T20 World Cup Semi Final Race: పాక్ చేతిలో ఇప్పుడు భారత్ ఉమెన్స్ టీమ్ సెమీస్ ఆశలు, కానీ కండీషన్స్ అప్లై!
ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో ఈరోజు (అక్టోబరు 14) పాకిస్థాన్ టీమ్ గెలవాలని భారత్ కోరుకుంటోంది. అయితే భారీ తేడాతో పాకిస్థాన్ ఈరోజు న్యూజిలాండ్‌పై గెలిస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది.
యూఏఈ వేదికగా జరుగుతున్న ఉమెన్స్ టీ20 ప్రపంచకప్-2024లో భారత్ జట్టు సెమీస్ ఆశలు ఇప్పుడు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఉన్నాయి. టోర్నీలో ఆదివారం రాత్రి లీగ్ దశ చివరి మ్యాచ్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో ఆడిన భారత్ ఉమెన్స్ టీమ్ 9 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. దాంతో భారత్ జట్టు ఇప్పుడు సెమీస్ రేసులో ఉండాలంటే సోమవారం దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను పాకిస్థాన్ జట్టు ఓడించాలి. లేదంటే పాక్‌తో పాటు భారత్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించి ఇంటిబాట పడతాయి.
పాయింట్ల పట్టికలో టాప్-2లో భారత్
ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన భారత్ జట్టు ప్రస్తుతం 4 పాయింట్లు, +0.322 నెట్ రన్ రేట్‌తో గ్రూప్ -ఎ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. అదే సమయంలో న్యూజిలాండ్ ఖాతాలోనూ నాలుగు పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్‌రేట్ +0.282గా ఉండటంతో పట్టికలో మూడో స్థానంలో ఉంది.
ఇక పాకిస్థాన్ విషయానికొస్తే ఆ జట్టు ఖాతాలో 2 పాయింట్లు ఉండగా, నెట్ రన్ రేట్ -0.488తో నాలుగో స్థానంలో ఉంది. గ్రూప్‌లో నాలుగు మ్యాచ్‌లాడి.. నాల్గింటిలో ఓడిన శ్రీలంక ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాబట్టి.. ఇప్పుడు భారత్ సెమీస్‌కి పెద్ద అడ్డంగా న్యూజిలాండ్ మాత్రమే.
పాక్ గెలిచినా.. కండీషన్స్ అప్లై
న్యూజిలాండ్‌పై ఈరోజు పాకిస్థాన్ గెలిస్తే నెట్‌రన్ రేట్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ కంటే మెరుగ్గా ఉన్న భారత్ జట్టు సెమీస్ చేరడానికి లైన్ క్లియర్ అవుతుంది. అయితే పాకిస్తాన్ జట్టు ఒకవేళ మొదట బ్యాటింగ్ చేస్తే న్యూజిలాండ్‌ను 53 పరుగులకు మించి తేడాతో ఓడించకూడదు.
ఒకవేళ పాకిస్థాన్ చేజింగ్ చేస్తే లక్ష్యాన్ని 9.1 ఓవర్ల ముందు ఛేదించకూడదు. పాకిస్థాన్ పొరపాటున అలా న్యూజిలాండ్‌పై ఇలా చేయగలిగితే.. భారత్ కంటే మెరుగైన నెట్‌రన్‌రేట్ సాధించే అవకాశం ఉంటుంది. అప్పుడు భారత్ ఇంటిబాట పట్టి.. పాక్ సెమీస్ చేరుతుంది.
న్యూజిలాండ్‌పై పాక్‌కి చెత్త రికార్డ్
వాస్తవానికి న్యూజిలాండ్‌పై పాకిస్థాన్‌కి మెరుగైన రికార్డ్ లేదు.ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య 11 టీ20 మ్యాచ్‌లు జరగగా.. ఇందులో పాక్ గెలిచింది కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే. మిగిలిన 9 మ్యాచ్‌ల్లోనూ న్యూజిలాండ్ గెలిచింది. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఈ రికార్డ్ మరీ దారుణంగా ఉంది. ఇరు జట్లు 3 సార్లు ముఖాముఖి తలపడగా మూడు సార్లు న్యూజిలాండ్ పైచేయి సాధించింది.
ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిందిలా
షార్జా వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీమ్ 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో ఆఖరి వరకూ పోరాడిన భారత్ జట్టు 142/9కే పరిమితమైంది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 47 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 54 పరుగులు చేసి ఆఖరి వరకూ పోరాడినా భారత్ జట్టుని గెలిపించలేకపోయింది. టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతిలో 58 పరుగుల భారీ తేడాతో భారత్ జట్టు ఓడిపోవడం ఇప్పుడు పెద్ద మైనస్‌గా మారిపోయింది.