Virat Kohli: టీమిండియాకు షాక్.. ఇంగ్లండ్‍తో తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరం-virat kohli withdraws from first two tests against englandwithdraws from first two tests against england ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli: టీమిండియాకు షాక్.. ఇంగ్లండ్‍తో తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరం

Virat Kohli: టీమిండియాకు షాక్.. ఇంగ్లండ్‍తో తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరం

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 22, 2024 03:52 PM IST

Virat Kohli - India vs England: ఇంగ్లండ్‍తో టెస్టు సిరీస్‍కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ సిరీస్‍లో తొలి రెండు టెస్టులకు భారత స్టార్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రకటించింది. ఆ వివరాలివే..

Virat Kohli: టీమిండియాకు షాక్.. ఇంగ్లండ్‍తో తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరం
Virat Kohli: టీమిండియాకు షాక్.. ఇంగ్లండ్‍తో తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరం (PTI)

Virat Kohli - India vs England: ఇంగ్లండ్‍తో స్వదేశంలో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‍కు ముందు భారత్‍కు షాక్ ఎదురైంది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఈ సిరీస్‍లో తొలి టెస్టులకు దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లీ ఈ రెండు మ్యాచ్‍ల నుంచి నిష్క్రమించాడని బీసీసీఐ నేడు (జనవరి 22) అధికారికంగా ప్రకటించింది. ఇంగ్లండ్‍తో సిరీస్‍లో తొలి రెండు టెస్టులకు జట్టును ఇటీవలే బీసీసీఐ ప్రకటించింది. అయితే, ఇప్పుడు రెండు టెస్టుల కోహ్లీ ఔట్ అయ్యాడు.

ఇంగ్లండ్‍తో సిరీస్‍లో తొలి రెండు మ్యాచ్‍ల్లో విరాట్ కోహ్లీ ఆడడం లేదని బీసీసీఐ వెల్లడించింది. అయితే, కోహ్లీకి రిప్లేస్‍మెంట్‍ను ప్రకటించలేదు. త్వరలోనే సెలెక్షన్ కమిటీ.. రిప్లేస్‍మెంట్ ఆటగాడిని ప్రకటిస్తుందని పేర్కొంది. భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జనవరి 25వ తేదీన మొదలు కానుంది. హైదరాబాద్ వేదికగా జనవరి 25 నుంచి తొలి టెస్టు జరగనుంది.

పుకార్లు వద్దు

విరాట్ కోహ్లీ రెండు టెస్టులకు దూరం అవడం ఎలాంటి రూమర్లు వ్యాపింపజేయవద్దని బీసీసీఐ సూచించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, సెలెక్టెర్లు, టీమ్‍ మేనేజ్‍మెంట్‍తో కోహ్లీ మాట్లాడాడని తెలిపింది. కోహ్లీకి ఎప్పుడైనా దేశమే తొలి ప్రాధాన్యమని తెలిపింది. అయితే, తాను ఉండక తప్పని వ్యక్తిగత పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రస్తుతం ఏర్పడ్డాయని బీసీసీఐ పేర్కొంది. కోహ్లీ వ్యక్తిగత కారణాలపై ఫ్యాన్స్, మీడియా ఊహాగానాలు వ్యాప్తి చేయవద్దని బీసీసీఐ సూచించింది. 

2023-25 టెస్టు చాంపియన్‍షిప్ సైకిల్‍లో అత్యంత ముఖ్యమైన ఇంగ్లండ్ సిరీస్‍కు విరాట్ కోహ్లీ దూరమవడం టీమిండియాకు ఎదురుదెబ్బగా ఉంది. అయితే, మూడో టెస్టు నుంచి అతడు తిరిగి జట్టులోకి వస్తాడని తెలుస్తోంది. 

కోహ్లీ దూరమవటంతో ఇంగ్లండ్‍తో తొలి రెండు టెస్టుల్లో రోహిత్ శర్మతో యశస్వి జైస్వాల్ ఓపెనింగ్‍కు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  మూడో స్థానంలో శుభ్‍మన్ గిల్ ఆడే ఛాన్స్ ఉంది. కోహ్లీకి రిప్లేస్‍మెంట్‍గా ఎవరిని సెలెక్టర్లు ఎంపిక చేస్తారో చూడాలి.

టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే

భారత్ ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు హైదరాబాద్‍లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జనవరి 25 నుంచి జనవరి 29 వరకు జరగనుంది. రెండో టెస్టు విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2న ప్రారంభం కానుంది. మూడో టెస్టు ఫిబ్రవరి 15న (రాజ్‍కోట్) షురూ అవుతుంది. రాంచీలో నాలుగో టెస్టు ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు జరుగుంది. ఐదో టెస్టు మార్చి 7న మొదలవుతుంది. మార్చి 11న ఈ సిరీస్ ముగియనుంది.  2023-25 టెస్టు చాంపియన్‍షిప్ పాయింట్ల పట్టికలో మళ్లీ టాప్‍లోకి వచ్చేందుకు టీమిండియాకు ఈ సిరీస్ కీలకంగా ఉండనుంది.

ఇంగ్లండ్‍తో తొలి రెండు టెస్టులకు ఎంపికైన భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్‍దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్‍ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్

Whats_app_banner