India vs Pakistan: గెలుపంటే ఇదేరా.. పాకిస్థాన్‍ను చిత్తుగా ఓడించిన భారత్.. రోహిత్ అదుర్స్.. ఆ రికార్డు మరింత పదిలం-ind vs pak world cup 2023 india thrash pakistan by 7 wickets rohit sharma shines agains ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Pakistan: గెలుపంటే ఇదేరా.. పాకిస్థాన్‍ను చిత్తుగా ఓడించిన భారత్.. రోహిత్ అదుర్స్.. ఆ రికార్డు మరింత పదిలం

India vs Pakistan: గెలుపంటే ఇదేరా.. పాకిస్థాన్‍ను చిత్తుగా ఓడించిన భారత్.. రోహిత్ అదుర్స్.. ఆ రికార్డు మరింత పదిలం

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 14, 2023 08:20 PM IST

India vs Pakistan ODI World Cup: వన్డే ప్రపంచకప్‍లో పాకిస్థాన్‍ను టీమిండియా చిత్తు చేసింది. అన్ని విభాగాల్లో సత్తాచాటి భారత్ విజయం సాధించింది. వరల్డ్ కప్‍లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది.

India vs Pakistan: గెలుపంటే ఇదేరా.. పాకిస్థాన్‍ను చిత్తుగా ఓడించిన భారత్.. రోహిత్ అదుర్స్.. ఆ రికార్డు మరింత పదిలం
India vs Pakistan: గెలుపంటే ఇదేరా.. పాకిస్థాన్‍ను చిత్తుగా ఓడించిన భారత్.. రోహిత్ అదుర్స్.. ఆ రికార్డు మరింత పదిలం (BCCI Twitter)

India vs Pakistan ODI World Cup: వన్డే ప్రపంచకప్‍లో టీమిండియా అద్భుత ప్రదర్శన కొనసాగింది. హైవోల్టేజ్ మ్యాచ్‍లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‍ను భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. వరల్డ్ కప్‍ 2023లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది రోహిత్ సేన. ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో టాప్‍కు చేరింది. వన్డే ప్రపంచకప్‍లో భాగంగా అహ్మదాబాద్‍లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు (అక్టోబర్ 14) జరిగిన మ్యాచ్‍లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‍పై అలవోక విజయం సాధించింది.

స్వల్ప లక్ష్యఛేదనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (63 బంతుల్లో 86 పరుగులు; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. దీంతో భారత్ 30.3 ఓవర్లలోనే 3 వికెట్లకు 192 పరుగులు చేసి గెలిచింది. 117 బంతులను మిగిల్చి మరీ పాక్‍ను టీమిండియా చిత్తు చేసింది. శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 53 పరుగులు; నాటౌట్) అర్ధ శతకంతో రాణించాడు. పాకిస్థాన్ బౌలర్లలో షహిన్ షా అఫ్రిది రెండు, హసన్ అలీ ఓ వికెట్ తీశాడు. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, కుల్‍దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు తీసి పాక్‍ను కూల్చారు. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజమ్ (50), మహమ్మద్ రిజ్వాన్ (49) మాత్రమే రాణించారు. మ్యాచ్ ఎలా సాగిందంటే..

రికార్డు మరింత పదిలం

వన్డే ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‍పై అజేయ రికార్డును టీమిండియా మరింత పదిలం చేసుకుంది. ఈ మ్యాచ్ కిందటి వరకు వన్డే ప్రపంచ కప్ టోర్నీల్లో పాక్‍తో తలపడిన ఏడుసార్లు భారత జట్టే గెలిచింది. ఇప్పుడు ఎనిమిదోసారి కూడా విజయం సాధించి వన్డే ప్రపంచకప్‍ల్లో పాక్‍పై 8-0తో రికార్డును భారత్ కంటిన్యూ చేసింది.

రఫ్ఫాడించిన రోహిత్ శర్మ

192 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపాడు. తన మార్క్ హిట్టింగ్‍తో ఆరంభం నుంచే విరుచుకుపడ్డాడు. శుభ్‍మన్ గిల్ (16) కాసేపు బాగానే ఆడి ఔటైనా.. రోహిత్ మాత్రం దూకుడును ఏ మాత్రం తగ్గించలేదు. విరాట్ కోహ్లీ (16) సహకారంతో హిట్టింగ్ కొనసాగించాడు. దీంతో పది ఓవర్లలోనే భారత్ స్కోరు 79 పరుగులకు చేరింది. ఈ క్రమంలో పదో ఓవర్లో హసన్ అలీ బౌలింగ్‍లో కోహ్లీ ఔటయ్యాడు.

మరోవైపు, రోహిత్ శర్మ మాత్రం రఫ్ఫాడించడం కొనసాగించాడు. పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి చేరాడు రోహిత్. మరో ఎండ్‍లో శ్రేయస్ అయ్యర్ కూడా వేగంగానే ఆడాడు. దీంతో భారత్ స్కోరు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో వన్డే క్రికెట్‍లో తన 300 సిక్సర్‌ మార్కును దాటాడు హిట్‍మ్యాన్. రోహిత్, శ్రేయస్ అయ్యర్ దూకుడుతో 20.4 ఓవర్లలోనే 150 పరుగులకు భారత్ చేరింది. అయితే, సెంచరీ చేస్తాడనుకున్న సమయంలో 22 ఓవర్లో షహిన్ అఫ్రిది బౌలింగ్‍లో రోహిత్ శర్మ ఔటయ్యాడు. చివర్లో శ్రేయస్, కేఎల్ రాహుల్ (19 నాటౌట్) మిగిలిన పనిని పూర్తి చేశారు. దీంతో భారత్ ఘన విజయం సాధించింది.

పాక్‍ను కూల్చేసిన భారత బౌలర్లు

పాకిస్థాన్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజమ్ (50), మహమ్మద్ రిజ్వాన్ (49) మినహా మరెవరూ రాణించలేకపోయారు. భారత బౌలర్లు సమిష్టిగా సత్తాచాటడంతో పాక్ బ్యాటర్లు వణికిపోయారు. ఓ దశలో 155 పరుగులకు 2 వికెట్లతో పటిష్ట స్థితిలో నిలిచింది పాకిస్థాన్. అయితే, ఆ తర్వాత వరుసగా వికెట్లు తీశారు భారత బౌలర్లు. బుమ్రా, సిరాజ్, పాండ్యా, కుల్‍దీప్, జడేజా వరుసగా వికెట్లు పడగొట్టారు. దీంతో చివరి 36 పరుగులకు 8 వికెట్లను చేజార్చుకొని 191 పరుగులకే పాకిస్థాన్ కుప్పకూలింది.

Whats_app_banner

సంబంధిత కథనం