Virat Kohli: గుడ్‍న్యూస్: విరాట్ కోహ్లీ, అనుష్క శర్మకు రెండో సంతానం.. పేరు కూడా వెల్లడి-virat kohli anushka sharma welcomes baby boy his name is akaay ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli: గుడ్‍న్యూస్: విరాట్ కోహ్లీ, అనుష్క శర్మకు రెండో సంతానం.. పేరు కూడా వెల్లడి

Virat Kohli: గుడ్‍న్యూస్: విరాట్ కోహ్లీ, అనుష్క శర్మకు రెండో సంతానం.. పేరు కూడా వెల్లడి

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 20, 2024 09:17 PM IST

Virat Kohli - Anushka Sharma: విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ రెండోసారి తల్లిదండ్రులయ్యారు. ఈ గుడ్‍న్యూస్‍ను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పిల్లాడికి పేరు కూడా పెట్టేశారు.

Virat Kohli: విరాట్ కోహ్లీ, అనుష్క శర్మకు రెండో సంతానం.. పేరు కూడా వెల్లడి
Virat Kohli: విరాట్ కోహ్లీ, అనుష్క శర్మకు రెండో సంతానం.. పేరు కూడా వెల్లడి

Virat Kohli - Anushka Sharma: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అతడి భార్య- బాలీవుడ్ నటి అనుష్క శర్మ తమ రెండో సంతానాన్ని పొందారు. పండంటి మగ పిల్లాడికి అనుష్క జన్మనిచ్చారు. ఫిబ్రవరి 15వ తేదీన ఈ బిడ్డ జన్మించాడని నేడు (ఫిబ్రవరి 20) అధికారికంగా ప్రకటించారు అనుష్క. దీంతో క్రికెట్‍కు కొంతకాలంగా విరాట్ ఎందుకు దూరంగా ఉన్నాడో సస్పెన్స్ వీడింది. తమ రెండో సంతానం గురించి ఇన్‍స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు అనుష్క శర్మ.

తమ కుమారుడికి అకాయ్ (Akaay) అని పేరు పెట్టినట్టు అనుష్క శర్మ వెల్లడించారు. వామికాకు తమ్ముడు వచ్చేశాడని సంతోషం వ్యక్తం చేశారు. తమ జీవితాల్లో ఇది అందమైన సమయమని, ప్రస్తుతం అందరూ తమ ప్రైవసీని గౌరవించాలని అనుష్క కోరారు.

అందరి ఆశీర్వాదాలను తాము కోరుతున్నామని అనుష్క తెలిపారు. “సంపూర్ణమైన ఆనందం, హృదయాల నిండా ప్రేమతో ఫిబ్రవరి 15వ తేదీన మా అబ్బాయి అకాయ్‍ను మేం స్వాగతించామని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాం. వామికా బుజ్జి తమ్ముడిని ఈ ప్రపంచంలోకి స్వాగతించాం. మా జీవితాల్లోని ఈ అందమైన సమయంలో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు కోరుకుంటున్నాం. ఈ సమయంలో మా ప్రైవసీని గౌరవించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. ప్రేమ, కృతజ్ఞతలతో విరాట్, అనుష్క” అంటూ ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు అనుష్క శర్మ.

జూనియర్ కోహ్లీ వచ్చేశాడు

రెండోసారి తల్లిదండ్రులు అయిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మకు చాలా మంది సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన సెలెబ్రిటీలతో పాటు నెటిజన్లు భారీ స్థాయిలో వారికి కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. జూనియర్ కోహ్లీ వచ్చేశాడని చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సస్పెన్స్ వీడింది

ఇంగ్లండ్‍తో స్వదేశంలో టీమిండియా ఆడుతున్న టెస్టు సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ సడెన్‍గా తప్పుకున్నారు. ఈ సిరీస్‍కు ఎంపికైనా వ్యక్తిగత కారణాలతో ఆడలేనని చెప్పారు. అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని బీసీసీఐ కూడా వెల్లడించింది. దీంతో ఏం జరిగింది, కోహ్లీ ఎందుకు ఆడడం లేదని చాలా మంది క్రికెట్ అభిమానులు కంగారు పడ్డారు. అయితే, విరాట్ కోహ్లీ, అనుష్క త్వరలో రెండో సంతానాన్ని పొందనున్నారని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డెవిలియర్స్ చెప్పినా.. అతడే మళ్లీ కాదని అన్నారు. వ్యాపారవేత్త హర్ష గోయెంకా కూడా విరాట్ రెండోసారి తండ్రి కానున్నాడని హింట్ ఇచ్చారు. త్వరలో రానున్న బేబీ తన తండ్రిలా క్రికెటర్ అవుతారా.. తల్లిలా ఫిల్మ్ స్టార్ అవుతారా? అని ట్వీట్ చేశారు. లండన్‍లో ఆ బేబీ జన్మించనున్నారని కూడా తెలిపారు. దీంతో ఆ ట్వీట్ విరాట్ కోహ్లీ, అనుష్క గురించేనని అర్థమైంది.

ఎట్టకేలకు తాము రెండో సంతానం పొందామని విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ నేడు ప్రకటించారు. దీంతో క్రికెట్‍కు కోహ్లీ ఎందుకు బ్రేక్ తీసుకున్నాడనే ఉత్కంఠ వీడింది. శుభవార్తతోనే ఈ సస్పెన్స్ ముగిసింది. దీంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మకు 2017లో వివాహమైంది. 2021లో వారికి వామిక అనే అమ్మాయి పుట్టారు. ఇప్పుడు, 15 ఫిబ్రవరి 2024న రెండో సంతానంగా అబ్బాయి అకాయ్ వారికి జన్మించారు.

IPL_Entry_Point