RCB vs KKR: కోహ్లి జోరును కోల్‌కతా అడ్డుకుంటుందా? - ఆర్‌సీబీపై కేకేఆర్‌దే డామినేషన్ కొనసాగుతుందా?
RCB vs KKR: ఐపీఎల్‌లో నేడు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.
RCB vs KKR: ఐపీఎల్‌లో నేడు(శుక్రవారం) కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి కోహ్లిపైనే ఉంది.
కోహ్లి రికార్డులు...
ఐపీఎల్‌లో కోల్‌కతాపై కోహ్లికి మంచి రికార్డు ఉంది. ఈ జట్టుపై ఇప్పటివరకు 861 రన్స్ చేశాడు కోహ్లి. కేకేఆర్‌పై అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో నాలుగో స్థానంలో కోహ్లి కొనసాగుతోన్నాడు. అంతే కాకుండా కోల్‌కతా జట్టుపై ఓ సెంచరీ కూడా సాధించాడు కోహ్లి.2019 సీజన్‌లో 58 బాల్స్‌లోనే 100 పరుగులు చేసి కోల్‌కతా బౌలర్లను తక్కు రేగ్గొట్టాడు. మరోసారి ఆ మ్యాచ్ ప్రదర్శనను రిపీట్ చేయాలని కోహ్లి అభిమానులు భావిస్తోన్నారు.
కోల్‌కతాదే పై చేయి...
ఐపీఎల్‌లో ఇప్పటివరకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య 32 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 18 మ్యాచుల్లో కేకేఆర్ విజయం సాధించగా...ఆర్‌సీబీ 14 మ్యాచులు గెలిచింది.
చివరగా జరిగిన ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో కేకేఆర్ నెగ్గగా ఒకే ఒక మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలిచింది. 2023 సీజన్‌లో కేకేఆర్ చేతిలో రెండు సార్లు బెంగళూరు ఓటమి పాలైంది. గత రికార్డుల పరంగా చూసుకుంటే ఆర్‌సీబీపై కేకేఆర్‌దే ఆధిపత్యం కనిపిస్తోంది. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ లోయెస్ట్ స్కోరు 49 పరుగుల చెత్త రికార్డు కేకేఆర్‌పై ఉంది. ఆ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని బెంగళూరు భావిస్తోంది.
మార్పులు ఉంటాయా...
2024 సీజన్‌ను ఓటమితోనే మొదలుపెట్టింది ఆర్‌సీబీ. తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓటమి పాలైన బెంగళూరు ఆ తర్వాత పంజాబ్ పై గెలిచింది. పంజాబ్‌తో మ్యాచ్‌లో కోహ్లి 77 పరుగులతో రాణించాడు. కోల్‌కతాపై కోహ్లి దంచికొట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. అతడితో పాటు మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్ బ్యాట్ ఝులిపించాల్సిన అవసరం ఉంది.
వరుస వైఫల్యాలతో నిరాశపరుస్తోన్న రజత్ పాటిదార్ నేటి మ్యాచ్‌లో చోటు దక్కడం అనుమానంగానే కనిపిస్తోంది. అంజురావత్, దినేష్ కార్తిక్ చివరలో మెరుపులు మెరిపించడంతో ఆర్‌సీబీకి సానుకూలంశంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో సిరాజ్‌పైనే ఎక్కువగా ఆశలు ఉన్నాయి. బెంగళూరు బౌలింగ్ లైనప్ ఏమంత గొప్పగా లేదు.
రసెల్ మెరుపులు మెరిపిస్తే...
కోల్‌కతా గెలుపు ఆశలు కెప్టెన్ రసెల్‌పైనే ఎక్కువగా ఉన్నాయి. రసెల్ విధ్వంసాన్ని అడ్డుకోకపోతే బెంగళూరుకు కష్టమే. సన్‌రైజర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 25 బాల్స్‌లో ఏడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 64 పరుగులు చేశాడు రసెల్.
ఫిలిప్ సాల్ట్, రింకు సింగ్ లాంటి హిట్టర్లు కేకేఆర్‌లో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా ఫామ్‌లోకి రావాల్సివుంది. బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్‌తో పాటు వరుణ్ చక్రవర్తితో పాటు గత ఏడాది మెరుపులు మెరిపించిన సూయాస్ శర్మ కేకేఆర్‌కు కీలకం కానున్నారు. బౌలింగ్ పరంగా కేకేఆర్ తుది జట్టులో మార్పులు చేసేలా కనిపిస్తోంది.