RCB Failure Reason: అంతా అతడే చేశాడు.. ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరకపోవడానికి కారణం ఎవరో చెప్పిన డుప్లెసిస్
RCB Failure Reason: బెంగళూరు ప్లేఆఫ్స్ చేరకపోవడానికి గల కారణమేంటో ఫాఫ్ డుప్లెసిస్ వివరించాడు. ఈ సీజన్‌లో దినేశా కార్తీక్ ఘోరంగా విఫలమయ్యాడు. అతడు ఫామ్ పుంజుకున్నట్లయితే చాలా మ్యాచ్‌ల్లో గెలిచి ఉండేవాళ్లమని తెలిపాడు.
RCB Failure Reason: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2023 సీజన్‌ను ఓటమితో ముగించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్‌పై ఓడటంతో ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలగడంతో పాటు ఓటమిని ఎదుర్కొంది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచిన ఈ జట్టు 14 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లే దక్కించుకుంది. గుజరాత్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లోనూ 198 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్.. ఓటమికి కారణమేంటో చెప్పాడు. మిడిలార్డర్‌లో దినేశ్ కార్తిక్ పూర్ ఫామ్ వల్ల చాలా మ్యాచ్‌ల్లో ఓడిపోయామని స్పష్టం చేశాడు.
“గతేడాది దినేశ్ కార్తిక్ మంచి ఫామ్‌లో ఉండి మెరుగైన ఫినిషింగ్ ఇచ్చాడు. ఫలితంగా ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాం. కానీ ఈ ఏడాది మాత్రం అతడు పెద్దగా రాణించలేదు. మిగిలిన జట్లను గమనిస్తే.. ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో మంచి హిట్టర్లు ఉన్నారు. మాకు, ఇతరులకు అదే తేడా” అని డుప్లెసిస్ అన్నాడు.
ఒక్క సీజన్‌లో నాలుగు సార్లు డకౌటయ్యాడు దినేశ్ కార్తిక్. ఈ ఘనత సాధించిన ఏడో ప్లేయర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. సింగిల్ సీజన్‌లో ఎక్కువ సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా జాస్ బట్లర్ అందరికంటే ముందున్నాడు. ఈ సీజన్‌లో అతడు ఐదు సార్లు డకౌట్‌గా నిలిచాడు. దినేశ్ కార్తిక్ నాలుగు సార్లు డకౌటై.. హర్షలీ గిబ్స్, శిఖర్ ధావన్, ఇయన్ మోర్గాన్ సరసన నిలిచాడు.
ఇక ఆదివారం నాడు జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుపై గుజరాత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. 198 పరుగుల లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలుండగానే ఛేదించింది గుజరాత్. శుబ్‌మన్ గిల్ అద్భుత శతకంతో తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 52 బంతుల్లో 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 5 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అతడికి తోడు విజయ్ శంకర్(53) అర్ధశతకంతో చక్కటి సహకారం అందించడంతో గుజరాత్ సులభంగా గెలిచింది. అంతకుముందు ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటంతో అద్భుత సెంచరీ సాధించి ఐపీఎల్‌లోనే అత్యధిక శతకాలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అయినప్పటికీ ఆర్సీబీ బౌలర్లు చేతులెత్తేయడంతో గుజరాత్ సులభంగా విజయాన్ని అందుకుంది.