Women’s T20 World Cup: సెమీస్ రేసులో నిలవాలంటే ఆస్ట్రేలియాపై ఈరోజు భారత్ గెలవాలి, ఓడినా పాక్ గెలిస్తే సెమీస్ ఛాన్స్!
India Women vs Australia Women Match: టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ జట్టు ఈరోజు షార్జా వేదికగా కీలక మ్యాచ్ ఆడబోతోంది. ఆస్ట్రేలియాపై పేలవమైన రికార్డ్ ఉన్న భారత్ జట్టు ఈరోజు ఏం చేస్తుందో చూడాలి.
యూఏఈ వేదికగా జరుగుతున్న ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ -2024లో భారత్ జట్టు సెమీస్ రేసులో నిలవాలంటే ఆదివారం (అక్టోబరు 13) ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. గ్రూప్-ఎలో ఉన్న భారత్ జట్టు ఈరోజు రాత్రి లీగ్ దశ చివరి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో షార్జా వేదికగా ఢీకొంటోంది.
న్యూజిలాండ్ చేతిలో ఫస్ట్ మ్యాచ్‌లో ఓడిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఆ తర్వాత వరుసగా పాకిస్థాన్, శ్రీలంకపై గెలిచి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతోంది. అయితే.. సెమీస్ చేరాలంటే మాత్రం భారత్ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు మ్యాచ్‌లో తప్పక గెలవాలి.
పాక్ గెలిస్తే భారత్‌కి లైన్ క్లియర్
ఈరోజు ఒకవేళ ఆస్ట్రేలియాపై గెలిచినా కూడా భారత్ జట్టు సెమీస్ బెర్తు ఖాయం కాదు. కానీ రేసులో మాత్రం ఉంటుంది. అక్టోబర్ 14న పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుండగా.. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టీమ్ ఓడిపోతే అప్పుడు భారత్ సెమీస్ చేరే అవకాశం ఉంటుంటి.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ -2024లో భారత్ ప్రస్తుతం 3 మ్యాచ్‌లు ఆడి రెండింటిని గెలవడం ద్వారా 4 పాయింట్లతో ఉంది. అలానే నెట్ రన్‌రేట్ కూడా +0.576తో పాజిటివ్‌గా ఉంది. ఈ రోజు ఆస్ట్రేలియాను మట్టికరిపించగలిగితే 6 పాయింట్లు వస్తాయి. అలానే భారీ తేడాతో ఓడించగలిగితే నెట్ రన్‌రేట్ కూడా మెరుగవుతుంది.
డిసైడ్ చేయబోతున్న నెట్ రన్‌రేట్
సోమవారం ఒకవేళ పాకిస్థాన్ టీమ్‌ను న్యూజిలాండ్ ఓడిస్తే.. ఇప్పుడు 4 పాయింట్లతో ఉన్న ఆ జట్టు కూడా 6 పాయింట్లతో భారత్‌తో సమానంగా నిలుస్తుంది. ఆ సమయంలో నెట్ రన్‌రేట్ కీలకం అవుతుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ నెట్ రేట్ +0.282గా ఉంది. గ్రూప్- ఎ నుంచి రెండు జట్లు సెమీస్‌కి చేరనుండగా.. ఆస్ట్రేలియా టీమ్ ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఆరు పాయింట్లతో టాప్‌లో ఉంది. ఆ జట్టు నెట్ రన్‌రేట్ +2.786గా ఉంది. కాబట్టి ఒకవేళ భారత్ చేతిలో ఆస్ట్రేలియా ఓడినా.. ఆ జట్టుకి జరిగే నష్టం పెద్దగా ఉండదు.
ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోతే..?
ఈరోజు ఒకవేళ ఆస్ట్రేలియా చేతిలో భారత్ జట్టు ఓడిపోయినా.. సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. కానీ.. అది జరగాలంటే పాకిస్థాన్ టీమ్ భారీ తేడాతో సోమవారం న్యూజిలాండ్ జట్టుని ఓడించాలి. అప్పుడు న్యూజిలాండ్, భారత్, పాకిస్థాన్ జట్లు నాలుగేసి పాయింట్లతో రేసులో నిలుస్తాయి. అయితే.. మిగిలిన రెండు జట్ల కంటే భారత్‌కి మెరుగైన నెట్ రన్‌రేట్ ఉండటంతో భారత్ సెమీస్ చేరే అవకాశం ఉంటుంది.