Chennai Super Kings: అసలు కెప్టెన్ ధోనీయేనా? రుతురాజ్ డమ్మీ కెప్టెనా? చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్
Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎవరు? ఈ ప్రశ్నకు ఆ టీమ్ ప్లేయర్సే సరిగా సమాధానం చెప్పలేకపోతున్నారు. ధోనీయో, రుతురాజో తేల్చుకోలేకపోతున్నట్లు సీఎస్కే ప్లేయర్ దీపక్ చహర్ అనడం గమనార్హం.
Chennai Super Kings: ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ఒక రోజు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్ కు ధోనీ అప్పగించినట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ధోనీ జట్టులోనే ఉండగా రుతురాజ్ కెప్టెన్సీని సమర్థంగా చేపట్టగలడా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు వాటికి మరింత బలం చేకూరుతోంది. ఫీల్డ్ లో రుతురాజ్ కంటే ధోనీయే ఎక్కువ యాక్టివ్ గా కనిపిస్తున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎవరు?
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ మారినా.. తొలి రెండు మ్యాచ్ లలో రుతురాజ్ కంటే ఎక్కువగా ఫీల్డ్ సెట్ చేయడంలో ధోనీయే కీలకపాత్ర పోషించాడు. తొలి మ్యాచ్ సందర్భంగా ధోనీ ఇలాగే ఫీల్డ్ సెట్ చేస్తుండగా.. కామెంటరీ బాక్స్ లో ఉన్న సెహ్వాగ్, రైనా సరదాగా స్పందిస్తూ.. అసలు రుతురాజే కెప్టెనా అని కామెంట్ చేశారు. రెండో మ్యాచ్ లోనూ అదే జరిగింది.
దీంతో పేరుకే రుతురాజ్ ను కెప్టెన్ ను చేసినా.. మొత్తం ధోనీ హవానే నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా ఆ టీమ్ ప్లేయర్ దీపక్ చహర్ చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. తాను సూచనల కోసం ధోనీవైపు చూడాలో, రుతురాజ్ వైపు చూడాలో అర్థం కావడం లేదని చహర్ అనడం గమనార్హం. గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ తర్వాత అతడీ కామెంట్స్ చేశాడు.
"నేను ప్రతిసారీ మహీ భాయ్, రుతురాజ్ వైపు చూడాల్సి వస్తోంది. ఈ రోజుల్లో ఇద్దరూ ఫీల్డ్ సెట్ చేస్తున్నారు. ఎవరి వైపు చూడాలన్న విషయంలో కాస్త అయోమయంగా ఉంది. ఇప్పుడు రుతురాజ్ బాగానే చేస్తున్నాడు. మెల్లగా అలవాటు పడుతున్నాడు" అని చహర్ అన్నాడు. మంగళవారం (మార్చి 26) గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 63 పరుగులతో గెలిచిన విషయం తెలిసిందే.
బ్యాట్ పట్టని ధోనీ
ఈ సీజన్లో రుతురాజ్ కెప్టెన్సీలో రెండు మ్యాచ్ లలోనూ చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాలు సాధించింది. ఆర్సీబీ, గుజరాత్ టైటన్స్ లాంటి టీమ్స్ ను ఓడించింది. అయినా సీఎస్కే అభిమానుల్లో కాస్త అసంతృప్తి నెలకొంది. దీనికి కారణం ధోనీ ఇప్పటి వరకూ బ్యాట్ పట్టకపోవడమే. రెండు మ్యాచ్ లలోనూ అతడు బ్యాటింగ్ కు దిగలేదు.
ఆర్సీబీతో మ్యాచ్ లో తనకంటే ముందు జడేజాను పంపించారు. జీటీ మ్యాచ్ లో సమీర్ రిజ్విని ధోనీ కంటే ముందు బ్యాటింగ్ కు దింపారు. దీనిపై సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ స్పందించాడు. ధోనీ 8వ స్థానంలో బ్యాటింగ్ కు దిగబోతున్నాడని, అందుకే రెండు మ్యాచ్ లలోనూ బ్యాటింగ్ అవకాశం రాలేదని చెప్పడం గమనార్హం. ఇంపాక్ట్ ప్లేయర్ కారణంగా తమ బ్యాటింగ్ లైనప్ బలం పెరిగిందని, ధోనీకి బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాలేదని అన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తమ తర్వాతి మ్యాచ్ ను మార్చి 31న ఢిల్లీ క్యాపిటల్స్ తో వైజాగ్ లో.. ఏప్రిల్ 5న సన్ రైజర్స్ తో హైదరాబాద్ లో ఆడనుంది. తొలి రెండు మ్యాచ్ లను సొంతగడ్డపై ఆడిన తర్వాత ఆ టీమ్ ఇక ప్రత్యర్థి జట్ల దగ్గరికి వెళ్లనుంది.