RCB vs KKR virat kohli: విరాట్ కోహ్లి సిక్స్‌ల రికార్డు.. ధోనీ, గేల్‌లనూ మించేశాడు.. ఆర్సీబీలో ఆ ఒక్కడే..
RCB vs KKR virat kohli: విరాట్ కోహ్లి ఈ ఐపీఎల్ 2024లో మరో రికార్డును బ్రేక్ చేశాడు. ఈసారి ఎమ్మెస్ ధోనీ సిక్స్ ల రికార్డును బ్రేక్ చేయడంతోపాటు కోల్‌కతా నైట్ రైడర్స్ పై ఒక్కడే టాప్ స్కోరర్ గా నిలిచాడు.
RCB vs KKR virat kohli: ఐపీఎల్ 2024 ప్రతి మ్యాచ్ లో రికార్డులను బ్రేక్ చేయడమే పనిగా పెట్టుకున్న విరాట్ కోహ్లి.. కోల్‌కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లోనూ మరో కీలకమైన రికార్డు బ్రేక్ చేశాడు. ఈసారి ఒకే ఫ్రాంఛైజీ తరఫున అత్యధిక సిక్స్‌లు కొట్టిన ప్లేయర్ గా ధోనీ రికార్డును బ్రేక్ చేయడమే కాదు.. గేల్, డివిలియర్స్‌లనూ వెనక్కి నెట్టాడు. దీనికితోడు హాఫ్ సెంచరీ చేయడంతో ఆర్సీబీ భారీ స్కోరు చేసింది.
విరాట్ సిక్స్‌ల రికార్డు
విరాట్ కోహ్లి కేకేఆర్ తో మ్యాచ్ లో 59 బంతుల్లోనే 83 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. అతనికి గ్రీన్ (33), మ్యాక్స్‌వెల్ (28), చివర్లో దినేష్ కార్తీక్ (20) మంచి సహకారం అందించడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 రన్స్ చేసింది. ఈ ఇన్నింగ్స్ ద్వారా మరోసారి ఆరెంజ్ క్యాప్ అందుకోవడంతోపాటు ఓ అరుదైన రికార్డునూ బ్రేక్ చేశాడు.
ఈ మ్యాచ్ లో మొత్తంగా కోహ్లి 4 సిక్స్ లు కొట్టాడు. ఈ క్రమంలో అతడు ఒకేసారి ధోనీ, డివిలియర్స్, క్రిస్ గేల్ లను దాటేయడం విశేషం. ఐపీఎల్లో 240వ సిక్స్ కొట్టడం ద్వారా లీగ్ లో అత్యధిక సిక్స్ లు కొట్టిన బ్యాటర్ల లిస్టులో ధోనీ (239) రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. ఇక ఆర్సీబీ తరఫున అత్యధిక సిక్స్ లు కొట్టిన రికార్డును కూడా ఈ ఇన్నింగ్స్ ద్వారానే కోహ్లి అందుకున్నాడు.
ఇప్పటి వరకూ 239 సిక్స్ లతో క్రిస్ గేల్ పేరిట ఈ రికార్డు ఉండేది. అయితే ఈ మ్యాచ్ లో కోహ్లి మొదట డివిలియర్స్ (238), ఆ తర్వాత గేల్ (239) రికార్డులను అధిగమించాడు. ఆర్సీబీ తరఫున 240వ మ్యాచ్ ఆడుతున్న విరాట్.. 241 సిక్స్ లు కొట్టాడు. క్రిస్ గేల్ మొత్తంగా ఐపీఎల్లో 357 సిక్స్ లతో ఎవరికీ అందనంత దూరంలో ఉన్నాడు.
కేకేఆర్‌తోనూ ఒక్కడే..
విరాట్ కోహ్లి ఈ ఏడాది తొలి మ్యాచ్ నుంచీ టాప్ ఫామ్ లో ఉన్నాడు. తొలి మ్యాచ్ లోనే టీ20ల్లో 12 వేల పరుగులు చేసిన తొలి ఇండియన్ గా నిలిచాడు. రెండో మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో టీ20ల్లో వంద 50 ప్లస్ స్కోర్లు చేసిన తొలి ఇండియన్ బ్యాటర్ అయ్యాడు. ఇక ఇప్పుడు మూడో మ్యాచ్ లో ధోనీ, గేల్, డివిలియర్స్ లాంటి వాళ్ల రికార్డులను బ్రేక్ చేశాడు.
అంతేకాదు ఓపెనర్ గా వచ్చిన కోహ్లి చివరి వరకూ అజేయంగా నిలిచాడు. 59 బంతుల్లో 83 రన్స్ చేశాడు కోహ్లి. అతని పోరాటంతోనే ఆర్సీబీ 182 పరుగులు భారీ స్కోరు చేయగలిగింది. డుప్లెస్సి, మ్యాక్స్‌వెల్, గ్రీన్ లాంటి ప్లేయర్స్ జట్టులో ఉన్నా.. ఈ ముగ్గురూ తొలి మూడు మ్యాచ్ లలో విఫలమయ్యారు. దీంతో బ్యాటింగ్ భారమంతా కోహ్లిపైనే పడుతోంది. చివర్లో కార్తీక్ మెరుపులు ఆ టీమ్ కు కాస్త కలిసి వస్తున్నాయి.