Steve Smith on Virat Kohli: విరాట్ కోహ్లియే ప్రపంచంలో బెస్ట్ బ్యాట్స్‌మన్: స్టీవ్ స్మిత్
Steve Smith on Virat Kohli: ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లియే అయిన ఆస్ట్రేలియా గ్రేట్ స్టీవ్ స్మిత్ అన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా నైట్ రైడర్స్ తో ఆర్సీబీ మ్యాచ్ కు ముందు స్మిత్ ఈ కామెంట్స్ చేయడం విశేషం
Steve Smith on Virat Kohli: ప్రపంచ క్రికెట్ లో ఫ్యాబ్ 4గా పిలిచే నలుగురు బెస్ట్ బ్యాటర్లు ఉన్న సంగతి తెలుసు కదా. అందులో విరాట్ కోహ్లితోపాటు స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్ ఉన్నారు. అయితే వీళ్లలోనూ బెస్ట్ బ్యాటర్ విరాట్ కోహ్లియే అని ఈ ఫ్యాబ్ 4లో ఒకడైన స్మిత్ అనడం విశేషం. ఇప్పుడతని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
విరాట్ కోహ్లిపై స్టీవ్ స్మిత్
విరాట్ కోహ్లియే ప్రస్తుతం వరల్డ్ బెస్ట్ బ్యాటర్ అన్నది చాలా మంది ఇండియన్ ఫ్యాన్స్ వాదన. అన్ని ఫార్మాట్లలోనూ అతడిని మించిన బ్యాటర్ లేడని నమ్మకంగా చెబుతారు. అయితే టెస్ట్ క్రికెట్ లో మాత్రం కోహ్లి కంటే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్టాట్స్ బాగున్నాయి. ఆ ఫార్మాట్లో కోహ్లి కంటే కూడా స్మిత్ అత్యుత్తమంగా రాణించాడు.
బ్రాడ్‌మన్ తర్వాత టెస్టుల్లో అత్యుత్తమ సగటు కూడా అతనిదే. అందుకే కోహ్లితోపాటు ఫ్యాబ్ 4లో స్మిత్ పేరు కూడా చేర్చారు. కానీ అలాంటి స్మిత్ కూడా కోహ్లియే వరల్డ్ బెస్ట్ బ్యాటర్ అన్నాడు. ప్రముఖ యూట్యూబర్ క్యారీ మినాటీ అడిగిన ప్రశ్నకు స్మిత్ స్పందించాడు. స్టార్ స్పోర్ట్స్ లో మాట్లాడుతున్న సమయంలో అతడు స్మిత్ ను ఈ ప్రశ్న అడిగాడు.
"ఫ్యాబ్ 4లోనూ ఎవరు బెస్ట్ బ్యాట్స్‌మన్ అని మీరు అనుకుంటున్నారు" అని స్మిత్ ను క్యారీ మినాటీ అడిగాడు. దీనిపై స్మిత్ స్పందిస్తూ.. "నా వరకు వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లియే" అని స్పష్టం చేశాడు. అంతటి బ్యాటర్ కూడా కోహ్లి పేరు చెప్పడంతో అతని అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి.
ఆర్సీబీ వెర్సెస్ కేకేఆర్
ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కు ముందు స్మిత్ ఈ కామెంట్స్ చేశాడు. ఇప్పటికే ఆర్సీబీ ఈ సీజన్ లో రెండు మ్యాచ్ లలో ఒకటి గెలిచి, మరొకటి ఓడింది. ఇప్పుడు సొంతగడ్డపై కేకేఆర్ తో తలపడబోతోంది. ఈ జట్టుకు మెంటార్ గా కోహ్లి చిరకాల ప్రత్యర్థి గౌతమ్ గంభీర్ ఉన్నాడు. దీంతో మ్యాచ్ కంటే కూడా ఈ ఇద్దరి మధ్య ఏం జరగనుందన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
గతేడాది లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో ఉన్న గంభీర్ తో విరాట్ కోహ్లి గొడవ పడటం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ టీమ్ ప్లేయర్ నవీనుల్ హక్ తో కోహ్లి గొడవపడటం, మ్యాచ్ ముగిసిన తర్వాత నవీన్ కు మద్దతుగా కోహ్లితో గంభీర్ గొడవకు దిగడం అభిమానులను షాక్ కు గురి చేసింది. అంతకుముందు కూడా ఈ ఇద్దరూ ఐపీఎల్ సందర్భంగా గొడవపడ్డారు. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.
ఆర్సీబీ తుది జట్టు అంచనా
ఫాఫ్ డుప్లెస్సి, విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనూజ్ రావత్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్.