Faf du Plessis on Dhoni: ధోనీ నుంచి నేర్చుకున్నది అదే.. డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు
Faf du Plessis on Dhoni: ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్.. చెన్నై సారథి ఎంఎస్ ధోనీ గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. ధోనీ నుంచి తను నేర్చుకున్న లక్షణమేంటో తెలియజేశాడు. ధోనీ ప్రశాంతత అంటే తనకు ఇష్టమని స్పష్టం చేశాడు.
Faf du Plessis on Dhoni: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ప్రస్తుతం అద్భుత ఫామ్‌తో సూపర్‌గా బ్యాటింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. అంతేకాకుండా ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే రెండేళ్ల క్రితం వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన డుప్లెసిస్.. గతేడాది నుంచి ఆర్సీబీ నుంచి ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పాత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ కెప్టెన్సీలో చాలా నేర్చుకున్నానని, ముఖ్యంగా అతడి ప్రశాంతంగా ఉండే నైజం(Calmness) తనకు ఎంతో ఇష్టమని, ఆ గుణాన్ని అతడి నుంచి అలవర్చుకున్నానని స్పష్టం చేశాడు.
"ఎంఎస్ ధోనీ నుంచి ఏదైనా నేర్చుకున్నానంటే అది అతడి ప్రశాంతతే. నా లీడర్షిప్‌లోనూ ఆ లక్షణాన్ని ప్రదర్శిస్తుంటాను. నేను ప్రతిసారి నా ప్లేయర్స్‌తో క్లియర్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తాను. అత్యుత్తమంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతూ వెళ్తుంటాను. ఎంఎస్ నుంచి నేను ఆ విషయాన్నే నేర్చుకున్నాను. అందుకే అతడిని కెప్టెన్ కూల్ అని అంటారు. ప్రశాంతంగా ఉండటంలో ధోనీ కంటే మెరుగైన వాళ్లు లేరనే చెప్పాలి." అని డుప్లెసిస్ తెలిపాడు.
కెప్టెన్సీలో ఇతరుల నుంచి నేర్చుకుంటూ సొంత నాయకత్వ శైలికి మద్దతు ఇవ్వాలని డుప్లెసిస్ చెప్పాడు. "నేను దూరం నుంచి ఎంఎస్ ధోనీ నుంచి గమనిస్తున్నాను. అతడు ఎందుకు అంత విజయవంతమైన కెప్టెన్ అయ్యాడు? అతడిని ఇంతగా సక్సెస్ అవడానికి కారణమేంటి? లాంటి విషయాలను పరిశీలించాను. ఇదే సమయంలో లీడర్‌గా ఉండటంలో ఉన్న ప్రాముఖ్యతను చాలా ప్రారంభంలోనే తెలుసుకున్నాను. నేను ధోనీ, కోహ్లీ, గ్రేమ్ స్మిత్, స్టీఫెన్ ఫ్లెమింగ్ లాంటి కెప్టెన్‌ల్లా ఉండలేను. సొంతంగా నాకంటూ కొన్ని విషయాలను నేర్చుకున్నాను. అలాగే ఇతరుల నుంచి కొన్ని విషయాలను తెలుసుకోవాలి." అని డుప్లెసిస్ అన్నాడు.
ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు జరిగిన మెగా వేలంలో డుప్లెసిస్‌ను ఆర్సీబీ సొంతం చేసుకుంది. కోహ్లీ కెప్టెన్‌గా వైదొలగడంతో ఆ బాధ్యతలను డుప్లెసిస్‌కు అప్పగించింది. అతడి కెప్టెన్సీలో ఆర్సీబీ గతేడాది ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. ప్రస్తుతం టాప్-4లోకి వెళ్లేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తోంది.