క్రికెట్‌ బ్యాట్లలో ఇంగ్లిష్‌ విల్లో, కశ్మీర్‌ విల్లో మధ్య తేడా ఏంటి? ఏది బెస్ట్-what is the difference between english willow and kashmir willow bats and which one is best ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  క్రికెట్‌ బ్యాట్లలో ఇంగ్లిష్‌ విల్లో, కశ్మీర్‌ విల్లో మధ్య తేడా ఏంటి? ఏది బెస్ట్

క్రికెట్‌ బ్యాట్లలో ఇంగ్లిష్‌ విల్లో, కశ్మీర్‌ విల్లో మధ్య తేడా ఏంటి? ఏది బెస్ట్

Hari Prasad S HT Telugu
Jan 24, 2022 08:25 PM IST

Cricket Bats.. కెరీర్‌ ప్రారంభం నుంచే ఆట నేర్చుకోవడంతోపాటు ఎలాంటి బ్యాట్‌ ఎంచుకోవాలన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. మన దేశంలో అప్పుడే క్రికెట్‌ మొదలుపెడుతున్న వారి నుంచి ప్రొఫెషనల్‌ క్రికెటర్ల వరకూ అందుబాటులో ఉండేవి ఈ ఇంగ్లిష్‌ విల్లో, కశ్మీర్‌ విల్లో బ్యాట్లే. మరి వీటి మధ్య ఉన్న తేడా ఏంటి? ఈ బ్యాట్లలో ఏది బెస్ట్‌?

<p>ఇంగ్లిష్ విల్లో బ్యాట్లు</p>
ఇంగ్లిష్ విల్లో బ్యాట్లు (AFP)

Cricket Bats.. సాధారణంగా క్రికెట్‌ అంటే ఇష్టపడే వాళ్లు, కేవలం చూడటానికే పరిమితమయ్యే వాళ్లకు తెలియదు కానీ.. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడానికి చిన్నతనం నుంచే కోచింగ్‌ తీసుకునే వారికి క్రికెట్‌ బ్యాట్ల గురించి అవగాహన ఉంటుంది. వీళ్లు కచ్చితంగా ఒక్కసారైనా ఇంగ్లిష్‌ విల్లో బ్యాట్‌, కశ్మీర్‌ విల్లో బ్యాట్‌ అనే పదాలను విని ఉంటారు. ఏ బ్యాట్స్‌మన్‌కు అయినా ఎంత నైపుణ్యం ఉన్నా.. ఎన్ని రకాల షాట్లు ఆడగలిగినా, మంచి ఆర్మ్‌ పవర్‌ ఉన్నా.. ఆ బ్యాట్స్‌మన్‌ వాడే బ్యాట్‌ కూడా సక్సెస్‌లో కీలకపాత్ర పోషిస్తుంది. 

అందుకే కెరీర్‌ ప్రారంభం నుంచే ఆట నేర్చుకోవడంతోపాటు ఎలాంటి బ్యాట్‌ ఎంచుకోవాలన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. మన దేశంలో అప్పుడే క్రికెట్‌ మొదలుపెడుతున్న వారి నుంచి ప్రొఫెషనల్‌ క్రికెటర్ల వరకూ అందుబాటులో ఉండేవి ఈ ఇంగ్లిష్‌ విల్లో, కశ్మీర్‌ విల్లో బ్యాట్లే. మరి వీటి మధ్య ఉన్న తేడా ఏంటి? ఈ బ్యాట్లలో ఏది బెస్ట్‌?

అసలు విల్లో అంటే ఏంటి?

క్రికెట్‌ బ్యాట్లలో ఇంగ్లిష్‌ విల్లో, కశ్మీర్‌ విల్లోలు ఏంటి? వీటి మధ్య తేడా ఏంటి అన్నది తెలుసుకునే ముందు అసలు బ్యాట్‌ను విల్లో అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఇవి సాలిక్స్‌ ఆల్బా జాతి విల్లో చెట్ల నుంచి తయారవుతాయి కాబట్టి. ఈ చెట్లు చల్లటి వాతావరణం ఉండే యూరప్‌, కెనడా, రష్యా, ఇండియాలోని కశ్మీర్‌ ప్రాంతాల్లో పెరుగుతాయి. దీని బెరడును చాలా దేశాల్లో జలుబు, జ్వరం, కీళ్ల నొప్పుల కోసం వాడుతుంటారు. 

