IPL cricket bats: ఐపీఎల్లో విరాట్ కోహ్లి వాడే బ్యాట్ ధరెంతో తెలుసా? ప్రపంచంలోనే అత్యధిక ధర కలిగిన బ్యాటే ఇదే
IPL cricket bats: ఐపీఎల్లో వీర బాదుడు బాదే ప్లేయర్స్ ఎలాంటి క్రికెట్ బ్యాట్లు వాడతారు? విరాట్ కోహ్లి వాడే బ్యాట్ ధరెంత? అసలు ప్రపంచంలోనే అత్యంత ధర కలిగిన క్రికెట్ బ్యాట్ లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోండి.
IPL cricket bats: ఐపీఎల్ అంటేనే బౌలర్లను చితకబాదడమే పనిగా పెట్టుకుంటారు బ్యాట్స్‌మెన్. మరి ఆ బంతిని చితకబాదడానికి మన స్టార్ క్రికెటర్లు ఉపయోగించే బ్యాట్లు ఏవో తెలుసా? అందులోనూ విరాట్ కోహ్లిలాంటి ప్లేయర్ ఉపయోగించే బ్యాట్ ఏది? దాని ధరెంతో తెలుసుకోవడానికి ప్రతి క్రికెట్ అభిమాని ఉవ్విళ్లూరుతాడు. మరి ఆ బ్యాట్ల సంగతేంటో చూడండి.
విరాట్ కోహ్లి వాడే బ్యాట్ ఇదే
ఐపీఎల్లోనే కాదు ఇంటర్నేషనల్ క్రికెట్ లో మన టీమిండియా, ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి వాడే బ్యాట్ చాలా ప్రత్యేకమైనది. అతడు జీఎం ఒరిజినల్ ఎల్ఈ (GM Original LE)కి చెందిన బ్యాట్ వాడుతాడు. అతనితోపాటు పలువురు ఇతర ఇంటర్నేషనల్ క్రికెటర్లు కూడా ఇవే బ్యాట్లు ఉపయోగిస్తారు. ఈ బ్యాట్ ధర 900 డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.75 వేలు.
క్రికెట్ బ్యాట్ అంటే దానిపై ఉండే స్వీట్ స్పాట్ రేంజ్ ను బట్టి చూస్తారు. కోహ్లి వాడే బ్యాట్లో స్వీట్ స్పాట్ మిడ్ రేంజ్ నుంచి హై వరకు ఉంటుంది. దీంతో ఫ్రంట్ ఫుట్ అయినా, బ్యాక్ ఫుట్ అయినా మంచి స్ట్రోక్ ప్లే ఈ బ్యాట్ తో ఆడొచ్చు. అంచులు చాలా మందంగా ఉండటం వల్ల షాట్లకు మరింత శక్తి ఈ బ్యాట్ ద్వారా లభిస్తుంది.
అత్యంత ఖరీదైన బ్యాట్ ఏదంటే..
విరాట్ కోహ్లి బ్యాట్ ధర రూ.75 వేలంటేనే నమ్మశక్యం కాదు. కానీ ప్రపంచంలోనే అత్యంత ధర కలిగిన క్రికెట్ బ్యాట్ ఏదో తెలుసా? ది గ్రే నికోల్స్ లెజెండ్ గోల్డ్. ఈ బ్యాటర్ ధర ఏకంగా 14 వేల డాలర్లు. అంటే సుమారు రూ.11.67 లక్షలు. ఇది ఒకప్పటి విండీస్ లెజెండరీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేసేవారు. ఈ ఒక్క బ్యాట్ చేయడానికి సుమారు 8 వారాలు పడుతుంది.
ఇప్పటి వరకూ ఈ నికోల్స్ లెజెండ్ గోల్డ్ బ్యాట్లను కేవలం 200 మాత్రమే తయారు చేశారు. ధర చాలా ఎక్కువ కావడం వల్ల కూడా చాలా మంది క్రికెటర్లు ఈ బ్యాట్ ను ఉపయోగించరు. ఈ రెండే కాదు.. క్రికెట్ బ్యాట్లలో మరో మూడు రకాలు ఉంటాయి. అవేంటో చూడండి.
ది కూకాబుర్రా కహునా
అంతర్జాతీయ స్థాయిలో చాలా మంది క్రికెటర్లు వాడే బ్యాట్లలో ఈ కూకాబుర్రా కహునా కూడా ఒకటి. దీనిని గ్రేడ్ 1 ఇంగ్లిష్ విల్లో ఉపయోగించి తయారు చేస్తారు. దీని ధర 1000 డాలర్లు. అంటే సుమారు రూ.83 వేలు. ప్రతి బంతిని స్టాండ్స్ లోకి తరలించాలనే పవర్ హిట్టర్లకు ఈ బ్యాట్ బాగుంటుంది. దీనిపై స్వీట్ స్పాట్ చాలా ఎక్కువ. గ్రిప్ కూడా బాగుంటుంది. దీంతో భారీ షాట్లు ఆడే సమయంలోనూ బ్యాట్ పై నియంత్రణ కోల్పోరు.
ది అడిడాస్ లిబ్రో
అడిడాస్ లిబ్రో కూడా చాలా పాపులర్ బ్యాటే. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇదే బ్యాట్ వాడుతున్నాడు. దీని ధర 700 డాలర్లు ఉంటుంది. ఇది కూడా మంచి నాణ్యత కలిగిన ఇంగ్లిష్ విల్లో నుంచే తయారు చేస్తారు. దీనిపై స్వీట్ స్పాట్ స్థాయి మధ్యస్థంగా ఉంటుంది. ఫ్రంట్ ఫుట్ పై ఎక్కువగా ఆడే ప్లేయర్స్ ఇలాంటి బ్యాట్లను ఉపయోగిస్తారు.
ది న్యూ బ్యాలెన్స్ డీసీ 1080
ది న్యూ బ్యాలెన్స్ డీసీ 1080 ధర అన్నింటి కంటే తక్కువ. అంతర్జాతీయ క్రికెట్ లో స్టీవ్ స్మిత్, జేసన్ హోల్డర్ లాంటి వాళ్లు ఈ బ్యాట్లను ఉపయోగిస్తున్నారు. దీని ధర 600 డాలర్లు. దీనిపై స్వీట్ స్పాట్ ఎక్కువే. దీంతో పవర్ హిట్టర్లకు బాగా పనికొస్తుంది.