ్‍లో మాత్రం పాకిస్థాన్ చేతులెత్తేసింది. టీమిండియా ధాటికి చిత్తుగా ఓడింది. ప్రపంచకప్‍లో తదుపరి ఆస్ట్రేలియాతో తలపడేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రస్తుతం బెంగళూరులో పాక్ ఆటగాళ్లు ఉన్నారు. ఆసీస్‍తో శుక్రవారం (అక్టోబర్ 20) తలపడనుంది పాక్. ఈ తరుణంలో పాకిస్థాన్ జట్టులో కలవరం నెలకొందని సమాచారం బయటికి వచ్చింది.

పాకిస్థాన్ ప్లేయర్లు షహిన్ షా అఫ్రిది, అబ్దుల్లా షఫీక్, ఉసామా మీర్ వైరల్ ఫీవర్‌ బారిన పడినట్టు సమాచారం బయటికి వచ్చింది. దీంతో టీమ్ ప్రాక్టీస్‍కు ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది. “ఇటీవల కొందరు ప్లేయర్లకు జ్వరం వచ్చింది. కొందరు కోలుకున్నారు. ఇంకా జ్వరంతో బాధపడుతున్న వారిని వైద్య బృందం పర్యవేక్షిస్తోంది” అని పాకిస్థాన్ టీమ్ మేనేజ్‍మెంట్.. పాక్ క్రికెట్ బోర్డుకు తెలిపినట్టు సమాచారం బయటికి వచ్చింది. ఇక, పాకిస్థాన్ ఆటగాళ్లకు డెంగ్యూ, కొవిడ్-19 పరీక్షలు కూడా జరిగాయని తెలుస్తోంది.

ప్రస్తుతం ఆటగాళ్లకు సాధారణ జ్వరమే వచ్చిందని, ఆస్ట్రేలియా మ్యాచ్ కల్లా కోలుకుంటారని మేనేజ్‍మెంట్ చెబుతోందని తెలుస్తోంది. అయితే, ప్రాక్టీస్‍పై మాత్రం ప్రభావం పడుతోంది. ఇప్పటికే ఆటగాళ్లకు జ్వరం వల్ల ఓ ప్రాక్టీస్ సెషన్‍ను పాక్ క్యాన్సిల్ చేసుకుంది.

ప్రస్తుత ప్రపంచకప్‍లో తొలుత నెదర్లాండ్స్ జట్టుపై 81 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. మెగా టోర్నీలో మంచి ఆరంభాన్ని అందుకుంది. ఆ తర్వాత శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో పాక్ గెలిచింది. అయితే, భారత్ చేతిలో పాకిస్థాన్‍కు ఘోర పరాభవం ఎదురైంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‍లో 117 బంతులు మిగిల్చి 7 వికెట్ల తేడాతో పాక్‍ను టీమిండియా చిత్తు చేసింది.

భారత్ చేతిలో ఓటమి ఎదురవటంతో ఆస్ట్రేలియాతో మ్యాచ్ పాకిస్థాన్‍ను కీలకంగా మారింది. అక్టోబర్ 20న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా పాక్ - ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ కీలక మ్యాచ్‍కు ముందే పాక్ జట్టులో వైరల్ ఫీవర్ కలవరం వచ్చింది.

Whats_app_banner