ఈ చెట్లు 60 నుంచి 80 అడుగుల వరకూ కూడా పెరుగుతుంటాయి. వివిధ ప్రాంతాల్లో పెరిగే విల్లో చెట్లు అక్కడి వర్షపాతం, వాతావరణ పరిస్థితులు, నేల తీరు, తేమ శాతం వంటి వాటిని బట్టి వేర్వేరుగా ఉంటాయి. ఇంగ్లండ్‌లో అయితే ప్రత్యేకంగా క్రికెట్‌ బ్యాట్లను తయారు చేయడానికే ఈ చెట్లను పెంచుతారు. అక్కడి విల్లోలు తెలుపు రంగులో ఉంటాయి. చాలా మంది ప్రొఫెషనల్‌ క్రికెటర్లు ఈ ఇంగ్లిష్‌ విల్లోలనే వాడుతారు.

ఇంగ్లిష్‌, కశ్మీర్‌ విల్లోల మధ్య తేడా ఏంటి?

ఈ రెండు విల్లోల మధ్య ఉన్న మొదటి తేడా కలప రంగు. ఇంగ్లిష్‌ విల్లో తెల్లగా ఉంటే, కశ్మీర్‌ విల్లో బ్రౌన్‌ కలర్‌లో ఉంటుంది. ఇక ఇంగ్లిష్‌ విల్లో బ్యాట్లపై గ్రెయిన్స్‌ స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడ గ్రెయిన్స్‌ అంటే బ్యాట్లపై కనిపించే నిలువు గీతలు. ఇవి ఆ చెట్టు వయసును చెబుతాయి. ఒక గీత ఒక ఏడాది వయసును చూపిస్తుంది. ఈ గ్రెయిన్స్‌ ఎక్కువగా ఉన్న బ్యాట్ల ధర ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వాడే బ్యాట్‌పై 8 నుంచి 12 గ్రెయిన్స్‌ ఉంటాయి. దీని ధర రూ. 17 వేల నుంచి రూ. 23 వేల వరకూ ఉంటుంది. 

కశ్మీర్‌ విల్లోస్‌తో పోలిస్తే ఇంగ్లిష్‌ విల్లోలపై ఈ గ్రెయిన్స్‌ స్పష్టంగా ఉంటాయి. అలా అని కశ్మీర్‌ విల్లోస్‌పై పూర్తిగా ఉండవని కాదు. అత్యున్నత నాణ్యత ఉన్న కశ్మీర్‌ విల్లోలపై కాస్త తక్కువ క్వాలిటీ ఉన్న ఇంగ్లిష్‌ విల్లోల కంటే ఎక్కువ గ్రెయిన్స్‌ ఉంటాయి. బ్యాట్ కొనే ముందు ఈ గ్రెయిన్స్‌ కనిపిస్తున్నాయా లేదా అన్నది చూడటం ముఖ్యం. ఇంగ్లిష్‌ విల్లో, కశ్మీర్‌ విల్లోల బరువులోనూ తేడా ఉంటుంది. ఇంగ్లిష్‌ విల్లోతో పోలిస్తే కశ్మీర్‌ విల్లోల బరువు ఎక్కువగా ఉంటుంది. కశ్మీర్‌ విల్లోల్లో తేమ శాతం, సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల ఇవి బరువు ఎక్కువగా ఉంటాయి.

ఏ బ్యాట్‌ బెస్ట్‌?

ధరలు చూస్తే హైక్వాలిటీ ఇంగ్లిష్‌ విల్లో కంటే హైక్వాలిటీ కశ్మీరీ విల్లో తక్కువ ధర ఉంటుంది. ప్రొఫెషనల్‌ కెరీర్‌ను ఇప్పుడిప్పుడే మొదలుపెడుతున్న చిన్నారులకైతే హైక్వాలిటీ కశ్మీర్‌ విల్లో బ్యాట్‌ ఉత్తమం. వాళ్ల స్థాయి క్రికెట్‌కు తక్కువ ధరలో ఇదే బెస్ట్‌ బ్యాట్‌. క్రమంగా అవసరమనుకుంటే కాస్త ఎక్కువ ధర పెట్టి ఇంగ్లిష్‌ విల్లో బ్యాట్లకు మారవచ్చు. ఈ ఇంగ్లిష్‌ విల్లోల్లోనూ కొన్ని గ్రేడ్లు ఉంటాయి. అత్యున్నత గ్రేడ్‌ బ్యాట్‌ ధర మన కరెన్సీలో రూ. 70 వేల వరకు కూడా ఉంటుంది.

 

Whats_app_banner

సంబంధిత కథనం