Virat Kohli: రెండు నెలలు సెలబ్రిటీలా కాకుండా సాధారణ జీవితం గడిపాను.. చాలా బాగుంది: విరాట్ కోహ్లి-virat kohli on his break and life in london kohli talks about his not being recognized life rcb vs pbks ipl 2024 news ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli: రెండు నెలలు సెలబ్రిటీలా కాకుండా సాధారణ జీవితం గడిపాను.. చాలా బాగుంది: విరాట్ కోహ్లి

Virat Kohli: రెండు నెలలు సెలబ్రిటీలా కాకుండా సాధారణ జీవితం గడిపాను.. చాలా బాగుంది: విరాట్ కోహ్లి

Hari Prasad S HT Telugu
Mar 26, 2024 02:47 PM IST

Virat Kohli: తన భార్య అనుష్క డెలివరీ కోసం లండన్ వెళ్లిన విరాట్ కోహ్లి అక్కడ రెండు నెలల పాటు సాధారణ జీవితం గడిపానని, చాలా బాగా అనిపించిందని చెప్పడం గమనార్హం.

రెండు నెలలు సెలబ్రిటీలా కాకుండా సాధారణ జీవితం గడిపాను.. చాలా బాగుంది: విరాట్ కోహ్లి
రెండు నెలలు సెలబ్రిటీలా కాకుండా సాధారణ జీవితం గడిపాను.. చాలా బాగుంది: విరాట్ కోహ్లి

Virat Kohli: విరాట్ కోహ్లిలాంటి ప్లేయర్స్ ఇండియాలో ఎక్కడికి వెళ్లినా వేల మంది ఫ్యాన్స్ చుట్టుముడతారు. దీంతో అలాంటి సెలబ్రిటీలు ఓ సాధారణ జీవితం గడపటం చాలా కష్టం. కానీ తన భార్య అనుష్క శర్మ డెలివరీ కోసం లండన్ వెళ్లిన కోహ్లి.. అక్కడ రెండు నెలల పాటు సెలబ్రిటీలా కాకుండా సాధారణంగా గడిపినట్లు చెప్పాడు. ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ తర్వాత అతడు మాట్లాడాడు.

లండన్‌లో విరాట్ కోహ్లి

వ్యక్తిగత కారణాలంటూ ఇండియా, ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు విరాట్ కోహ్లి. చివరికి భార్య అనుష్క శర్మ రెండో డెలివరీ కోసం లండన్ వెళ్లాడని తేలింది. అక్కడే కోహ్లి, అనుష్కలకు ఓ బాబు జన్మించిన విషయం తెలిసిందే. అతని పేరును అకాయ్ అని పెట్టారు. అయితే రెండు నెలలు తాను లండన్ లో గడిపిన జీవితాన్ని తాజాగా కోహ్లి గుర్తు చేసుకున్నాడు.

ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ తర్వాత మాట్లాడిన కోహ్లి.. క్రికెట్ నుంచి దొరికిన ఆ బ్రేక్ గురించి స్పందించాడు. అక్కడ స్థానికులు ఎవరూ తనను గుర్తు పట్టకపోవడంతో హాయిగా రోడ్లపై తిరిగినట్లు చెప్పాడు. "మేము అప్పుడు ఇండియాలో లేము. మమ్మల్ని అక్కడి వ్యక్తులు గుర్తించని ప్రాంతంలో ఉన్నాం. కుటుంబంతోనే రెండు నెలల పాటు ఓ సాధారణ జీవితం గడిపాను. నాకు, నా కుటుంబానికి అది అద్భుతమైన అనుభూతి" అని కోహ్లి అన్నాడు.

ఫ్యామిలీతో వీడియో కాల్

పంజాబ్ కింగ్స్ పై మ్యాచ్ గెలిచిన తర్వాత అనుష్క శర్మ, తన కూతురు వామికాతో కోహ్లి వీడియో కాల్ మాట్లాడాడు. ఇక ఈ మధ్యే రెండో సంతానం కలగడంపైనా కోహ్లి స్పందించాడు. "కుటుంబం పరంగా ఇద్దరు సంతానం కలిగిన తర్వాత పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఫ్యామిలీతో కలిసి గడపడం, వామికాతో బంధం బలపరచుకోవడం. ఇంత మంచి సమయం కుటుంబంతో కలిపి గడిపేందుకు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓ సాధారణ వ్యక్తిలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం కూడా చాలా బాగా అనిపించింది" అని కోహ్లి అన్నాడు.

ఇక టీ20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లి ఆడతాడన్న వార్త చుట్టూ నెలకొన్న బజ్ పైనా అతడు స్పందించాడు. నిజానికి ఈ వరల్డ్ కప్ కరీబియన్ దీవులు, అమెరికాలో జరుగుతుండటంతో కోహ్లి ఆడటం గేమ్ ప్రమోషన్ కు బాగా పనికొస్తుందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ పీటర్సన్ అనడం.. అలాంటిదేమీ అవసరం లేదు.. గేమ్ ప్రమోషన్ కంటే కప్పు గెలవడమే ముఖ్యమని మాజీ కోచ్ రవిశాస్త్రి కౌంటర్ వేయడంపై కోహ్లి మాట్లాడాడు.

గేమ్ ను ప్రమోట్ చేయడానికి ఇప్పటికీ తన పేరు వాడుకుంటున్నారని, నిజానికి టీ20 క్రికెట్ ఆడే సత్తా ఇంకా తనలో ఉందని కోహ్లి అన్నాడు. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ విజయంలో కోహ్లి కీలకపాత్ర పోషించాడు. అతడు 49 బంతుల్లోనే 11 ఫోర్లు, 2 సిక్స్ లతో 77 రన్స్ చేశాడు. కోహ్లికి తోడు చివర్లో దినేష్ కార్తీక్, మహిపాల్ లోమ్రోర్ చెలరేగడంతో 4 బంతులు మిగిలి ఉండగా 177 రన్స్ టార్గెట్ చేజ్ చేసింది ఆర్సీబీ.

IPL_Entry_Point