Virat Kohli: విరాట్ కోహ్లీ బ్రేక్ తీసుకునేందుకు కారణం ఇదే: ఏబీ డెవిలియర్స్ ఏం చెప్పాడంటే..
Virat Kohli - IND vs ENG: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్‍తో సిరీస్‍లో తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకున్నాడు. అయితే, కోహ్లీ విరామం తీసుకునేందుకు కారణాన్ని ఏబీ డివిలియర్స్ తాజాగా వెల్లడించాడు.
Virat Kohli: స్వదేశంలో ఇంగ్లండ్‍తో జరుగుతున్న టెస్టు సిరీస్‍లో తొలి రెండు మ్యాచ్‍లకు భాతర స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్రేక్ తీసుకున్నాడు. తదుపరి మూడు టెస్టులకు అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అయితే, విరాట్ కోహ్లీ ఎందుకు విరామం తీసుకున్నాడన్న విషయం సస్పెన్స్‌గా ఉంది. వ్యక్తిగత కారణాలతో రెండు టెస్టుల నుంచి విరాట్ తప్పుకున్నాడని, అతడి ప్రైవసీని గౌరవించాలని బీసీసీఐ కూడా పేర్కొంది. అయితే, విరాట్ కోహ్లీ బ్రేక్ ఎందుకు తీసుకున్నాడో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ టీమ్‍మేట్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డెవిలియర్స్ వెల్లడించాడు.
విరాట్ కోహ్లీ బ్రేక్ తీసుకోవడంతో అతడు ఎలా ఉన్నాడంటూ యూట్యూబ్ లైవ్‍లో కొందరు నెటిజన్లు డెవిలియర్స్‌ను ప్రశ్నించారు. విరాట్‍తో మాట్లాడావా అని అడిగారు. దీంతో డెవిలియర్స్ స్పందించాడు. కోహ్లీ బాగున్నాడని చెప్పాడు. త్వరలో రెండో సంతానాన్ని విరాట్ పొందనున్నాడని తెలిపాడు. ప్రస్తుతం కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాడని వెల్లడించాడు.
సంతోషంగా ఉన్నాడు
“అతడు (విరాట్ కోహ్లీ) బాగున్నాడని నాకు తెలుసు. అతడు ప్రస్తుతం తన కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాడు. రెండు టెస్టు మ్యాచ్‍ల నుంచి అతడు వైదొలగడం వెనుక కారణం ఇదే. ఇంతకంటే నేను ఎక్కువగా చెప్పలేను. అతడిని మళ్లీ చేసేందుకు నేను వేచిచూడలేకున్నా. అతడు బాగున్నాడు.. సంతోషంగా ఉన్నాడు” అని డెవిలియర్స్ చెప్పాడు.
విరాట్ కోహ్లీ తనకు ఏం చెప్పాడో డెవిలియర్స్ వెల్లడించాడు. తాను బాగానే ఉన్నానని, కుటుంబానికి సమయం కేటాయించాల్సిన అవసరం వచ్చిందని కోహ్లీ తనకు తెలిపాడని వెల్లడించాడు.
సరైన నిర్ణయం
విరాట్ కోహ్లీ త్వరలోనే రెండో సంతానాన్ని పొందనున్నాడని డెవిలియర్స్ చెప్పాడు. విరాట్ బ్రేక్ తీసుకోవడం సరైన విషయమేనని అన్నాడు. “అవును, త్వరలో రెండో సంతానం (కోహ్లీకి) రానుంది. ఇది ఫ్యామిలీ టైమ్. ఇది అతడికి చాలా ముఖ్యమైనది. మనకు మనం నిజాయితీతో జెన్యూన్‍గా ఉండాలి. చాలా మంది ప్రాధాన్యత కుటుంబమే అయి ఉంటుంది. ఈ విషయంలో విరాట్‍ను ఎవరూ జడ్జ్ చేయకూడదు. మనం అతడిని మిస్ అవుతున్నాం. కానీ అతడు సరైన నిర్ణయం తీసుకున్నాడు” అని డెవిలియర్స్ చెప్పాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ, టీమ్ మేనేజ్‍మెంట్‍తో మాట్లాడిన తర్వాతే విరాట్ కోహ్లీ.. తొలి రెండు టెస్టుల నుంచి బ్రేక్ తీసుకున్నాడని బీసీసీఐ తెలిపింది. కోహ్లీ ప్రైవసీని అభిమానులు గౌరవించాలని, ఈ విషయంలో పుకార్లు వ్యాపింపచేయవద్దని తెలిపింది.
“వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లండ్‍తో తొలి రెండు టెస్టుల నుంచి వైదొలిగేందుకు విరాట్ కోహ్లీ బీసీసీఐని కోరాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, టీమ్ మేనేజ్‍మెంట్, సెలెక్టర్లతో ఈ విషయంపై విరాట్ మాట్లాడాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించడమే అతడికి ఎప్పడూ ప్రాధాన్యంగా ఉంటుంది. అయితే, అతడు తప్పక ఉండాల్సిన వ్యక్తిగత పరిస్థితులు ఏర్పడ్డాయి” అని బీసీసీఐ పేర్కొంది.
విరాట్ భార్య అనుష్క శర్మ గర్భంతో ఉన్నారని కొంతకాలంగా రూమర్స్ వస్తున్నాయి. అయితే, డెవిలియర్స్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు.
హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. ఐదు టెస్టుల సిరీస్‍లో 0-1తో వెనుకబడింది. ప్రస్తుతం విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఆధిపత్యం చూపిస్తోంది. కాగా, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా కూడా గాయాలపాలయ్యారు. ఈ తరుణంలో మూడో టెస్టుకు విరాట్ కోహ్లీ.. టీమిండియాలోకి వస్తాడా.. బ్రేక్ కొనసాగిస్తాడా అనేది చూడాలి.
సంబంధిత కథనం