Virat Kohli Worst Record: విరాట్ కోహ్లి చెత్త రికార్డు.. మైల్‌స్టోన్ మ్యాచ్‌లో తప్పని అవమానం
03 April 2024, 8:46 IST
- Virat Kohli Worst Record: విరాట్ కోహ్లి తన పేరిట ఓచెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. అది కూడా ఆర్సీబీ తరఫున చిన్నస్వామి స్టేడియంలో ఆడిన మైల్ స్టోన్ మ్యాచ్ లో కావడం గమనార్హం.
విరాట్ కోహ్లి చెత్త రికార్డు.. మైల్‌స్టోన్ మ్యాచ్‌లో తప్పని అవమానం
Virat Kohli Worst Record: ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లి ఇప్పటి వరకూ నాలుగు మ్యాచ్ లు ఆడాడు. ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ ఏదో ఒక రికార్డు సొంతం చేసుకున్నాడు. నిజానికి నాలుగో మ్యాచ్ ప్రారంభానికి ముందే చిన్నస్వామి స్టేడియంలో వందో మ్యాచ్ తో రికార్డు క్రియేట్ చేశాడు. కానీ అలాంటి మైల్ స్టోన్ మ్యాచ్ లో కోహ్లికి ఘోర అవమానం తప్పలేదు.
విరాట్ కోహ్లి చెత్త రికార్డు
లక్నో సూపర్ జెయింట్స్ చేతుల్లో ఆర్సీబీ ఓడిపోవడంతో కోహ్లి ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్ లు ఓడిన ప్లేయర్ రికార్డు. ఇప్పటి వరకూ ఐపీఎల్లో కోహ్లి 120 మ్యాచ్ లు ఓడిపోయాడు. ఈ సీజన్లో తన కళ్లు చెదిరే బ్యాటింగ్ తో ఎన్నో రికార్డులతోపాటు ఆరెంజ్ క్యాప్ కూడా అందుకున్న కోహ్లి.. ఇప్పుడిలాంటి రికార్డును మూటగట్టుకోవడం ఊహించనిదే.
ఈ సీజన్లో సొంత మైదానంలో ఆర్సీబీ మూడు మ్యాచ్ లు ఆడి రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. కోహ్లి రెండు హాఫ్ సెంచరీలతో తన ప్రయత్నం తాను చేస్తున్నా.. జట్టులోని మిగిలిన స్టార్ ప్లేయర్స్ డుప్లెస్సి, మ్యాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్ తీవ్రంగా నిరాశ పరుస్తున్నారు. ఈ ముగ్గురి కారణంగానే ఆర్సీబీ వరుసగా ఓడుతోంది.
ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీతోనే విరాట్ కోహ్లి ఉన్న విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ అతడే. కానీ ఇప్పుడదే కోహ్లికి ఈ చెత్త రికార్డును కూడా అంటగట్టింది. ఇంతకుముందు దినేష్ కార్తీక్ 118 ఓటములతో టాప్ లో ఉండేవాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ 112, శిఖర్ ధావన్ 107, రాబిన్ ఉతప్ప 106 ఓడిన మ్యాచ్ లలో ప్లేయర్ గా ఉన్నారు.
మయాంక్ స్పీడుకు బోల్తా
ఇండియన్ క్రికెట్ లో ఓ కొత్త పేస్ సెన్సేషన్ పుట్టుకొచ్చాడు. గత రెండు సీజన్లలో ఉమ్రాన్ మాలిక్ ను తలపించేలా ఈసారి లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మయాంక్ యాదవ్ ప్రత్యర్థులను తన స్పీడుతో బెంబేలెత్తిస్తున్నాడు. తాజాగా ఆర్సీబీతో మ్యాచ్ లోనూ మూడు వికెట్లు తీసిన మాయంక్.. లక్నోని గెలిపించాడు. ఈ మ్యాచ్ లో అతడు ఓ బంతిని ఏకంగా 156.7 కి.మీ. వేగంతో వేసి ఈ సీజన్లో సరికొత్త రికార్డును నమోదు చేశాడు.
ఈ మ్యాచ్ లో లక్నో మొదట బ్యాటింగ్ చేసి 7 వికెట్లకు 181 పరుగులు చేసింది. అయితే తర్వాత చేజింగ్ లో ఆర్సీబీలోని కీలక బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. విరాట్ కోహ్లిని సిద్ధార్థ్ ఔట్ చేయగా.. రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, మ్యాక్స్‌వెల్ వికెట్లను మయాంక్ తీసుకున్నాడు. అతడు 4 ఓవర్లలో కేవలం 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయడం విశేషం.
ఆర్సీబీ ఈ సీజన్లో ఆడిన 4 మ్యాచ్ లలో మూడు ఓడి పాయింట్ల టేబుల్లో 9వ స్థానంలో ఉంది. మరో 10 మ్యాచ్ లు ఆ టీమ్ ఆడాల్సి ఉంది. ఇక్కడి నుంచి కోలుకొని ప్లేఆఫ్స్ రేసులో ఉండటం ఆ టీమ్ కు అంత సులువైన పనిలా కనిపించడం లేదు.