India vs Pakistan: భారత బౌలింగ్ దెబ్బకు పాకిస్థాన్ విలవిల.. తక్కువ స్కోరుకే ఢమాల్.. ఐదుగురు బౌలర్లకు చెరో రెండు వికెట్లు
India vs Pakistan World Cup 2023: భారత బౌలర్లు సమిష్టిగా సత్తాచాటడంతో పాకిస్థాన్ కుదేలైంది. సల్ప స్కోరుకే కుప్పకూలింది. దీంతో భారత్ ముందు సునాయాస లక్ష్యం ఉంది.
India vs Pakistan World Cup 2023: టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించి పాకిస్థాన్ బ్యాటర్లను గడగడలాడించారు. పాక్‍ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశారు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా నేడు (అక్టోబర్ 14) భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‍లో భారత బౌలర్లు కలిసికట్టుగా సత్తాచాడటంతో పాక్ విలవిల్లాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (50), మహమ్మద్ రిజ్వాన్ (49), ఇమాముల్ హక్ (36) మినహా మిగిలిన పాక్ బ్యాటర్లు ఎవరూ ఎక్కువసేపు నిలువలేకపోయారు. ఓ దశలో 2 వికెట్లకు 155 పరుగుల వద్ద ఉన్న పాకిస్థాన్ ఆ తర్వాత భారత బౌలర్ల ధాటికి టపటపా వికెట్లు కోల్పోయింది. చివరి 36 పరుగులకే 8 వికెట్లు నష్టపోయింది. టీమిండియా బౌలర్లలో జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, కుల్‍దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. దీంతో భారత్ ముందు 192 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది.
ఆరంభం బాగానే..
భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంపిక చేసుకోవడంతో పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్‍కు దిగింది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (20), ఇమాముల్ హక్ మోస్తరు ఆరంభాన్ని ఇచ్చారు. 8వ ఓవర్ చివరి బంతికి భారత పేసర్ సిరాజ్.. షఫీక్‍ను ఎల్బీడబ్ల్యూ చేసి వికెట్ల బోణీ చేశాడు. ఇమాముల్ హక్‍ను 13వ ఓవర్లో పాండ్యా పెవిలియన్‍కు పంపాడు. అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్ నిలకడగా ఆడారు.
బాబర్, రిజ్వాన్ ఆరంభంలో నిలకడగా ఆడినా.. ఆ తర్వాత వేగం పెంచారు. ఈ క్రమంలో 28 ఓవర్లలో 150 పరుగులకు పాక్ చేరింది. మంచి స్కోరు చేసేలా కనిపించింది. ఈ క్రమంలో 57 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఆజమ్. అయితే ఆ తర్వాత సీన్ మారింది. బాబర్ ఆజమ్‍ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 29.4 ఓవర్లలో 155 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది పాక్.
పాకిస్థాన్ టపటపా
ఆజమ్ ఔటయ్యాక పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్ సైకిల్ స్టాండ్‍లా కుప్పకూలిపోయింది. సౌద్ షకీల్ (6), ఇఫ్తికార్ అహ్మద్ (4)ను భారత స్పిన్నర్ కుల్‍దీప్ యాదవ్.. ఒకే ఓవర్లో ఔట్ చేసి పాక్‍ను కోలుకోలేని దెబ్బ తీశాడు. నిలకడగా ఆడుతున్న మహమ్మద్ రిజ్వాన్‍ను స్లో బాల్‍తో బౌల్డ్ చేసి పాక్‍కు బిగ్ షాక్ ఇచ్చాడు భారత పేసర్ బుమ్రా. ఆ తర్వాత షాదాబ్ ఖాన్ (2)ను కూడా పెవిలియన్‍కు పంపాడు. మహమ్మద్ నవాజ్ (4)ను పాండ్యా, హసన్ అలీ (12), హారిస్ రవూఫ్ (2)ను టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. భారత బౌలర్ల దాడితో చివరి 8 వికెట్లను కేవలం 36 పరుగులకే పాక్ కోల్పోయింది. ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‍కే పరిమితం అయ్యారు.